ఎన్టీఆర్‌ జ్ఞాపకాలు ఎంతో పదిలం

19 Jan, 2017 04:16 IST|Sakshi
ఎన్టీఆర్‌ జ్ఞాపకాలు ఎంతో పదిలం
  • ప్రజా జీవితంలో ఆయనది చెరగని ముద్ర: రోశయ్య
  • ముగ్గురికి ఎన్టీఆర్‌ లలిత కళా పురస్కారాలు ప్రదానం
  • హైదరాబాద్‌: సినీ జగత్తులో, రాజకీయ, ప్రజా జీవితంలో నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్‌) చెరగని ముద్ర వేశారని తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య కొనియాడారు. ఆ మహానటుడి జ్ఞాపకాలు ప్రజల్లో పదిలంగా ఉంటాయన్నారు. బుధవారం ఎన్టీఆర్‌ 21వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్‌ విజ్ఞాన్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ఎన్టీఆర్‌ లలిత కళా పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రోశయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రముఖ సినీ దర్శకుడు కోడి రామకృష్ణ, గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ, ప్రముఖ రచయిత్రి శారద అశోక వర్ధన్‌లకు పురస్కారాలను అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు.

    ఎన్టీఆర్‌ సినిమాల్లో ఏ పాత్ర ధరించినా ఔచిత్యం ఉండేదని... నటుడిగానే కాకుండా గొప్ప వక్తగా ఆయన ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని రోశయ్య పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ పేరుతో నందమూరి లక్ష్మీపార్వతి లలిత కళా పురస్కారాలను అందజేయడమే కాకుండా.. గత 20 ఏళ్లుగా నిరాటంకంగా కొనసాగించడం గొప్ప విషయమని అభినం దించారు. ఎన్టీఆర్‌ను స్మరించుకోవడమంటే ఆయనతో ఉన్న ఆత్మీయతను పంచుకోవడ మని రమణాచారి పేర్కొన్నారు. దివంగత సీఎం వైఎస్సార్‌ హయాంలో ఎన్టీఆర్‌ పేరుతో పురస్కారాన్ని ఇవ్వాలా వద్దా అన్న ప్రస్తావన వచ్చినప్పుడు.. తాను ఎన్టీఆర్‌ అభిమానంటూ వైఎస్సార్‌ నిర్మొహమాటంగా చెప్పడమే కాకుండా పురస్కారాలను అందజేసినట్లు గుర్తు చేశారు.

    సినీ రంగంలోనే కాకుండా పరిపాలనలోనూ అనితర సాధ్యమైన కృషితో ఎన్టీఆర్‌ ప్రజల హృదయాల్లో నిలిచిపోయారన్నారు. ఎన్టీఆర్‌ భౌతికంగా దూరమైనప్పటికీ.. ఆయన మనలో శాశ్వతంగా నిలిచిపోయినందునే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎన్టీఆర్‌ విజ్ఞాన్‌ ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌ నందమూరి లక్ష్మీపా ర్వతి వివరించారు. ఆర్థికపర ఇబ్బందులు తలెత్తినప్పటికీ ఆయన పేరిట ప్రత్యేక కార్య క్రమాలను చేపడుతున్నానని, ఇందుకోసం బంజారాహిల్స్‌లో తనకు ఉన్న ఇంటిని కూడా అమ్మేసుకున్నాని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ తనతోనే ఉండి నడిపిస్తున్నారనే ధైర్యంతో ముందుకెళుతున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఒడిశా ఆంధ్రా సంఘం అధ్యక్షుడు గంగరాజు, యువ కళావాహిని నిర్వాహకులు వై.కె.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో తేజస్విని సుధాకర్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ చలన చిత్ర సంగీత విభావరి అలరింపజేసింది.

మరిన్ని వార్తలు