భారత్‌లో గూగుల్ జోరు..

17 Dec, 2015 02:00 IST|Sakshi
భారత్‌లో గూగుల్ జోరు..

♦  తొలి పర్యటనలో భారీ ప్రణాళికలను ప్రకటించిన
           సీఈఓ సుందర్ పిచాయ్
♦  మరిన్ని పెట్టుబడులు, ఉద్యోగాలకు హామీ...  
♦  హైదరాబాద్‌లో మరో కొత్త క్యాంపస్...
♦  వచ్చే ఏడాది చివరికల్లా 100 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై  
♦ చౌకగా ఇంటర్నెట్ అందించడమే లక్ష్యమని వెల్లడి


 
 వ్యక్తిగతంగా నాకు, కంపెనీ పరంగా గూగుల్ వృద్ధికి భారత్ ఎన్నో అవకాశాలను కల్పించింది. అందుకే ఈ దేశానికి అంతకుమించిన ప్రతిఫలాన్ని అందించేందుకు ప్రయత్నిస్తా.

 
 న్యూఢిల్లీ: ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ భారత్‌లో దూకుడు పెంచుతోంది. కొత్తగా మరో భారీ క్యాంపస్ ఏర్పాటుతో పాటు పెద్దయెత్తున ఉద్యోగాలను కూడా కల్పించనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం మరిన్ని పెట్టుబడులను వెచ్చిస్తామని... దేశంలో కోట్లాది మందికి చౌక ఇంటర్నెట్ కల్పించడమే లక్ష్యమని పేర్కొంది. కంపెనీ సీఈఓగా భారత్‌కు చెందిన సుందర్ పిచాయ్ ఈ ఏడాది ఆగస్టులో బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి స్వదేశంలోకి అధికారికంగా అడుగుపెట్టారు.
 
  రెండు రోజుల పర్యటన కోసం బుధవారం ఇక్కడికి వచ్చిన సందర్భంగా ‘గూగుల్ ఫర్ ఇండియా’ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన కంపెనీ ప్రణాళికలను వెల్లడించారు. చెన్నైలో పుట్టిపెరిగిన పిచాయ్... తొలిరోజు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ; ఐటీ, టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌లను కలిశారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలతో పాటు ఇతర ఉన్నతాధికారులతో కూడా ఆయన భేటీ కానున్నారు.
 
 హైదరాబాద్‌లో భారీ కొత్త క్యాంపస్...
 భారత్‌లో గూగుల్ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా హైదరాబాద్‌లో భారీ స్థాయిలో మరో కొత్త క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తామని పిచాయ్ ప్రకటించారు. ముఖ్యంగా ఇంజనీరింగ్, బిజినెస్ డెవలప్‌మెంట్ రంగాల్లో పెట్టుబడులు పెడతామని చెప్పారు. ప్రజలకు ఇంటర్నెట్‌ను మరింత చేరువ చేయడం కోసం సులువైన, వేగవంతమైన కొత్త ప్రొడక్టులను అభివృద్ధి చేయడంపై దృష్టిసారిస్తున్నట్లు కూడా గూగుల్ చీఫ్ పేర్కొన్నారు. అయితే, ఈ కొత్త క్యాంపస్ కోసం ఏమేరకు పెట్టుబడులు ఉంటాయన్న వివరాలను ఆయన వెల్లడించలేదు. ప్రస్తుతం భారత్‌లో గూగుల్‌కు 1,500 మంది ఉద్యోగులు ఉన్నారు. ‘భారత్‌కు ఉద్దేశించిన ప్రొడక్టుల రూపకల్పన కోసం హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న కొత్త క్యాంపస్‌ను ఉపయోగించుకుంటాం. బెంగళూరు క్యాంపస్‌లో భారీగా కొత్త కొలువులు కూడా కల్పిస్తాం’ అని పిచాయ్ వివరించారు.
 
 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై...
 వచ్చే ఏడాది(2016) చివరినాటికి దేశవ్యాప్తంగా 100 రైల్వే స్టేషన్లలో ఉచితంగా వైఫై ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించనున్నామని గూగుల్ సీఈఓ పేర్కొన్నారు. మొత్తం 400 స్టేషన్లలో ఉచిత వైఫై కోసం ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు కోసం గూగుల్, రైల్వే శాఖకు చెందిన టెలికం విభాగం రైల్‌టెల్‌తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలి దశలో 100 స్టేషన్లలో ఈ సౌకర్యాన్ని అందిస్తామని పిచాయ్ వెల్లడించారు. వచ్చే నెల(జనవరి)కల్లా ముంబై సెంట్రల్ స్టేషన్‌లో వైఫై అందుబాటులోకి వస్తుందన్నారు.
 
  ఈ ఏడాది సెప్టెంబర్‌లో కాలిఫోర్నియాలోని గూగుల్ ప్రధాన కేంద్రాన్ని ప్రధాని మోదీ సందర్శించిన సందర్భంగా గూగుల్ ఈ ఉచిత వైఫై ప్రాజెక్టుపై హామీనిచ్చిన సంగతి తెలిసిందే. ‘దేశంలో ప్రతిఒక్కరికీ ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రధాన లక్ష్యంతో మేం ముందుకెళ్తున్నాం. అంతేకాదు ఇక్కడి ప్రజల అవసరాలకు అనుగుణంగా, వారి అభిప్రాయాలను ఇంటర్నెట్ ద్వారా అందరికీ తెలియజేసేవిధంగా తగిన ప్రొడక్టులను రూపొందించాలన్నదే మా ప్రయత్నం.
 
  రానున్న కాలంలో ఇంటర్నెట్ యూజర్లుగా మారనున్న 100 కోట్ల మంది భారతీయులే లక్ష్యంగా మా కొత్త ఉత్పత్తులు ఉంటాయి’ అని పిచాయ్ చెప్పారు. మరోపక్క, మహిళల కోసం ఉద్దేశించిన గ్రామీణ ఇంటర్నెట్ ప్రోగ్రామ్‌ను మూడేళ్లలో దేశ వ్యాప్తంగా మూడు లక్షల గ్రామాల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఇది ప్రయోగాత్మకంగా(పైలట్) నడుస్తోందన్నారు.
 
 భారత్ కోసం మూడంచెల వ్యూహం...
 భారత్‌తో పాటు ఇతర వర్ధమాన దేశాల్లో ఇంటర్నెట్ వినియోగం పెంచేందుకు అనుసరించాల్సిన మూడంచెల వ్యూహాన్ని పిచాయ్ తన తొలి పర్యటనలో ప్రకటించారు. మెరుగైన కనెక్టివిటీ, అత్యంత నాణ్యమైన సాఫ్ట్‌వేర్‌లతో ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం ఇందులో మొదటిది. సరళంగా ఉండేవిధంగా భారతీయుల కోసం ప్రత్యేక ప్రొడక్టుల రూపకల్పన రెండోది. ఇక గూగుల్ గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌లయిన ఆండ్రాయిడ్, క్రోమ్‌లను ఉపయోగించుకొని స్థానిక సమస్యలకు మెరుగైన పరిష్కారాలను అందించడం మూడో అంశంగా పిచాయ్ వివరించారు. ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రాచుర్యం పొందిన గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌తో పాటు క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించిన ఘనత పిచాయ్ సొంతం. ఆండ్రాయిడ్ ఓఎస్ యూజర్లకు సంబంధించి భారత్ త్వరలోనే అమెరికాను వెనక్కినెట్టేయనుందని కూడా ఈ సందర్భంగా పిచాయ్ చెప్పారు.
 
 
 భారత్‌లోనూ ‘ప్రాజెక్ట్ లూన్’..
 కోట్లాది మంది ప్రజలకు ఇంటర్నెట్‌ను చౌకగా అందించేందుకు గూగుల్ తలపెట్టిన ‘ప్రాజెక్ట్ లూన్’ను భారత్‌లోనూ అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ను చేరువ చేయాలంటే ప్రాజెక్ట్ లూన్ వంటివి చాలా అవసరమని పిచాయ్ వ్యాఖ్యానించారు. ‘ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలను నెలకొల్పాలన్నది గూగుల్ సంకల్పం. ఇందులో భాగమే ప్రాజెక్ట్ లూన్. దీని కోసం ఆకాశంలో చాలా ఎత్తుకు బెలూన్‌లను పంపి వాటి ద్వారా నెట్ వినియోగానికి అవసరమైన సిగ్నల్స్ ప్రసారమయ్యేలా చేస్తాం. ప్రపంచవ్యాప్తంగా అనేక స్థానిక టెలికం కంపెనీలతో ఈ ప్రాజెక్టు విషయంలో పని చేస్తున్నాం.
 
  ఒకరకంగా వీటిని గాలిలో(20 కిలోమీటర్ల ఎత్తులో) తేలియాడే సెల్ టవర్లుగా పరిగణించొచ్చు’ అని గూగుల్ వైస్ ప్రెసిడెంట్(యాక్సెస్ స్ట్రాటజీ, ఎమర్జింగ్ మార్కెట్స్) మారియన్ క్రోక్ పేర్కొన్నారు. భారత్‌లో ఈ ప్రాజెక్టు అమలుకు వీలుకల్పిస్తారన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ టెక్నాలజీని న్యూజిలాండ్, అమెరికాలోని కాలిఫోర్నియా, బ్రెజిల్‌లలో గూగుల్ పరీక్షించింది. వైర్‌లెస్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ(ఎల్‌టీఈ లేదా 4జీ) ఆధారంగా పనిచేసే ఈ ఒక్కో బెలూన్‌తో భూమిపైన 40 కిలోమీటర్ల పరిధిలో ఇంటర్నెట్ కనెక్టివిటీని కల్పించవచ్చని గూగుల్ చెబుతోంది. ఇందుకోసం సెల్యులార్ స్పెక్ట్రం ఉన్న టెలికం ఆపరేటర్లతో గూగుల్ భాగస్వామ్యం కుదుర్చుకోవాలని భావిస్తోంది.
 
  అయితే, దీనిలో ఉపయోగించే స్పెక్ట్రం బ్యాండ్‌నే సెల్యులార్ ఆపరేటర్లు కూడా ఉపయోగిస్తున్న నేపథ్యంలో సాంకేతికంగా సమస్యలు ఉంటాయని తాజాగా టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ పార్లమెంటులో పేర్కొనడం గమనార్హం.
 
 వచ్చే ఏడాది మాకు అతిపెద్ద మార్కెట్ ఇదే..
 గూగుల్‌కు రానున్న ఏడాదిలో అమెరికా కంటే భారత్ అతిపెద్ద మార్కెట్‌గా ఆవిర్భవించనుందని పిచాయ్ పేర్కొన్నారు. అందుకే ఇక్కడ మరింత దృష్టి కేంద్రీకరించాల్సిన తరుణం వచ్చిందని కూడా ఆయన చెప్పారు. వ్యాపారానికి సానుకూల పరిస్థితుల విషయంలో భారత్‌లో పురోగతి ఉందని... అయితే, ఇది మరింత పెరగాల్సిందేనని పిచాయ్ అభిప్రాయపడ్డారు.
 
  సమాచార స్వేచ్ఛ అనేది అత్యంత ప్రధానమైన అంశమని.. ఇంటర్నెట్‌తోనే ఇదంతా సాధ్యపడుతుందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. భారతీయులు గనుక యూట్యూబ్ వీడియోలను రూపొందిస్తే, వాటిని చూసేవారిలో 60 శాతం మంది ఇతర దేశాల్లోనే ఉంటారని.. సమాచార స్వేచ్ఛా ప్రవాహానికి ఇదే నిదర్శనమని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
 
 క్రోమ్‌బిట్‌తో మానిటర్ పీసీగా..!
 వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ‘ట్యాప్ టు ట్రాన్స్‌లేట్’ అనే కొత్త ఫీచర్‌ను గూగుల్ పరిచయం చేస్తుందని గూగుల్ సీఈఓ ప్రకటించారు. దీనిలో ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉపయోగించే అన్ని యాప్‌లలోనూ ఎలాంటి టెక్స్ట్‌నైనా అప్పటికప్పుడే ఇతర భాషల్లోకి తర్జుమా చేసి చూపించడం దీని ప్రత్యేకత. మరోపక్క, ‘క్రోమ్‌బిట్’ పేరుతో చిన్న పరికరాన్ని వచ్చే నెలలోనే భారత్‌లో ప్రవేశపెట్టనున్నామని గూగుల్ వైస్‌ప్రెసిడెంట్ జాసన్ టైటస్ చెప్పారు.
 
  దీనిద్వారా ఏ మానిటర్‌నైనా కంప్యూటర్‌గా మార్చేసుకోవడానికి వీలవుతుందని.. ముఖ్యంగా విద్యా రంగంలో కంపూటర్ల వాడకాన్ని పెంచేందుకు ఇది దోహదం చేస్తుందని ఆయన వివరించారు. ఇక భారత్ ప్రణాళికల్లో భాగంగా ఇప్పటికే 11 భారతీయ భాషల్లో టైపింగ్‌కు ఉపయోగపడే వర్చువల్ కీబోర్డును గూగుల్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా వచ్చే మూడేళ్లలో 20 లక్షల మంది ఆండ్రాయిడ్ యాప్ డెవలపర్లకు సాంకేతికపరమైన సహకారాన్ని అందించేందుకు కూడా గూగుల్ ముందుకొచ్చిన విషయాన్ని పిచాయ్ గుర్తుచేశారు..
 
 ఇందుకోసం జాతీయ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో పాటు 30 యూనివర్సిటీలతో కూడా భాగస్వామ్యం కుదుర్చుకుంది. 2018 కల్లా భారత్‌లో 50 కోట్ల మంది ఆన్‌లైన్ యూజర్లుగా మారనున్నారని.. గూగుల్ వైస్‌ప్రెసిడెంట్(ఇండియా, ఆగ్నేయాసియా) రాజన్ ఆనందన్ పేర్కొన్నారు. ఇప్పటికీ 30 శాతం మొబైల్ ఇంటర్నెట్ వాడకం 2జీ కనెక్షన్లతోనే జరుగుతోందని కూడా ఆయన తెలిపారు. ఇందుకోసం తక్కువ బ్యాండ్‌విడ్త్‌తో పనిచేసే ఉత్పత్తులను రూపొందించడంపై దృష్టి పెట్టినట్లు ఆనందన్ వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు