పోటాపోటీ నోటీసులు

13 Aug, 2015 05:43 IST|Sakshi
నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్ నందినగర్ లోని మంత్రి కేటీఆర్ ఇంటివద్ద వేచి ఉన్న ఏపీ సీఐడీ పోలీసులు

 - ‘ఓటుకు కోట్లు’ కేసులో తెలంగాణ  ఏసీబీ యాక్షన్.. ఏపీ సీఐడీ రియాక్షన్
- ఏపీ సీఎం తనయుడు లోకేశ్ డ్రైవర్‌కు ఏసీబీ నోటీసులు
- మత్తయ్య కేసులో కేటీఆర్ గన్‌మన్, డ్రైవర్‌కు ఏపీ తాఖీదులు
- ఇరువురి నోటీసులూ సీఆర్‌పీసీ సెక్షన్ 160 ప్రకారమే..
 
సాక్షి, హైదరాబాద్:
‘ఓటుకు కోట్లు’ కేసులో నోటీసుల పర్వం కొనసాగుతోంది. ఓవైపు ఏపీ సీఎం   చంద్రబాబు కుమారుడు లోకేశ్ వ్యక్తిగత డ్రైవర్ కొండల్‌రెడ్డికి తెలంగాణ అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) నోటీసులు ఇవ్వగా... మరోవైపు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్య ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో ఏపీ సీఐడీ అధికారులు మంత్రి కేటీఆర్ గన్‌మన్ జానకిరామ్, డ్రైవర్ సత్యనారాయణకు నోటీసులు జారీ చేశారు. ఇరువురూ సీఆర్‌పీసీ సెక్షన్ 160 ప్రకారమే నోటీసులు జారీ చేయడం గమనార్హం. బుధవారం ఈ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

విచారణ నిమిత్తం గురువారం ఉదయం 10.30 గంటల కల్లా తమ కార్యాలయంలో హాజరు కావాలని కొండల్‌రెడ్డిని ఏసీబీ ఆదేశించింది. మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి, అక్కడ నుంచి టీడీపీ కార్యాలయమైన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వెళ్లిన ఏసీబీ అధికారులు కొండల్‌రెడ్డి కోసం ఆరా తీశారు. అయితే అక్కడ లేడని తేలడంతో బుధవారం యూసుఫ్‌గూడ వెంకటగిరిలో ఉన్న ఆయన ఇంటికి వెళ్లి గోడపై నోటీసులు అంటించారు.

ఏపీ సీఐడీ అధికారులు కూడా ఇదే తీరుగా స్పందించారు. తొలుత నోటీసులతో బుధవారం రాత్రి బేగంపేటలోని సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి, అక్కడ్నుంచి నందిహిల్స్‌లో ఉన్న కేసీఆర్ పాత నివాసానికి, కేటీఆర్ నివాసానికి వెళ్లారు. కేటీఆర్ గన్‌మన్, డ్రైవర్లలో ఎవరూ అక్కడ లేరని తేలడంతో రాత్రి 11 గంటల సమయంలో ఖైరతాబాద్‌లోని తెలంగాణ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్(ఐఎస్‌డబ్ల్యూ) కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కూడా లేకపోవడంతో గురువారం జానకిరామ్, సత్యనారాయణ ఇంటికి వెళ్లి నోటీసులు అందజేయాలని నిర్ణయించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయడం కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు లంచం ఇస్తూ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం విదితమే.

విచారణకు విజయవాడ రండి
మంత్రి కేటీఆర్‌కు గన్‌మన్, డ్రైవర్లుగా ఉన్న జానకిరామ్, సత్యనారాయణ తెలంగాణ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్‌డబ్ల్యూ) కానిస్టేబుళ్లుగా ఉన్నారు. మత్తయ్య కేసులో వీరికి సాక్షులుగా ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. విచారణ కోసం శుక్రవారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని సత్యనారాయణపురంలో ఉన్న సీఐడీ రీజనల్ కార్యాలయానికి రావాల్సిందిగా ఆదేశించారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న జెరుసలేం మత్తయ్య విజయవాడ సత్యనారాయణపురం పోలీసు స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసును సీఐడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.
 
రెండేళ్ల కిందటి కేసులో కేటీఆర్ గన్‌మన్‌కు నోటీసులు
పెందుర్తి (విశాఖపట్నం): రెండేళ్ల కిందటి కిడ్నాప్ కేసులో మంత్రి కె.తారకరామారావు గన్‌మన్‌కు నోటీసులు పంపినట్లు విశాఖపట్నం జిల్లా పెందుర్తి సీఐ కొండపల్లి లక్ష్మణమూర్తి బుధవారం విలేకరులకు తెలిపారు. 2013 ఫిబ్రవరిలో ఒడిశాకు చెందిన మార్వాడీ వ్యాపారులను ఐదుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి హైదరాబాద్ తరలించేందుకు ప్రయత్నించారని, అప్పటి పెందుర్తి ఎస్సై వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా కిడ్నాపర్లు అతనిపై వాహనం ఎక్కించే ప్రయత్నం చేశారని ఆయన తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశారు. మిగిలిన ముగ్గురు వివరాలు, ఆచూకీ తెలుసునన్న సమాచారంతో మంత్రి కేటీఆర్ గన్‌మన్ మధుసూదన్‌రెడ్డి, ఆయన అనుచరుడు సతీష్‌రెడ్డిలకు నోటీసులు పంపినట్లు సీఐ తెలిపారు.
 

మరిన్ని వార్తలు