దేవాదాయ శాఖలో పోలీసు విజిలెన్స్

28 Oct, 2016 03:50 IST|Sakshi
దేవాదాయ శాఖలో పోలీసు విజిలెన్స్

► ఏసీపీ, ఏఎస్పీ స్థాయి అధికారులతో ప్రత్యేక బృందం
► ఆక్రమణల తొలగింపునకు కలెక్టర్, ఎస్పీల సహకారం
► మంత్రివర్గ ఉపసంఘ కీలక నిర్ణయాలు

సాక్షి, హైదరాబాద్: దేవాదాయ శాఖలో అవినీతి, అక్రమాలను నియంత్రించటంతో పాటు పాలనాపరంగా కొత్త విధానాలకు అవకాశం కల్పించేలా మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు తీసుకుంది. దేవాదాయ శాఖకు సంబంధించి ఆ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం రెండో సమావేశం గురువారం జరిగింది. మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జూపల్లి కృష్ణారావు, తలసాని శ్రీనివాసయాదవ్, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, దే వాదాయ శాఖ కార్యదర్శి శివశంకర్, జాయింట్ కమిషనర్లు కృష్ణవేణి, శ్రీనివాసరావు ఇందులో పాల్గొన్నారు. కమిటీలోని మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరుకాలేదు.
 
ప్రత్యేక వింగ్...: దేవాలయాల్లో అడ్డూఅదుపూ లేకుండా అక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం విజిలెన్స్ విభాగం ఉన్నా అది అత్యంత బలహీనంగా మారింది. ఆ అధికారులకు ఇతర బాధ్యతలుండటంతో తనిఖీలు కూడా సాధ్యం కావటం లేదు. ఈ నేపథ్యంలో అదనపు ఎస్పీ స్థాయి పోలీసు అధికారి ఆధ్వర్యంలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ముగ్గురు సబ్‌ఇన్‌స్పెక్టర్లు, ఐదుగురు కానిస్టేబుళ్లతో ప్రత్యేక విజిలెన్స్ విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏసీపీ స్థాయి అధికారిని దేవాదాయ శాఖ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా నియమిస్తారు.  

భూముల రక్షణ కోసం ప్రత్యేక వ్యవస్థ...
ఆలయాలకు వేల ఎకరాల భూములున్నా చాలా వరకు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. వాటిల్లో వెలసిన అక్రమ నిర్మాణాల తొలగింపు ఆ శాఖ వల్ల కావటం లేదు. రెవెన్యూ భూముల్లో ఉన్న ఆక్రమణల తొలగింపు ఎలా జరుగుతుందో దేవాదాయ శాఖలో కూడా ఆ తరహా వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సహకారం తీసుకుని ఆక్రమణలు తొలగించేందుకు వెసులుబాటు కల్పించాలని నిర్ణయించారు. వివిధ కోర్టుల్లో దాఖలయ్యే వ్యాజ్యాలను పరిశీలించేందుకు లీగల్ సెల్  ఏర్పాటు చేయనున్నారు.

‘ధూప దీప నైవేద్యం’ పరిధికి మరిన్ని గుళ్లు
రాష్ట్రంలో 1805 ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకం కింద నెలకు రూ.1.08 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తోంది. జిల్లాల విభజన నేపథ్యంలో మరికొన్ని ఈ పథకం కిందకు తేవాలని నిర్ణయించారు. ఇటీవల ప్రభుత్వం సర్వశ్రేయోనిధికి 50 కోట్లు కేటాయించినందున వాటికి ఆ పథకాన్ని వర్తింపజేస్తారు.

అర్చకుల వేతనాలపై దాటవేత...
అర్చకులు, దేవాలయ ఉద్యోగుల వేతనాలను క్రమబద్ధం చేసే లక్ష్యంగా  మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. కానీ రెండో సమావేశంలోనూ దీన్ని పక్కనపెట్టేశారు. అధికారుల కమిటీ విధానాలను ఖరారు చేసి ఉపసంఘం ముందుంచింది. మరిన్ని వివరాలు కావాలంటూ గురువారం దీనిపై నిర్ణయం తీసుకోలేదు. 653 ఆలయాలకు చెంది ఐదున్నర వేల మంది అర్చకులు, ఉద్యోగులకు దీనితో లబ్ధికలగాలి.

మిగతా ఆలయాల్లోని సిబ్బంది విషయంలో కూడా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే కోణంలో సీఎం ఉన్నట్టు తెలియటంతో  కమిటీ దాన్ని పక్కనపెట్టినట్టు సమాచారం. దీపావళి కానుకగా శుభవార్త అందుతుందని  వేలమంది అర్చకులు, ఉద్యోగులు ఎదురుచూసి నిరాశకు గురయ్యారు. మరోసారి ఉద్యమానికి సన్నద్ధం కావాలన్న డిమాండ్ రావటంతో కొద్ది రోజులు ఓపిక పడతామంటూ జేఏసీ నేతలు వారించారు.

>
మరిన్ని వార్తలు