కాల్‌మనీ-సెక్స్ రాకెట్‌ను రాజకీయం చేస్తోంది

22 Dec, 2015 04:50 IST|Sakshi
కాల్‌మనీ-సెక్స్ రాకెట్‌ను రాజకీయం చేస్తోంది

ప్రభుత్వానికి నిందితుల్ని శిక్షించాలని లేదు: పార్థసారథి
 
 సాక్షి, హైదరాబాద్: కాల్‌మనీ-సెక్స్ రాకెట్‌ను టీడీపీ ప్రభుత్వం రాజకీయం చేసి తప్పించుకోవాలని చూస్తోందితప్ప నిందితుల్ని శిక్షించాలనుకోవట్లేదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ అంశాన్ని ఒక సామాజిక సమస్యగా, రాష్ట్ర రాజధాని పరువును దిగజార్చుతున్న రాకెట్‌గా పరిగణించకుండా రాజకీయం చేస్తూ దోషుల్ని రక్షించాలని ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. కొంతమందికి అక్కడ రాజధాని రావడం ఇష్టం లేదని చంద్రబాబు చేస్తున్న వాదన చూస్తే.. సెక్స్‌రాకెట్ వ్యవహారం ప్రతిపక్షం, మీడియా సృష్టించిందే  తప్ప వాస్తవం లేదన్నట్లుగా ఆయన మాటలున్నాయని పార్థసారథి విమర్శించారు.

అసలు ఈ సెక్స్‌రాకెట్ నిజమో కాదో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఈ వ్యవహారం వైఎస్సార్‌సీపీ, మీడియాలే సృష్టించిందైతే ఈ రాకెట్ వాస్తవమేనని విజయవాడ నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఎలా చెప్పారని ఆయన ప్రశ్నించారు. ఈ రాకెట్ నిజమని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలన్నారు. ఈ సమస్యకు సంబంధించి పత్రికల్లో కథనాలు స్పష్టంగా వస్తూఉంటే ఇంకా ఆధారాలివ్వండని ప్రభుత్వం చెప్పడమేంటి? ఇంకా ప్రతిపక్షాలు ఆధారాలు చూపాల్సిన అవసరం ఏముంది? అని పార్థసారథి ప్రశ్నించారు.

 రోజా సస్పెన్షన్ ప్రజాస్వామ్యస్ఫూర్తికి విరుద్ధం..
 సీఎంను తమ ఎమ్మెల్యే రోజా ఏదో అన్నారనే నెపంతో అధికారం చేతిలో ఉంది క దా అని ఏడాదిపాటు సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పార్థసారథి అన్నారు. ఇంత స్వల్పవిషయానికే శాసనసభ్యురాల్ని సస్పెండ్ చేసినపుడు, కాల్‌మనీ ముఠాలు ఏళ్లతరబడి మహిళలను అతి జుగుప్సాకరంగా, శారీరకంగా హింసిస్తూ ఉంటే ప్రభుత్వం ఎందుకు నిద్రపోతోందని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు