ఎస్‌ఎస్‌ఏలో పెరిగిన వేతనాలు

27 Aug, 2016 02:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: సర్వశిక్షా అభియాన్(ఎస్‌ఎస్‌ఏ)లో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఆధ్వర్యంలో సమావేశమైన పాలకమండలి తీర్మానించింది. దీంతో క్లస్టర్ రిసోర్స్‌పర్సన్లకు రూ.14,500, అటెండర్లకు రూ.10 వేలు, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ టీచర్లకు రూ.15 వేలు, కస్తుర్బాగాంధీ బాలికా విద్యాలయ(కేజీబీవీ)ల్లోని స్పెషల్ ఆఫీసర్లకు రూ.21 వేలు, వంట కార్మికులకు రూ.7,500 వరకు వేతనాలు పెరిగాయి. ఎస్‌ఎస్‌ఏ కింద పనిచేస్తున్న 17 వేల మంది ఉద్యోగులకు వేతన పెంపు వర్తిస్తుందని, ప్రతియేటా రూ.60 కోట్లు అదనంగా కేటాయించాల్సి వస్తుందని అదనపు ప్రాజెక్ట్ డెరైక్టర్ భాస్కర్‌రావు తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో వాచ్‌మన్లు, అటెండర్ల నియామకం చేపట్టాలని డిప్యూటీ సీఎం(విద్య) నిర్ణయించడంతో మరో రూ.85 కోట్లు కేటాయించామని ఏపీడీ పేర్కొన్నారు. కేజీబీవీల్లో క్రీడల కోసం ప్రతి జిల్లాకు రూ.3 లక్షలు, రాష్ట్రస్థాయిలో ఆటలకు రూ.5 లక్షలు, వంటపాత్రల మరమ్మతులకు ప్రతి కేజీబీవీకి రూ.50 వేల చొప్పున కేటాయించారు. సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రంజీవ్ ఆచార్య, ఆర్థికశాఖ కార్యదర్శులు రామకృష్ణారావు, నవీన్ మిట్టల్, ఎస్‌ఎస్‌ఎ ప్రాజెక్ట్ డెరైక్టర్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు