దూసుకెళ్తున్న టామ్‌కామ్

8 Oct, 2016 02:41 IST|Sakshi

తాజాగా గల్ఫ్ దేశాల్లో డాక్టర్ల రిక్రూట్‌మెంట్‌కు ఒప్పందం
 
 సాక్షి, హైదరాబాద్: విదేశీ ఉద్యోగ కల్పనలో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ (టామ్‌కామ్) దూసుకెళ్తోంది. గల్ఫ్ దేశాలలో స్కిల్డ్, అన్‌స్కిల్డ్ రంగాలలో ఉద్యోగాల కల్పనకు పెద్ద ఎత్తున కృషి చేస్తోంది. ఇప్పటి వరకు అన్‌స్కిల్డ్ రంగాలకు సంబంధించి దాదాపు 750 మందిని వివిధ కంపెనీల కోసం నియామకాలు చేసి, గల్ఫ్ దేశాలకు పంపిన విషయం తెలిసిందే. అలాగే మరో 156 మంది పారా మెడికల్ సిబ్బంది రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి కూడా గల్ఫ్ దేశాలలోని ఆస్పత్రులతో ఒప్పందం చేసుకుంది. తాజాగా కొన్ని విభాగాలలో డాక్టర్ల నియామకాలు కూడా చేయడానికి టామ్‌కామ్‌కు అనుమతి లభించింది.

మొదటి విడుతలో భాగంగా సౌదీఅరేబియాలో పనిచేయడానికి 12 డాక్టర్ పోస్టులకు నియామకాలు జరపనున్నారు. ప్రారంభ వేతనం భారత కరెన్సీ ప్రకారం నెలకు రూ.6 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు ఉంటుంది. అయితే రెండేళ్ల పాటు అక్కడ పనిచేయాల్సి ఉంటుంది. ఏడాదికి నెల రోజుల పాటు సెలవులు. విమాన చార్జీలు, సౌదీలో రవాణా, మెడికల్ సదుపాయం సంబంధిత కంపెనీయే భరిస్తుంది. ఆసక్తిగల వారు ఆన్‌లైన్ ద్వారా ఈ నెల 13 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా టామ్‌కామ్ డెరైక్టర్ కె.వై.నాయక్ తెలిపారు. డాక్టర్ల నియామకానికి సంబంధించి కార్డియాలజిస్ట్(2), ఈఎన్‌టీ(2), పిడియాట్రిక్ (2), గైనకాలజిస్ట్(మహిళ) (2), డెర్మటాలజిస్ట్(2), న్యూరోసర్జరీ స్పెషలిస్ట్(1) విభాగాల్లో ఖాళీలున్నాయి.

 పారామెడికల్ రిజిస్ట్రేషన్ గడువు పెంపు
 పారామెడికల్ సిబ్బంది నియామకాలకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును ఈ నెల 5 నుంచి 13కు పొడిగించినట్టు నాయక్ చెప్పారు. గల్ఫ్ దేశాలలో వివిధ విభాగాలల్లో దాదాపు 156 మంది పారామెడికల్ సిబ్బంది నియమకాలను చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 156 పోస్టులకు గాను దాదాపు వెయ్యి మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే ఎంప్లాయిమెంట్ కార్డు గడువు ముగిసిన వారు రెన్యూవల్ చేసుకోవడానికి డెరైక్టర్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అవకాశం కల్పించింది. వీరందరూ జిల్లాలోని ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో రెన్యూవల్ చేసుకోవచ్చని నాయక్ చెప్పారు.

>
మరిన్ని వార్తలు