బతికున్నంత వరకు కాంగ్రెస్‌లోనే

7 Mar, 2016 03:46 IST|Sakshi
బతికున్నంత వరకు కాంగ్రెస్‌లోనే

పార్టీని వీడే ప్రసక్తే లేదు.. పొన్నాల లక్ష్మయ్య స్పష్టీకరణ

 సాక్షి, హైదరాబాద్: ‘‘నేను అసలైన కాంగ్రెస్ వాదిని.. నా మరణం ఎప్పుడు సంభవించినా నా శవం మీద కాంగ్రెస్ జెండాతోనే శవయాత్ర జరుపుకోవాలని నా ఆత్మ ఘోషిస్తోంది. అదీ నా పట్టుదల.. కాంగ్రెస్‌పై నాకున్న విశ్వాసం..’’ అని పీసీసీ మాజీ చీఫ్  పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు. ఆదివారం మధ్యాహ్నం ‘సాక్షి’ కార్యాలయం ఎదుట ఆయన మీడియాతో మాట్లాడారు. అమెరికాలో అంతరిక్ష పరిశోధన సంస్థలో పనిచేసే అవకాశం ఉన్నప్పటికీ ప్రజా సేవలో ఉండాలన్న ఉద్దేశంతో ఇక్కడికి తిరిగి వచ్చానని, ప్రజా సేవ చేసే పార్టీ కాంగ్రెస్ ఒక్కటేననే నమ్మకంతో పని చేస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తి లేదన్నారు.

టీఆర్‌ఎస్ కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విలువలకు తిలోదకాలు ఇచ్చారని విమర్శించారు. 21 నెలల పాలన తర్వాత ఒక్క డబుల్ బెడ్‌రూం ఇల్లు కట్టడంలో గొప్పేముందన్నారు. అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక పూటకో మాట, రోజుకో హామీతో పబ్బం గడుపుతోందని ఎద్దేవా చేశారు. వరంగల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు పోలింగ్ రోజున విష ప్రచారం చేయటం తగదని పేర్కొన్నారు. తన వ్యక్తిత్వాన్ని కించపరచడంతో పాటు సామాజిక కోణంలో అవహేళన, అవమానాలు ఇప్పటికీ రాజకీయాల్లో కొనసాగడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ప్రజల మద్దతు లేనందుకే టీఆర్‌ఎస్ అభద్రతా, ఆత్మన్యూనతా భావం తో కుట్రలకు పాల్పడుతోందన్నారు.

 

మరిన్ని వార్తలు