రెండు ముఠాలకు చెందిన ఏడుగురి అరెస్టు

1 Nov, 2013 04:30 IST|Sakshi

చందానగర్, న్యూస్‌లైన్: పోలీసులమని ఇళ్లలోకి చొరబడి కత్తులో బెదిరించి నగలు దోచుకోవడంతో పాటు బాధితుల నుంచి ఏటీఎం కార్డు తీసుకొని డబ్బు డ్రా చేస్తున్న ఓ దోపిడీ ముఠాతో పాటు చోరీలకు పాల్పడుతున్న మరో అంతర్‌జిల్లా దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మొత్తం ఏడుగురిని అరెస్టు చేసి రూ. 19 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. గురువారం సైబరాబాద్ క్రైమ్ డీసీపీ రంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... వైజాగ్‌కు చెందిన రాజేంద్రకుమార్(24) చిన్నతనంలోనే నగరానికి వచ్చాడు.

ఎర్రగడ్డ ప్రేమ్‌నగర్‌లో ఉంటున్న ఇతనికి ఇదే ప్రాంతానికి చెందిన చాకలి రవి(24)తో 2010లో పరిచయమైంది. ఇద్దరూ పంజగుట్ట ఠాణా పరిధిలో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడి జైలుకెళ్లి వచ్చారు.  తర్వాత వీరు సనత్‌నగర్‌కు చెందిన ఎర్నాల ప్రభు(25), శ్రీకాకుళంకు చెందిన బోది రాజ్‌కుమార్ (20)లతో కలిసి ముఠా కట్టారు. నలుగురూ పోలీసులమని చెప్పి ఓ ఇంటిలోకి వెళ్లేవారు.  ఆ ఇంట్లో ఉన్నవారిని కత్తులతో బెదిరించి బంగారు నగలు తీసుకొనేవారు. ఈ విధంగా మియాపూర్, చందానగర్, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, కీసర, కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ల పరిధిలో పది దోపిడీలకు పాల్పడ్డారు.

రెండు ఇళ్లలో నగలతో పాటు బాధితులను బెదిరించి ఏటీఎం కార్డు తీసుకోవడంతో పాటు పిన్ నెంబర్లు తీసుకున్నారు.  ఒక కార్డు ద్వారా రూ. 60 వేలు, మరో కార్డు ద్వారా రూ. 2,800లు డ్రా చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆయా ఠాణాల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా... నిందితులు  రాజేంద్రకుమార్, రవి, ప్రభు, రాజ్‌కుమార్‌లు గురువారం చందానగర్‌లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా... దోపిడీలకు పాల్పడుతున్నట్టు ఒప్పుకున్నారు.

 అంతర్‌జిల్లా ముఠా...

 మెదక్ జిల్లా రాయవరం గ్రామానికి చెందిన దబ్బెట బాలింగం(21) నగరంలో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తూ అమీర్‌పేట్‌లో ఉంటున్నాడు. ఇతను కరీంనగర్ జమ్మికుంటకు చెందిన రాచపల్లి మహేశ్(23)తో కలిసి ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నాడు. వీరు కరీంనగర్, వరంగల్, సిద్దిపేట పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఏడు చోరీలకు పాల్పడ్డారు.  చోరీ సొత్తును జమ్మికుంటకు చెందిన గాలిపల్లి పద్మాచారి(37)కి విక్రయిస్తున్నారు. చందానగర్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న బాలింగం, మహేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా... తమ చోరీల గుట్టువిప్పారు. పోలీసులు పద్మాచారిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

రెండు ముఠాల నుంచి మొత్తం 54 తులాల బంగారు ఆభరణాలు, 15 తులాల వెండి ఆభరణాలు,4 ద్విచక్ర వాహనాలు, 8 సెల్‌ఫోన్లు, 2 కెమెరాలు, రూ. 34 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో క్రైమ్ అడిషనల్ డీసీపీ జానకీ, షర్మిలా, మాదాపూర్ ఏసీపీ రాంనర్సింహారెడ్డి, సైబరాబాద్ క్రైమ్ ఏసీపీ ఎం.వెంకటేశ్వర్లు, కూకట్‌పల్లి, మల్కాజిగిరీ సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లు సంజీవరావు, మహ్మద్‌గౌస్, చందానగర్ సీఐ వెంకటేశ్వర్లు ఉన్నారు.
 

మరిన్ని వార్తలు