కోఠి మెడికల్ కాలేజీలో మళ్లీ ర్యాగింగ్

17 Dec, 2015 07:23 IST|Sakshi

జూనియర్ల దుస్తులు విప్పించిన సీనియర్లు
నలుగురు సీనియర్ విద్యార్థుల అరెస్టు.. విడుదల


 హైదరాబాద్: రాష్ట్రంలోనే పేరొందిన కోఠి ఉస్మానియా మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ భూతం మరోమారు పడగవిప్పింది. ఇటీవల ఈ వైద్య కళాశాలలో హౌస్ సర్జన్‌లపై లైంగిక వేధింపులు మరువకముందే మరోమారు అదే దారుణం చోటుచేసుకుంది. తమకు మర్యాద ఇవ్వడం లేదని జూనియర్ విద్యార్థుల దుస్తులు విప్పించి మోకాళ్లపై నిలబెట్టి సీనియర్ విద్యార్థులు ఘోరంగా ర్యాగింగ్ చేశారు. దీనిపై బాధిత విద్యార్థులు సుల్తాన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. సుల్తాన్‌బజార్ ఇన్‌స్పెక్టర్ శివశంకర్ కథనం ప్రకారం... కోఠి ఉస్మానియా మెడికల్ కళాశాల సీనియర్ విద్యార్థులు తమకు జూనియర్లు మర్యాద ఇవ్వడంలేదనే అక్కసుతో ఈ నెల 9వ తేదీన వారిని కళాశాలలోని హాస్టల్‌కు పిలిపించారు.

అనంతరం వారి దుస్తులు విప్పించి రెండు గంటలపాటు మోకాళ్లపై నిల్చోబెట్టి ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. ఎవరికైనా చెబితే బాగుండదని హెచ్చరించారు. దీంతో బాధిత విద్యార్థులు ర్యాగింగ్ విషయాన్ని బయటకు వెల్లడించలేదు. కాగా వారిలో కొందరు బుధవారం ఈ విషయమై ఫిర్యాదు చేయడంతో సుల్తాన్‌బజార్ పోలీసులు ఉస్మానియా మెడికల్ కళాశాల హాస్టల్‌కు వెళ్లి నలుగురు సీనియర్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ శివశంకర్ హెచ్చరించారు. ఈ కేసులో ఇంకా ఎంతమంది సీనియర్ విద్యార్థులున్నారో పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

మరిన్ని వార్తలు