పురపాలికల్లో సంస్కరణలు..!

23 May, 2017 03:36 IST|Sakshi
పురపాలికల్లో సంస్కరణలు..!

- క్షేత్ర స్థాయి అధికారులతో అధ్యయన కమిటీ
- ఇక అభివృద్ధి పనుల బాధ్యత జిల్లా కలెక్టర్ల చేతికి
- పురపాలక శాఖ తాజా నిర్ణయాలు  


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పురపాలికల్లో పాలన వ్యవహారాలను గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణల కమిటీ ఏర్పాటు చేసింది. పురపాలనలో తీసుకురావాల్సిన కొత్త ఒరవడికలపై ఈ కమిటీ అధ్యయనం జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. పురపాలికల రోజువారీ పాలన వ్యవహారాల్లో అనుభవం కలిగిన క్షేత్ర స్థాయి అధికారులతో ఈ కమిటీని ఏర్పాటు చేయడం గమనార్హం. పురపాలక శాఖ డైరెక్టరేట్‌ కార్యా లయ అదనపు సంచాలకులు పి.అనురాధ, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్లు జయరాజ్‌ కెన్నడీ, ఎన్‌.రవికిరణ్, రామగుండం మునిసి పల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ జాన్‌ శామ్సన్, బోడుప్పల్‌ మునిసిపల్‌ కమిషనర్‌ ఆర్‌.ఉపేందర్‌రెడ్డి, సిద్దిపేట మునిసిపల్‌ కమిషనర్‌ కేవీ రమణాచారి, పురపాలక శాఖ సహాయ సంచాలకులు కె.ఫల్గుణి కుమార్, కోరుట్ల మునిసిపల్‌ కమిషనర్‌ ఎ.వాణిలతో ప్రభుత్వం ఈ సంస్కరణల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ ఈ నెల 19న ఉత్తర్వులు జారీ చేశారు.

జిల్లా కలెక్టర్ల కమిటీకి అభివృద్ధి పనులు
రాష్ట్రంలోని పురపాలికల్లో చేపట్టాల్సిన అభి వృద్ధి పనులను గుర్తించి మంజూరు చేసే బాధ్యతను జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని కార్య నిర్వాహక కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. పురపాలికల్లో చేపట్టే అభివృద్ధి పనుల్లో అవినీతి, అక్రమాలను నిర్మూలించేం దుకు నేరుగా జిల్లా కలెక్టర్ల చేతికి ప్రభుత్వం బాధ్యతలు అప్పగించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. పురపాలికల్లో పనుల నిర్వహణ, నాణ్యత పరిరక్షణ, పురోగతిపై సమీక్ష, పనుల కోసం ఇంజనీరింగ్‌ విభాగం ఎంపిక, వివిధ విభాగాల మధ్య సమన్వయం కోసం ఈ కమిటీ పని చేయనుంది. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా వ్యవహరించనుండగా, స్థానిక ఎమ్మెల్యే, మేయర్‌/చైర్మన్, జిల్లా కేంద్రంలోని సీనియర్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీర్, సంబంధిత మునిసిపాలిటీకి సంబంధించిన మునిసిపల్‌ ఇంజనీర్‌ సభ్యులుగా, మునిసిపల్‌ కమిషనర్‌ కన్వీనర్‌గా వ్యవహరిం చనున్నారు. ఈమేరకు శాఖ కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.  

ఆటో టిప్పర్లతో చెత్త సేకరణ
రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో 4 చక్రాల టిప్పర్‌ ఆటోలతో చెత్త సేకరించేందుకు డ్రైవర్‌ కమ్‌ ఓనర్‌ పథకాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద లబ్ధిదారుల ఎంపిక కోసం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) మిషన్‌ డైరెక్టర్‌ నేతృత్వంలో టెక్నికల్‌/ఫైనాన్షియల్‌ కమిటీని ఏర్పాటు చేసింది. 4 చక్రాల ఆటో టిప్పర్ల మోడళ్ల ఎంపిక, ధరల ఖరారుతో పాటు ఆటో టిప్పర్ల కోసం టెండర్ల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం ఈ కమిటీకి అప్పగించింది. ఈ కమిటీలో సభ్యులుగా పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీర్‌ ఇన్‌చీఫ్, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్, చీఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్, జాయింట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్, టీయూఎఫ్‌ఐడీసీ నుంచి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌లను ప్రభుత్వం నియమించింది. అదే విధంగా డ్రైవర్‌ కమ్‌ ఓనర్‌ పథకం కింద లబ్ధిదారుల ఎంపిక కోసం మునిసిపల్‌ కమిషనర్ల నేతృత్వంలో మరో కమిటీని ఏర్పాటు చేసింది. మునిసిపల్‌ కార్పొరేషన్ల విషయంలో మాత్రం పురపాలక శాఖ ప్రాంతీయ సంచాలకుల నేతృత్వంలోని ఎంపిక కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేయనుంది.

మరిన్ని వార్తలు