ఇది రెచ్చగొట్టడం కాదా?

19 Oct, 2016 03:39 IST|Sakshi
ఇది రెచ్చగొట్టడం కాదా?

- మా ఉద్యోగులపై ఏపీ విద్యుత్ సంస్థలు చర్యలు తీసుకుంటాయట
- తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు మండిపాటు
 
 సాక్షి, హైదరాబాద్: ‘‘సీలేరు నుంచి తిరిగి వచ్చిన తెలంగాణ ఉద్యోగులపై ఏపీ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు చర్యలు తీసుకుంటాయట.. ఇది మమ్మల్ని రెచ్చగొట్టడం కాదా? అలాంటి తీవ్ర చర్యలకు దిగవద్దని వారిని కోరుతున్నా. ఏపీ విద్యుత్ ఉద్యోగులతో మేము క్వార్టర్లు ఖాళీ చేయించలేదు. వారికి వైద్య సదుపాయాన్ని నిలుపుదల చేయలేదు. ఇప్పుడీ పనులు చేసేలా ఏపీ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు మమ్మల్ని ఉసిగోల్పుతున్నాయి’’ అని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు మండిపడ్డారు.

దసరా పండుగను పురస్కరించుకుని మంగళవారం విద్యుత్‌సౌధలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ నిర్వహించిన ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలోని దిగువ సీలేరు జల విద్యుత్ కేంద్రం నుంచి స్వచ్ఛందంగా రిలీవై సొంత రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో చేరిన తెలంగాణ ఉద్యోగులకు ఏపీ విద్యుత్ సంస్థలు నోటీసులు జారీ చేయడంపై ప్రభాకర్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు.

 నంబర్ 1 ..
 ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో విద్యుత్ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో విద్యుత్ ఉద్యోగుల సమష్టి కృషి ఫలితంగా రాష్ట్ర విద్యుత్ శాఖ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. వార్షిక తలసరి విద్యుత్ వినియోగంలో రాష్ట్రం దేశంలోనే  నంబర్ 1 స్థానంలో ఉందన్నారు. తలసరి విద్యుత్  1,493 యూనిట్లు అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు