నిండా ముంచేసింది

2 May, 2016 01:41 IST|Sakshi
నిండా ముంచేసింది

సుమారు రూ. 10 కోట్లతో చిట్టీ వ్యాపారి పరార్
కేసు నమోదు

 
నేరేడ్‌మెట్
: జనం నుంచి సుమారు రూ.10 కోట్లు దండుకొని చిట్టీల వ్యాపారి పరారైంది.  నేరేడ్‌మెట్ ఇన్‌స్పెక్టర్ జగదీష్‌చందర్ కథనం ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రఘునాథ్‌రెడ్డి, అరుణారెడ్డి దంపతులు 25 ఏళ్లుగా నేరేడ్‌మెట్  పరిధిలోని డిఫెన్స్ కాలనీలో ఉంటున్నారు. రఘునాథ్‌రెడ్డి మాజీ సైనికుడు కాగా.. అరుణారెడ్డి చిట్టీల వ్యాపారం చేస్తోంది. రూ. లక్ష నుంచి 10 లక్షల చిట్టీలు వేస్తోంది. చిట్టీ ముగిసిన వారికి, పాడుకున్న వారికి మొదట్లో సవ్యంగానే డబ్బు చెల్లించేది. ఆ తర్వాత చిట్టీ పూర్తయిన వారికి అధిక వడ్డీ ఆశ చూపి డబ్బు చెల్లించకుండా తన వద్దే ఉంచుకొనేది.

అంతేకాకుండా వడ్డీ డబ్బుతో తన వద్దే మరో చిట్టీ వేసేలా వారిని ఒప్పించేది. అయితే, కొందరు తమకు డబ్బు తిరిగి ఇవ్వాలని కోరడంతో ఈవేళ, రేపంటూ అరుణారెడ్డి తన ఇంటి చుట్టూ తిప్పించుకుంది. దీంతో వారు తక్షణం డబ్బు చెల్లించాలని ఇటీవల ఒత్తిడి చేయడంతో  ఓ స్థలం విక్రయించామని, మే 3వ తేదీని దానికి సంబంధించిన డబ్బు తమ చేతికి వస్తుందని, ఆరోజు అందరికీ చెల్లిస్తానని నమ్మబలికింది.

ఇదిలా ఉండగా.. గత సోమవారం అరుణ కుటుంబ సభ్యులు రాత్రికి రాత్రి ఇంటికి తాళం వేసి ఎటో వెళ్లిపోయారు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న సుమారు 50 మంది బాధితులు ఆదివారం డిఫెన్స్ కాలనీలోని అరుణారెడ్డి ఇంటికి వెళ్లి ఆందోళన చేపట్టారు. చిట్టీలు వేసిన సుమారు వంద మందికి దాదాపు రూ. 30 కోట్ల వరకు అరుణారెడ్డి చెల్లించాల్సి ఉందని బాధితులు తెలిపారు. బాధితుల్లో కొందరికి రూ. 25 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు బాకీ ఉందని చెప్పారు. అనంతరం బాధితులు నేరేడ్‌మెట్  ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేయగా, చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు