రికార్డు స్థాయిలో ‘కాళేశ్వరం’

4 May, 2018 02:07 IST|Sakshi

గడువు కంటే ముందే గ్యాస్‌ బేస్‌డ్‌ పనులు పూర్తి: హరీశ్‌

ఎన్‌ఆర్‌ఐల బృందంతో సుందిళ్ల పంపుహౌస్‌ సందర్శన

ధర్మారం/రామగుండం: కాళేశ్వరం ప్రాజెక్టు పనులు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం శివారులో జరుగుతున్న ప్యాకేజీ 6 టన్నెల్‌లో చేపట్టిన గ్యాస్‌బేస్‌డ్‌ విద్యుత్తు సబ్‌స్టేషన్‌ పనులు అనుకున్న దానికంటే మూడు నెలల ముందుగానే పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఇంత వేగవంతంగా పనులు జరగటం నీటిపారుదల శాఖ చరిత్రలో దేశంలోనే మొదటిదని పేర్కొన్నారు.

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారంలోని నవయుగ క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం 19 పంపుహౌస్‌లు 86 మోటార్లు, 16 సర్జిఫూల్‌ నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇందుకోసం ఎనిమిది దేశాల నుంచి పరికరాలను తెప్పించామన్నారు. 1830 కిలోమీటర్ల ప్రధాన కాల్వలు, 202 కిలోమీటర్ల టన్నెల్, 1,530 కిలోమీటర్ల పొడవునా గ్రావిటీ ద్వారా నీటి సరఫరా చేసేందుకు యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని వివరించారు.

ప్రాజెక్టులో 16 రిజర్వాయర్లు మూడు బ్యారేజీల నిర్మాణాలు సాగుతున్నాయని పేర్కొన్నారు. 141 టీఎంసీల నీటి నిల్వ చేసుకునే సామర్థ్యం కలిగి ఉందన్నారు. ఇప్పటి వరకు కాళేశ్వరం నుంచి మిడ్‌మానేరు వరకు జూలైలోగా పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేస్తామన్నారు. ప్యాకేజీ 9,7లలో పనులు నత్తనడకన సాగుతున్నాయని తెలిపారు. ప్యాకేజీ 7 టన్నెల్‌ నిర్మాణం పనులు వేగవంతం జరుగకపోవటంతో 6వ, 8వ ప్యాకేజీ పనులు చేపట్టిన ఎజెన్సీలకు అదనంగా పనులు అప్పిగించినట్లు వివరించారు. జూలైలోగా నాలుగు మోటార్లు రన్‌చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

గడువులోగా ‘సుందిళ్ల’ పూర్తిచేయాలి
అంతర్గాం మండల పరిధిలోని గోలివాడ (సుందిళ్ల) పంపుహౌస్‌ పనులను హరీశ్‌రావు 15 మంది ఎన్‌ఆర్‌ఐల బృందంతో కలసి సందర్శించారు. రివర్స్‌ పంపింగ్‌ విధానంతో చేపట్టే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుందిళ్ల పంపుహౌస్‌ నిర్మితమవుతుందని ఆయన ఎన్‌ఆర్‌ఐలకు వివరించారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు