నిశ్చితార్థం రోజే నేవీ ఇంజనీర్ దుర్మరణం

18 Nov, 2015 18:33 IST|Sakshi
నిశ్చితార్థం రోజే నేవీ ఇంజనీర్ దుర్మరణం

కీసర: రంగారెడ్డి జిల్లా కీసర మండలం నాగారంలో ఘోరం జరిగింది.  మెరైన్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఆ యువకుడికి మరి కొద్ది గంటల్లో నిశ్చితార్థం జరగాల్సి ఉంది. అయితే  ఇంట్లో భారీ పేలుడు సంభవించి అతడు  దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

నాగారం సత్యనారాయణ కాలనీలోని సాయిబాబా ఆలయం సమీపంలో నివసిస్తున్న రైల్వే ఉద్యోగి విన్నకోట హరగోపాల్, దమయంతిల కుమారుడు రాజా(26) మంగళవారం రాత్రి అనూహ్యంగా మరణించాడు. నౌకాదళం(నేవీ)లో మెరైన్ ఇంజనీర్ గా పనిచేస్తున్న రాజాకు ఇటీవలే పెళ్లి సంబంధం కుదిరింది. బుధవారం ఉదయం నిశ్చితార్థం జరగాల్సి ఉంది. కార్యక్రమానికి కావల్సిన వస్తువులు షాపింగ్ చేసేందుకు నిన్న సాయంత్రం హరగోపాల్, దమయంతి దంపతులు నగరానికి వచ్చారు. ఇంట్లో రాజాతోపాటు అమ్మమ్మ ఉంది.

ఇంతలోనే ఉన్నట్లుండి ఫ్రిజ్ చెడిపోయింది. దీంతో రాజా.. మెకానిక్ ను పిలిపించాడు. ఫ్రిజ్ ను ఊడదీసి పరిశీలించిన మెకానిక్.. పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువుల స్థానంలో కొత్తవి కొనుక్కొస్తానని వెళ్లాడు. ఈలోగా అమ్మమ్మకు కాఫీ పెట్టిద్దామని వంట గదిలోకి వెళ్లిన రాజా గ్యాస్ స్టౌ వెలిగించాడు. అంతే! క్షణంలో గది నిండా మంటలు వ్యాపించాయి. సిలిండర్ పేలడంతో మంటలు ఎక్కువయ్యాయి. ఆ వెంటనే పక్కనున్న మరో సిలిండర్ కూడా పేలింది. అగ్నికీలల ధాటికి వంటగది అమాంతం కూలిపోయింది. మంటల్లో చిక్కుకున్న రాజా తీవ్రంగా గాయపడ్డాడు.  అలాగే ఇంట్లోని సోఫాలు, ఎల్‌ఈడీ టీవీలతో పాటు వంట సామగ్రి, తదితరాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఆ ఇంటి బయట కూర్చున్న రాజా అమ్మమ్మకు స్వల్ప గాయాలయ్యాయి.

స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, 108 సిబ్బంది, ఫైర్ సిబ్బంది.. అతికష్టం మీద మంటలను ఆర్పి రాత్రి 10 గంటల సమయంలో రాజాను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి ఒంటి గంట సమయంలో రాజా కన్నుమూశాడు. ఒక్కగానొక కొడుకు నిశ్చితార్థం జరగాల్సిన రోజే అంత్యక్రియలు జరగడంతో మృతుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కాగా, ఫ్రిజ్ రిపేర్ సమయంలో అందులో ఉండే నైట్రోజన్ గ్యాస్ లీకవ్వడం వల్లనే గ్యాస్ సిలిండర్ అంటుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు