పంద్రాగస్టున రేవ్‌ పార్టీకి ప్లాన్‌

15 Aug, 2017 02:12 IST|Sakshi
పంద్రాగస్టున రేవ్‌ పార్టీకి ప్లాన్‌
- భారీగా డ్రగ్స్‌ విక్రయించాలని కెల్విన్‌ సూచించాడని తెలిపిన నైజీరియన్‌ ముఠా
మాదక ద్రవ్యాల కేసులో తాజాగా నలుగురిని అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు
రూ.పది లక్షల విలువైన మాదక ద్రవ్యాలు స్వాధీనం
వివరాలు వెల్లడించిన సీపీ మహేశ్‌ భగవత్‌
 
సాక్షి, హైదరాబాద్‌: ‘స్వాతంత్య్ర దినోత్సవం రోజు గోవాలో రేవ్‌ పార్టీకి కెల్విన్‌ ప్లాన్‌ చేశాడు. ఆ పార్టీలో భారీగా డ్రగ్స్‌ విక్రయించాలని సమాచారమిచ్చాడు. అంతలోనే ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు కెల్విన్‌ను అరెస్టు చేశారు’ అని రాచకొండ పోలీసులకు తాజాగా చిక్కిన నలుగురు సభ్యుల ముఠా తెలిపింది. గతంలో అరెస్టు అయిన ఆరుగురు నైజీరియన్‌ నిందితులిచ్చిన వివరాల ఆధారంగా అజా గాబ్రియల్‌ ఒగొబొన్నాను రెండు రోజుల క్రితం, నవ్యంత్, అంకిత్‌ పాండే, గణత్‌ కుమార్‌రెడ్డిలను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ.పది లక్షల విలువైన 450 ఆంఫెటమైన్‌ ట్యాబ్లెట్లు, 45 గ్రాముల ఎమ్‌డీఎమ్‌ఏ, 60 ఎల్‌ఎస్‌డీ ప్యాకెట్లు, 0.5 గ్రాముల కొకైన్, 0.35 గ్రాముల చంగా, 60 గ్రాముల గంజా, ఒక పాస్‌పోర్టు, ఆరు ల్యాప్‌టాప్‌లు, రూ.40 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ సోమవారం ఇక్కడ మీడియాకు తెలిపారు.  
 
నగర పబ్‌లకు డ్రగ్స్‌ సరఫరా
డ్రగ్స్‌ విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు రాచకొండ పోలీసులు జూలై 23న ఆరుగురు నైజీరియన్లు, విజయవాడకు చెందిన ఓ యువతిని అరెస్టు చేశారు. నైజీరియాకు చెందిన అజా గాబ్రియల్‌ ఒగొబొన్నా గోవా నుంచి డ్రగ్స్‌ తీసుకువచ్చి మిగతావారికి విక్రయిస్తున్నట్టు విచారణలో తెలిపారు. దీంతో పోలీసులు అతడిపై నిఘా పెట్టారు. యాప్రాల్‌లో తన ప్రేయసి ఉంటున్న గ్రీన్‌వుడ్‌ రెసిడెన్సీకి రాగానే అదుపులోకి తీసుకున్నారు.
 
పవన్‌కుమార్‌ రెడ్డి పెడ్లర్‌
జూన్‌ 23న అరెస్టైన నైజీరియన్‌ ముఠా పోలీసు విచారణలో ఆరుగురికి డ్రగ్స్‌ విక్రయించినట్లు తెలిపింది. దీంతో ఆరుగురిని పోలీసులు ప్రశ్నించారు. వారి రక్తనమూనాలు, గోర్లు, వెంట్రుకలు సేకరించి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. వారందరూ డ్రగ్స్‌ తీసుకున్నట్టు అంగీకరించారు. అయితే ఈ కేసులో డ్రగ్‌ స్వీకరించిన పవన్‌కుమార్‌రెడ్డి పెడ్లర్‌ అని దర్యాప్తులో తేలింది. అతడిని రెండు వారాల క్రితం పోలీసులు ప్రశ్నించి వదిలేశారు. తాజా గా పవన్‌కుమార్‌ ప్రమేయం ఉన్నట్టు తేలడం తో అతని కోసం గాలిస్తున్నారు. ఈ కేసును ఛేదించిన ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, నవీన్‌కుమార్‌లతోపాటు ఇతర సిబ్బందిని రివార్డులతో సన్మానించారు. కార్యక్రమంలో జాయింట్‌ సీపీ తరుణ్‌ జోషి, ఎల్‌బీనగర్‌ డీసీపీ వెంకటేశ్వర రావు, అదనపు డీసీపీ క్రైమ్స్‌ జానకీ తదితరులు పాల్గొన్నారు.
 
గోవాకు వెళ్లినా డ్రగ్స్‌ విక్రయం ఆపలేదు
ఈ ముఠాలో కీలకవ్యక్తి కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట వాసి నూక నవ్యంత్‌. నగరంలోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో బీటెక్‌ చదువుతున్నాడు. మాదకద్రవ్యాలకు బానిసై చదువు మధ్యలోనే ఆపేశాడు. పబ్‌లకు వెళ్లేప్పుడు డీజే అంకిత్‌ పాండే పరిచయమయ్యాడు.ఇతని ద్వారా గాబ్రి యేల్‌తో స్నేహం చేశాడు. థాయిలాండ్‌ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ ద్వారా డ్రగ్స్‌ కొనుగో లు చేశాడు. ఆగస్టు 15న గోవాలో పెద్ద రేవ్‌ పార్టీ నిర్వహిస్తున్నామని, రావాలని నవ్యంత్‌కు కెల్విన్‌ చెప్పాడు. కెల్విన్‌ అరెస్టు కావడంతో నవ్యంత్‌ గోవాకు పారి పోయాడు. అక్కడి నుంచే హైదరాబాద్‌కు డ్రగ్స్‌ సరఫరా చేసేవాడు. నవ్యంత్‌ ఫోన్‌లో 50 మంది మహిళల నంబర్లు ఉన్నాయి. అందులో సినీ ప్రముఖులు, బడా వ్యాపారవేత్తలు ఉన్నారు.  
మరిన్ని వార్తలు