ఇజ్రాయెల్‌కు ఊహించని షాక్‌.. సౌదీ అరేబియా కీలక నిర్ణయం!

14 Oct, 2023 16:11 IST|Sakshi

రియాద్‌: ఇజ్రాయెల్‌-హమాస్ మిలిటెంట్ల మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. యుద్ధం కారణంగా ఇప్పటికే వేల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారు. ఇదే సమయంలో ప్రపంచంలోని చాలా దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో అరబ్‌ దేశమైన సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌(అరబ్‌ లీగ్‌లో భాగంగా)తో సత్సంబంధాలు ఏర్పరుచుకోవడానికి ఉద్దేశించిన ఒప్పంద చర్చలకు సౌదీ బ్రేక్‌ వేసినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

వివరాల ప్రకారం.. ఇజ్రాయెల్‌తో ఒప్పంద చర్చలను నిలిపివేయాలని సౌదీ నిర్ణయించిందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని అమెరికా అధికారులకు సౌదీ తెలియజేసినట్లు సమాచారం. అయితే, కొన్నేళ్లుగా అరబ్‌లీగ్‌తో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఇజ్రాయెల్‌ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే 1979లో ఇజ్రాయెల్‌.. ఈజిప్టుతో సత్సంబంధాలు ఏర్పరుచుకుంది. ఇదే సమయంలో యూఏఈ, బహ్రెయిన్‌ వంటి దేశాలు ఇజ్రాయెల్‌తో కొన్ని ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయి. ఇందుకు అమెరికా ఇజ్రాయెల్ కు అండగా నిలిచింది. తాజాగా సౌదీ అరేబియాను ఆ జాబితాలోకి చేర్చే ప్రయత్నం అగ్రరాజ్యం అమెరికా ప్రయత్నాలు చేసింది. తాజా యుద్ధంతో అమెరికా ప్రయత్నాలు విఫలమైనట్లు తెలుస్తోంది. కాగా, ఇలాంటి పరిస్థితుల్లో ఒప్పందం విషయంలో ముందుకు వెళ్లడం కరెక్ట్‌ కాదనే ఆలోచన సౌదీ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. దీంతో, ఇజ్రాయెల్ అరబ్ దేశాల్లో బలమైన దేశంగా ఉన్న సౌదీ అరేబియాతో సంబంధాలు చేసుకోవాలన్న ప్రయత్నాలు బెడిసికొట్టాయని చెప్పుకోవచ్చు.

పాలస్తీనానే సమస్య..
అరబ్‌లీగ్‌లో కీలకంగా సౌదీ అరేబియా కొనసాగుతోంది. ఈ తరుణంలో ఇజ్రాయెల్‌తో సౌదీ సంబంధాలు ఏర్పరచుకుంటే మిగతా ముస్లిం దేశాలకు అది బలమైన సంకేతాన్ని పంపుతుంది. ఇతర దేశాలు సైతం సౌదీ బాట పట్టే అవకాశం ఉంది. సాధారణంగా పాలస్తీనా సమస్య.. అరబ్‌ దేశాలకు ఓ భావోద్వేగపరమైన అంశం. అందుకే మెజారిటీ ముస్లిం దేశాలు ఇజ్రాయెల్‌ విషయంలో ఇన్నాళ్లూ కఠిన వైఖరినే అవలంబిస్తూ వచ్చాయి. ఆ దేశ సార్వభౌమత్వాన్ని అధికారికంగా గుర్తించడానికి తిరస్కరిస్తూ వచ్చాయి. కాగా, ఇజ్రాయెల్‌తో సంబంధాల కారణంగా పాలస్తీనీయుల హక్కులకు వెన్నుపోటు పొడవడమే అవుతుందని ఇరాన్‌ కూడా పేర్కొంది. దీంతో, మరిన్ని దేశాలు కూడా ఇజ్రాయెల్‌లో సంబంధాలపై ఆలోచిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. చర్చల విషయంలో సౌదీకి ఇరాన్‌కు కూడా కీలక ప్రతిపాదన చేసినట్టు సమాచారం. 

మరిన్ని వార్తలు