Telangana News: TS Special: ఇక్కడి ప్రజల తీర్పుకు ఎన్టీఆర్‌ సైతం తలవంచాడు..!
Sakshi News home page

అంత హవాలోనూ.. ఇక్కడి ప్రజల తీర్పునకు ఎన్టీఆర్‌ సైతం తలవంచాడు..!

Published Tue, Oct 31 2023 1:22 AM

- - Sakshi

కల్వకుర్తి: మహామహులకు రాజకీయ జీవితాన్ని అందించిన నియోజకవర్గం. కేంద్రంలో, రాష్ట్రంలో ఇక్కడ గెలిచిన వారు మంత్రులుగా పనిచేశారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును సైతం ఎన్నికల్లో ఓడించి విలక్షణ తీర్పునిచ్చిన ఘనత ఇక్కడి ఓటర్లది. ఇలా ప్రతి ఎన్నికల్లో పార్టీలు అనుకున్న దానికన్నా విలక్షణ తీర్పును అందిస్తున్న కల్వకుర్తి ప్రత్యేకతలు ఎన్నో.

1952లో ఏర్పడిన కల్వకుర్తి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 1952, 1957లో ద్విసభా నియోజకవర్గంగా ఉండటంతో అప్పుడు జరిగిన ఎన్నికల్లో రెండుసార్లు కాంగ్రెస్‌ విజయం సాధించింది. నియోజకవర్గం ఏర్పడినప్పుడు జనరల్‌, ఆ తర్వాత ఎస్టీ, తర్వాత జనరల్‌కు కేటాయించారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో 9 సార్లు కాంగ్రెస్‌, 3 సార్లు ఇండిపెండెంట్‌, 2 సార్లు జనతాదళ్‌ పార్టీ, టీడీపీ, ఒకసారి బీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించింది.

2009 వరకు ఏడు మండలాలతో ఉన్న నియోజకవర్గంలోని మిడ్జిల్‌, వంగూర్‌ మండలాలు జడ్చర్ల, అచ్చంపేట నియోజకవర్గాల్లోకి వెళ్లాయి. ప్రస్తుతం కల్వకుర్తి నియోజకవర్గం రెండు జిల్లాలో విస్తరించి ఉంది. 2016లో జరిగిన జిల్లాల పునర్విభజనలో కల్వకుర్తి నియోజకవర్గంలోని కల్వకుర్తి, వెల్దండ మండలాలు నాగర్‌కర్నూల్‌ జిల్లాలో, ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, నూతనంగా ఏర్పడిన కడ్తాల్‌ మండలం రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి.రాష్ట్ర ఆవిర్భావ అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి, 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి జైపాల్‌యాదవ్‌ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఇదే ప్రాంతంలో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఆచారి ఐదుసార్లు ఓడిపోగా.. 2023 ఎన్నికల్లో సైతం అతనికే పార్టీ టికెట్‌ లభించింది.   

ఎన్టీఆర్‌ను సైతం..
1989లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా హవా కొనసాగుతున్న సమయంలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్‌ను ఓడించి చరిత్రలో నిలిచింది. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన మాజీ మంత్రి చిత్తరంజన్‌ దాస్‌ 3,568 ఓట్ల మెజార్టీ తో గెలుపొందారు. కేంద్రంలో రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేసిన సూదిని జైపాల్‌రెడ్డిని కల్వకుర్తి ప్రజలు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలువగా, రాష్ట్ర మంత్రులుగా 1962లో లట్టుపల్లి వెంకట్‌రెడ్డి బూర్గుల రామకృష్ణారావు మంత్రి వర్గంలో, 1989లో జక్కుల చిత్తరంజన్‌ దాస్‌ కోట్ల విజయ్‌భాస్కర్‌ రెడ్డి మంత్రి వర్గంలో పనిచేశారు.

నాలుగు సార్లు విజయం సాధించిన జైపాల్‌రెడ్డి
నియోజకవర్గంలో 1969 ఉప ఎన్నికల్లో జైపాల్‌రెడ్డి 1983 వరకు వరుసగా నాలుగుసార్లు విజయం సాధించారు. 1983 తర్వాత జనతాదళ్‌లోని జైపాల్‌రెడ్డి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లారు. 1984లో మొదటిసారి లోక్‌సభకు ఎన్నికై న అతను, 2004, 2009 యూపీఏ ప్రభుత్వంలో రెండు సార్లు కేంద్ర మంత్రిగా పనిచేశారు. లోక్‌సభతో పాటుగా రాజ్యసభకు నామినేట్‌ అయ్యి, రాజ్యసభలో 1992లో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు. 1998లో ఇతనికి ఉత్తమ పార్లమెంటేరీయన్‌ అవార్డు లభించింది.

Advertisement
Advertisement