పేదరాలిపై మంత్రి ఔదార్యం!

12 Jan, 2017 00:31 IST|Sakshi
పేదరాలిపై మంత్రి ఔదార్యం!

సికింద్రాబాద్‌: అనారోగ్యం...ఆపై ఆకలితో నకనకలాడుతూ ఫుట్‌పాత్‌ పక్కన జీవచ్ఛవంలా పడి ఉన్న ఓ వృద్ధురాలిని చూసి ఎక్సైజ్‌  శాఖ మంత్రి తన ఔదార్యం చాటుకున్నారు. సదరు మహిళ కోసం 30 నిమిషాల సమయం కేటాయించి, అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. వివరాలు.... బుధవారం మధ్యాహ్నం   12.30కి రూ.5కు మధ్యాహాన్న భోజన పథకాన్ని ప్రారంభించేందుకు మంత్రి పద్మారావు చిలకలగూడకు వచ్చారు.

కార్యక్రమం ముగించుకొని తిరిగి వెళ్లేందుకు కారు ఎక్కే సమయంలో పక్కన్నే ఫుట్‌పాత్‌ పక్కన పడి ఉన్న ఓ వృద్ధురాలిని ఆయన గమనించారు. కారు ఎక్కకుండా ఆమె వద్దకు వెళ్లి పరిశీలించారు. అక్కడే ఉన్న చిలకలగూడ ఇన్‌స్పెక్టర్‌ కావేటి శ్రీనివాసులుకు చెప్పి అంబులెన్స్‌ను రప్పించారు. ఈలోపు ఆమెను నిద్రలేపి వివరాలు తెలుసుకున్నారు. తన పేరు అనిత అని, పేదరికం కారణంగా ఫుట్‌పాత్‌పైనే భర్తతో కలిసి జీవిస్తున్నామని ఆమె   తెలిపింది. తమకు ఎవరూ లేరని చెప్పి కంటతడి పెట్టింది. ఇందుకు చలించిన మంత్రి అంబులెన్స్‌లో అనితను గాంధీ ఆసుపత్రికి పంపించి, ఖర్చుల నిమిత్తం ఆమె భర్తకు కొంతమే ఆర్థిక సహాయం అందించారు.

మరిన్ని వార్తలు