సర్కారు చూపు.. సేంద్రియం వైపు

24 Jan, 2016 04:04 IST|Sakshi
సర్కారు చూపు.. సేంద్రియం వైపు

♦ పైలట్ ప్రాజెక్టుగా చేపట్టేందుకు వ్యవసాయశాఖ నిర్ణయం
♦ కాంట్రాక్టు పద్ధతిలో అప్పగించాలని నిర్ణయం
♦ ప్రతీ జిల్లాలో కొన్ని మండలాలను ఎంపిక చేసే యోచన
♦ కార్యాచరణకు త్వరలో మార్గదర్శకాలు
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంజాబ్ తర్వాత అధిక ఎరువులు, పురుగు మందులు వాడుతున్న రాష్ట్రంగా ఉండటం.. ఫలితంగా ప్రజల్లో కేన్సర్ వంటి ప్రాణాపాయ సమస్యలు పెరుగుతుండటం.. కేంద్రం కూడా సేంద్రియ సాగు వైపు వెళ్లాలని సూచిస్తున్న నేపథ్యంలో దీనిపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఇటీవల సిక్కింలో వ్యవసాయ మంత్రులు, ఆ శాఖ ముఖ్యకార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సిక్కింను సేంద్రి య వ్యవసాయ రాష్ట్రంగా ప్రకటించారు.  అందువల్ల తెలంగాణనూ సేంద్రీయం వైపు మళ్లించాలని నిర్ణయించినట్లు వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి ‘సాక్షి’కి చెప్పారు. అనుభవమున్న సంస్థకు కాంట్రాక్టు పద్ధతిలో సేంద్రియ సాగు బాధ్యతను అప్పగించే అవకాశముంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

 పైలట్ ప్రాజెక్టు: రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి సేంద్రియం వైపు రైతులను మళ్లించడం ఆషామాషీ కాదు. అందువల్ల తొలుత ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ వర్సిటీలో రెండు మూడు ఎకరాల్లో సేంద్రియ సాగు చేపడతారు. దానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తారు. ఏకకాలంలో ప్రతీ జిల్లాలో కొన్ని మండలాలను ఎంపిక చేసి కాంట్రాక్టు పద్ధతిలో సేంద్రియానికి శ్రీకారం చుట్టాలని శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. వర్సిటీ శాస్త్రవేత్తల బృందం పైలట్ ప్రాజెక్టు ప్రాంతాలను నిత్యం పర్యవేక్షించి అవసరమైన సలహాలిస్తుంది.

 రైతులకు ప్రోత్సాహకం
 పైలట్ ప్రాజెక్టును విజయవంతంగా నిర్వహించాక రాష్ట్రవ్యాప్తంగా రైతులంతా సేంద్రియ సాగు చేసేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిం చాలని వ్యవసాయ శాఖ యోచిస్తోంది. అయితే దీనికి పలు అడ్డంకులను అధిగమించాలి. ఇప్పటివరకు రసాయనాలు, పురుగు మందులతో భూమి కలుషితమైంది. వెంటనే సేంద్రీయ ఎరువులు వాడటం వల్ల వరుసగా మూడేళ్లపాటు దిగుబడులు తగ్గుతాయి. ఇది రైతుకు నష్టంగా పరిణమించనుంది. అందువల్ల ఆ నష్టాన్ని ప్రభుత్వం భరించి రైతుకు ఆ మూడేళ్లపాటు ప్రోత్సాహకాన్ని ఇచ్చే ఆలోచన కూడా చేస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అప్పుడే రైతులు ముందుకొచ్చి సేంద్రియంపై మక్కువ చూపుతారని అంటున్నారు. దాంతోపాటు సేంద్రియ ధాన్యం, కూరగాయలకు మార్కెట్ వసతి కల్పించకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ వసతికీ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.

 ఎరువుల వాడకం నిషేధిస్తే...
 సిక్కింలో మాదిరి తెలంగాణలోనూ భవిష్యత్తులో ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని నిషేధించే ఆలోచన ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అందుకోసం పటిష్టమైన కార్యాచరణ అవసరమని పార్థసారథి చెబుతున్నారు. త్వరలో మార్గదర్శకాలు రూపొందించే యోచన ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు