రహదారి భద్రత అందరి బాధ్యత

24 Apr, 2017 00:56 IST|Sakshi
రహదారి భద్రత అందరి బాధ్యత

⇒ ‘మన టీవీ’ సీఈవో శైలేష్‌రెడ్డి
⇒ హెల్మెట్, సీట్‌బెల్ట్‌ మరిచిపోవద్దు
⇒ జర్నలిస్టుల లెర్నింగ్‌ లైసెన్స్‌ మేళాకు అనూహ్య స్పందన

సిటీబ్యూరో: రోడ్డు నిబంధనల పట్ల శాస్త్రీయమైన అవగాహనతో వాహనాలు నడిపినప్పుడే ప్రమాదా లను పూర్తిస్థాయిలో నివారించగలమని పలువురు వక్తలు సూచించారు. డ్రైవింగ్‌ సమయంలో రహదారి భద్రత సంకేతాలను, జాగ్రత్తలను కచ్చితంగా పాటిం చాలన్నారు. హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్, ఆర్టీఏ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఖైరతాబాద్‌లో నిర్వహించిన జర్నలిస్టుల లెర్నింగ్‌ లైసెన్స్‌ మేళాకు అనూహ్య స్పందన లభించింది.

ఎలక్ట్రానిక్, ప్రింట్‌ మీడియాకు చెందిన వందలాది మంది పాత్రికేయులు, ఫొటో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఈ మేళాలో పాల్గొన్నారు. కార్యక్రమానికి మన టీవీ సీఈవో శైలేష్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఖైరతాబాద్‌ ప్రాంతీయ రవాణా అధికారి జీపీఎన్‌ ప్రసాద్, హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షులు రాజమౌళిచారి, ప్రధాన కార్యదర్శి శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శైలేష్‌ రెడ్డి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల కారణంగా ఏ ఒక్క వ్యక్తికి ప్రాణనష్టం జరిగినా అది అతడి కుటుంబానికి నష్టమేనని, పత్రికా రంగంలో రేయింబంవళ్లు విధులు నిర్వహించే జర్నలిస్టులు రహదారి భద్రత పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘హెల్మెట్, సీట్‌ బెల్ట్‌ పట్ల కొందరిలో వ్యతిరేకత ఉంది. అది ఏ మాత్రం మంచి పద్ధతి కాదు.  నా తల నా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మీ విలువైన ప్రాణం కేవలం మీ ఒక్కరిదే కాదు.

అది సామాజిక సంపద’ అని పేర్కొన్నారు. లెర్నింగ్‌ లైసెన్స్‌ మెళాకు నేతృత్వం వహించిన ఖైరతాబాద్‌ ప్రాంతీయ రవాణా అధికారి  జీపీఎన్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ.. వాహనాలు నడపాలంటే తప్పనిసరిగా రోడ్డు సెన్స్‌ ఉండితీరాలన్నారు. డ్రైవింగ్‌ చేసే సమయంలో కారు సీటు బెల్టు ధరించడంతో పాటు ఏకాగ్రతతో వాహనం నడపాలన్నారు.

కారు నడిపేటప్పుడు ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు భరత్‌సింగ్, లావణ్య, టీఎన్జీవోస్‌ రవాణా విభాగం ప్రధాన కార్యదర్శి సామ్యూల్‌ పాల్, ఆర్టీఏ మినిస్టీరియల్‌ ఉద్యోగులు పాల్గొని జర్నలిస్టుల లైసెన్స్‌ మేళాను విజయవంతం చేశారు.

మరిన్ని వార్తలు