ఏపీ బస్సులు కిటకిట తెలంగాణ బస్సులు కటకట

21 Dec, 2015 07:24 IST|Sakshi
ఏపీ బస్సులు కిటకిట తెలంగాణ బస్సులు కటకట

♦ ఆంధ్రప్రదేశ్ నుంచి ‘ఖాళీ’గా టీఎస్‌ఆర్టీసీ బస్సులు
♦ అదే సమయంలో ఏపీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ
♦ తెలంగాణ బస్సుల టికెట్లు అమ్మకుండా వదిలేస్తున్న అక్కడి సిబ్బంది
♦ కిలోమీటరుకు సగటున రూ.38 చొప్పున నష్టం
 
 సాక్షి, హైదరాబాద్: అమలాపురం నుంచి హైదరాబాద్ లోని మియాపూర్‌కు తెలంగాణ ఆర్టీసీ గరుడ ప్లస్ బస్సు వచ్చి ఆగింది. అందులోంచి దిగిన ప్రయాణికులు పది మందే. అదే.. అమలాపురం నుంచి హైదరాబాద్‌కు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ గరుడ ప్లస్ బస్సు కిటకిట లాడుతూ వచ్చింది. ఒకే రోజు ఒకే సమయంలో కనిపిం చినదృశ్యమిది. ఇది అమలాపురం బస్సు కథ ఒక్కటే కాదు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన ప్రాంతాలు-హైదరాబాద్ మధ్య నడుస్తున్న తెలంగాణ ఆర్టీసీ గరుడ, గరుడ ప్లస్ బస్సులన్నింటి కథ ఇదే. ఇప్పుడు తెలంగాణ బస్సులు తీవ్ర నష్టాల్లో చిక్కుకున్నాయి. వాటిని నడిపే బదులు రద్దు చేసుకోవటం మంచిదని అధికారులు భావిస్తున్నారు. ఏపీఎస్ ఆర్టీసీతో పోలిస్తే... తెలంగాణ ఆర్టీసీ ఛార్జీలు తక్కువ. అయినప్పటికీ తెలంగాణ బస్సులు కిటకిటలాడాల్సింది పోయి గరుడ బస్సులు ఖాళీగా వస్తూ తీవ్ర నష్టాలను తెచ్చిపెడుతున్నాయి.

 ఏపీ డిపోల్లో తెలంగాణ సిబ్బంది లేకనే..
 ఆంధ్రప్రదేశ్ పరిధిలోని ప్రధాన డిపోల్లో రిజర్వేషన్ టికెట్లు, సాధారణ టికెట్లు విక్రయించేందుకు తెలంగాణ సిబ్బంది లేకపోవటంతో ఏపీ సిబ్బంది తెలంగాణ బస్సుల టికెట్లు అమ్మకుండా మొరాయిస్తున్నారు. అసలు ఆ సర్వీసులు ఉన్నట్టు ప్రయాణికులకు సమాచారం కూడా ఉండటం లేదు. దీంతో తెలంగాణ గరుడ బస్సులకు రిజర్వేషన్ ఇబ్బందిగా మారింది. ఫలితంగా సగం సీట్లు కూడా నిండకుండానే బస్సులు ప్రయాణించాల్సి వస్తోంది. విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు, తిరుపతి, అమలాపురం...తదితర ఏపీలోని ప్రధాన ప్రాంతాల్లో తెలంగాణ బస్సులను అక్కడి సిబ్బంది ప్లాట్‌ఫామ్‌ల వద్దకు రానివ్వడం లేదు.

దూరంగా నిలపాల్సి వస్తుండటంతో వాటి ఆక్యుపెన్సీ రేషియో బాగా పడిపోయింది. తాజా గణాంకాల ప్రకారం గరుడ కేటగిరీ బస్సుల్లో సగటున కిలోమీటరుకు రూ.38 నష్టం వస్తున్నట్టు అధికారులు తేల్చారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రాంతాలకు వెళ్లే తెలంగాణ ఆర్టీసీ గరుడ బస్సుల సగటు ఆక్యుపెన్సీ రేషియో 80 శాతం ఉండగా, తిరుగుప్రయాణంలో హైదరాబాద్‌కు వచ్చే బస్సుల్లో అది 49-54 శాతం మధ్య ఉన్నట్టు తేలింది. రూ.1.10 కోట్ల ఖరీదు చేసే ఈ కేటగిరీ బస్సుల నిర్వహణ కూడా భారంతో కూడుకున్నదే. వాటి మనుగడ ఉండాలంటే ఆక్యుపెన్సీ రేషియో 75 శాతానికి మించి ఉండాలి. తాజాగా కొందరు డిపో మేనేజర్లు ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తెచ్చారు. ఏపీ అధికారులతో చర్చించి వెంటనే తెలంగాణ సిబ్బందిని అక్కడి డిపోల్లో ఏర్పాటు చేయకుండా.. ఆ సర్వీసులను రద్దు చేయటమే మంచిదని వారు పేర్కొనటం విశేషం.

 ప్రైవేటు ఆపరేటర్లతోఒప్పందం..
 సాంకేతికంగా ఆర్టీసీ ఉమ్మడిగా ఉన్నప్పటికీ పాలనాపరంగా విడిపోయింది. ఏ రాష్ట్రం పరిధిలో ఆ రాష్ట్ర ఆర్టీసీ బస్సులను నిర్వహిస్తోంది. టికెట్ల కేటాయింపు, సీట్ల రిజర్వేషన్ వంటి పనులను కూడా ఇదే పద్ధతిలో నిర్వహించాలి. హైదరాబాద్‌లోని ప్రధాన డిపోల్లో ఏపీఎస్ ఆర్టీసీ సిబ్బంది ఆ రాష్ట్ర ఆర్టీసీ బస్సుల టికెట్లు విక్రయిస్తున్నారు. దీంతోపాటు హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆపరేటర్లతో ఏపీఎస్ ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుని వారితో కూడా టికెట్లు విక్రయింపచేస్తోంది. వెరసి హైదరాబాద్ నుంచి ఏపీ పరిధిలోని ప్రాంతాలకు వెళ్లే గరుడ బస్సులు నిండుగా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ పరిధిలోని ప్రధాన డిపోల్లో తెలంగాణ సిబ్బంది లేరు. ఇదే ఇప్పుడు సమస్యలకు కారణమైంది.

మరిన్ని వార్తలు