మేడిగడ్డ బ్యారేజీలకు కొత్త టెండర్లే

21 Jan, 2016 03:23 IST|Sakshi
మేడిగడ్డ బ్యారేజీలకు కొత్త టెండర్లే

పాతవారికే కట్టబెట్టాలన్న సూచనను తిరస్కరించిన సీఎం
కొత్త స్టాండర్డ్ రేట్ల ఆధారంగానే వారంలో టెండర్లు

 
 సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైనింగ్‌లో భాగంగా కాళేశ్వరం దిగువన ఉన్న మేడిగడ్డ ప్రాంతం నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించే మార్గంలో నిర్మించే బ్యారేజీలకు కొత్తగా టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మారిన కాంట్రాక్టు పద్ధతుల నేపథ్యంలో పాత కాంట్రాక్టర్లకే పనులు అప్పగించడం సహేతుకం కాదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం చేసినట్లు తెలిసింది. వారంలోగా మేడిగడ్డ-ఎల్లంపల్లిల మధ్య ఉన్న మూడు బ్యారేజీలకు టెండర్లు పిలిచేలా వేగంగా కసరత్తు చేస్తోంది. మేడిగడ్డ-ఎల్లంపల్లి మార్గంలో మొత్తంగా 21.29 టీఎంసీల సామర్థ్యంతో మూడు బ్యారేజీల నిర్మాణం చేయాలని ఇప్పటికే నిర్ణయించిన ప్రభుత్వం.. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సైతం సిద్ధం చేసిన విషయం తెలిసిందే.

మేడిగడ్డ వద్ద 15 టీఎంసీల సామర్థ్యంతో ఒకటి, మేడిగడ్డ రిజర్వాయర్ నుంచి 14 కిలోమీటర్లుదాటాక 120 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్ వద్ద గోదావరి ప్రవాహపు ప్రాంతంలో అన్నారం వద్ద 2.7 టీఎంసీల సామర్ధ్యంతో రెండోది, అనంతరం 25 కిలోమీటర్ల దూరంలో 130 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో సుందిళ్ల వద్ద 1.02 టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజీ నిర్మించేలా ప్రణాళికలు వేశారు. మొత్తంగా బ్యారేజీలు, పంప్‌హౌస్‌లు, ఇతర నిర్మాణాల కోసం 2007-08లో నిర్ణయించిన స్టాండర్ట్ షెడ్యూల్డ్ రేట్లు(ఎస్‌ఎస్‌ఆర్) ప్రకారం రూ. 8,919 కోట్ల మేర ఖర్చు కానుండగా, 2015-16 రేట్ల ప్రకారం అది రూ. 10,303 కోట్లు ఉంటుందని అధికారులు లెక్కలు వేశారు.

మరిన్ని వార్తలు