ఔటర్ చుట్టూ ఆర్‌ఆర్‌ఆర్

8 Apr, 2016 04:56 IST|Sakshi
ఔటర్ చుట్టూ ఆర్‌ఆర్‌ఆర్

సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) చుట్టూ అదనంగా రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. దీనిపై హెచ్‌ఎండీఏ చేసిన ప్రతిపాదనలకు సంస్థ బోర్డు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్టు వివరించారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో గురువారం హెచ్‌ఎండీఏ ఆరో బోర్డు సమావేశం కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగింది. భేటీలో బోర్డు తీసుకున్న నిర్ణయాలను విలేకరుల సమావేశంలో మంత్రి ప్రకటించారు. ఆర్‌ఆర్‌ఆర్ ఏర్పాటుకు ఆర్థిక వనరులను ఎలా సమకూర్చుకోవాలో త్వరలో జరిగే బోర్డు భేటీలో నిర్ణయిస్తామన్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలో శాశ్వత మాస్టర్‌ప్లాన్‌ను ప్రణాళికాబద్ధంగా రూపొందిస్తామని, ఇందుకోసం శాటిలైట్ ఇమేజ్‌ని వాడుకుంటామని చెప్పారు.

పలురకాలుగా ఉన్న ఎంసీహెచ్, హుడా, హడా, సీడీఏ మాస్టర్‌ప్లాన్లతో గందరగోళం నెలకొన్నందున ఈ ఐదు ప్లాన్లను కలిపి కొత్త మాస్టర్‌ప్లాన్ తీసుకొస్తామన్నారు. దీనిపై అధ్యయనం చేసి వచ్చే బోర్డు సమావేశంలో స్పష్టమైన ఆలోచనలు తెలపాలని అధికార్లకు సూచించామన్నారు. కంటోన్మెంట్ భూభాగాన్నీ హెచ్‌ఎండీఏ పరిధిలోకి తీసుకొస్తామని మంత్రి చెప్పారు. అయితే బోర్డును మాత్రం తీసుకోబోమని స్పష్టం చేశారు. ‘‘నగరం నడి బొడ్డునున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్ పరిధిలో లేకపోవడం వెలితిగా ఉంది. అందుకే సీఎం సూచనల మేరకు కంటోన్మెంట్, ఆ బోర్డు పరిధిలో ప్రణాళికలు రూపొందించి సౌకర్యాలు కల్పిం చాల్సిన అవసరముంది. ఇందుకు బోర్డు సహకారాన్ని కోరతాం’’ అని వివరించారు.
 
30 రోజుల్లో హెచ్‌ఎండీఏ అనుమతులు
హెచ్‌ఎండీఏ పరిధిలో త్వరలో ఆన్‌లైన్ అనుమతుల విధానం తెస్తామని కేటీఆర్ వెల్లడించారు. ‘‘కేవలం 30 రోజుల్లో అనుమతులిస్తాం. అప్పట్లోగా అనుమతి రాకుంటే, 31వ రోజు అనుమతి లభించినట్టే భావించాలి. ప్రజలు లంచాలివ్వకుండా అనుమతులు పొందాలన్న సీఎం నిర్దేశం మేరకు ఈ ఆన్‌లైన్ అనుమతులను తేనున్నాం. ఇందుకు ప్రజలు అలవాటు పడేలా పంచాయతీ సెక్రటరీలు, ఈఓపీఆర్‌డీల ద్వారా సహకారం అందిస్తామన్నారు. అవసరమైతే మీ సేవ కేంద్రాలను కూడా భాగస్వాములను చేస్తాం’’ అని వివరించారు.

ఔటర్ చుట్టూ 13 గ్రోత్ కారిడార్లు ఏర్పాటు చేయాలని హెచ్‌ఎండీఏకు మంత్రి సూచించారు. వాటినిప్పటికే గుర్తించామన్నా రు. ఆ కారిడార్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యతను హెచ్‌ఎండీఏ తీసుకుంటుం దని, వాటికి అపారమైన పెట్టుబడులు వచ్చేలా ప్రణాళిక రూపొందిస్తామని అన్నారు. శాటిలైట్ టౌన్‌షిప్‌ల మాదిరిగా నగరాన్ని విస్తరించాలన్నారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు జియోట్యాగింగ్ చేస్తామని వెల్లడించారు.
 
ఇష్టారాజ్యపు లే ఔట్లకు అడ్డుకట్ట
హెచ్‌ఎండీఏ పరిధిలోని మణికొండ, నిజాంపేట, పుప్పాల్‌గూడ తదితర గ్రామ పంచాయతీల్లో ఇష్టారీతిన జరుగుతున్న లే ఔట్లు, బిల్డింగ్ అనుమతులకు అడ్డుకట్ట వేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ‘‘ఆయా గ్రామాల్లో లే ఔట్, బిల్డింగ్ అనుమతులిచ్చే బాధ్యతను హెచ్‌ఎండీఏకు అప్పగిస్తాం. అయితే అనుమతుల ద్వారా వచ్చే ఆదాయ విషయంలో పంచాయతీలకు ఎలాంటి నష్టమూ కలిగించబోం. దాన్ని వాటికేబదలాయిస్తాం’’ అని చెప్పారు.
 
3,000 ఎకరాల్లో హెచ్‌ఎండీఏ లే ఔట్లు
ప్రైవేటు డెవలపర్లకు దీటుగా ఇక హెచ్‌ఎండీఏ కూడా లే ఔట్లు చేస్తుందని కేటీఆర్ చెప్పారు. త్వరలో పారదర్శకంగా 2 వేల నుంచి 3 వేల ఎకరాల్లో లే ఔట్లు వేస్తామన్నారు. ప్రభుత్వ శాఖలు ఆదాయపు పన్ను చెల్లించాలనడంలో అర్థం లేదన్నారు. హెచ్‌ఎండీఏ ఐటీ పన్నులు చెల్లించాల్సి రావడంపై సీఎం ఇప్పటికే కేంద్రంతో మాట్లాడారని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం మే కల్లా పూర్తవుతుందన్నారు.

>
మరిన్ని వార్తలు