60’s సింగర్స్

24 Jan, 2015 23:25 IST|Sakshi
60’s సింగర్స్

‘యే... మేరా దిల్ ప్యార్ కా దివానా...’ అంటూ ప్రేమకే కాదు, పాడటానికి వయసు అడ్డు రాదని నిరూపించారా జేష్ట్య పౌరులు. హైడొరైట్, లాడ్జికీస్ సంస్థ నిర్వహించిన ‘వృద్ధుల అంత్యాక్షరి’లో పాల్గొని ‘వృద్ధాప్యమూ ఓ బాల్యద శే’నన్న షేక్స్‌పియర్ మాటలను నిజం చేశారు. ‘కలువకు చంద్రుడు ఎంతో దూరం... కమలానికి సూర్యుడు మరీదూరం, దూరమైన కొలదీ పెరుగును అనురాగం... విరహంలోనే ఉన్నది అనుబంధం’ అని యవ్వనపు తీపి గురుతులను నెమరువేసుకున్నారు.
 
వృద్ధాప్యం శరీరానికే కానీ మనసుకు కాదని రుజువు చేశారా సీనియర్ సిటిజన్స్. ఒక్కసారిగా సిక్స్‌టీస్ నుంచి సిక్స్‌టీన్స్‌లోకి వెళ్లిపోయారు. ఆణిముత్యాల్లాంటి అలనాటి తెలుగు, హిందీ మధురగీతాలను ఆలపించి ప్రొఫెషనల్ సింగర్స్‌ను తలపించారు. ఆ జేష్ట్య పౌరుల పాటల అల్లరితో మోక్ష్ బాంక్వెట్ హాల్ నర్సరీ క్లాస్‌రూమ్‌లా మారిపోయింది. తమ వయసుతోపాటు కష్టాలన్నీ మరిచి ఎంతో సంతోషంగా ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు 55 నుంచి 82ఏళ్ల యువతీయువకులు.   

హైడొరైట్ ఫౌండేషన్ గత మూడేళ్లుగా జరుపుతున్న వంద రోజుల ‘ఇండియాస్ లాంగెస్ట్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఫెస్టివల్’లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాటల పోటీలో గెలిచిన వారికి ప్రెజ్‌మనీ కూడా అందించారు. వృద్ధుల ఉత్సాహానికి 92.7 బిగ్‌ఎఫ్‌ఎం రేడియో జాకీ ‘క్రిష్’ యాంకరింగ్ తోడవ డంతో కార్యక్రమంలో మరింత జోష్ వచ్చింది.
నిఖిత నెల్లుట్ల; ఫొటోలు: జి.రాజేష్
 
చాలా హ్యాపీ...
ఎన్నో పోగ్రామ్స్ చేశాను  కానీ ఈ కార్యక్రమం నాకు ఎంతో స్పెషల్. వీళ్లు వృద్ధులేంటి. ఒక్కొక్కరు వయసు మరచిపోయి ఉత్సాహంగా అంత్యాక్షరిలో పాల్గొం టుంటే చాలా సంతోషంగా అనిపించింది. నేను పుట్టక ముందు పాటలు వింటుంటే థ్రిల్ కలిగింది.
 - క్రిష్, 92.7 ఎఫ్‌ఎం ఆర్జే
 
జడ్జిగా వ్యవహరించడం కష్టం..
ఎన్నో మంచి పాటలు పాడారు. ఒకరికి మించి ఇంకొకరు ఉత్సాహంగా అంత్యాక్షరిలో పాల్గొన్నారు. తెలుగు పాటలంటే చాలా అభిమానం. అయినా హైదరాబాద్‌లోని ట్రెండ్ ఎంతో మారింది. తెలుగు పాటల్లోనూ హిందీ పదాలు ఉపయోగిస్తున్నారు. ఈ నగరవాసులందరికీ రెండు భాషల పాటలు వస్తాయనడానికి ఈ కార్యక్రమమే నిదర్శనం.
 - ఖాన్ అలీఖాన్, నగర ఘజల్ గాయకుడు
 
2012లో ప్రారంభించాం...
దేశంలోని అన్ని నగరాల్లో ఏదో ఒక ఫెస్టివల్‌లాంటిది నిర్వహిస్తున్నారు. మరి హైదరాబాద్‌లో లేకపోవడమేంటనే ఆలోచన వచ్చి మేం ఈ హైడొరైట్ ట్రస్ట్‌ను 2012లో ప్రారంభించాం. అప్పటి నుంచి 100 రోజుల కార్యక్రమాన్ని ప్రతి ఏటా జరుపుతున్నాం. వృద్ధులు, అనాథ పిల్లలను సంతోషంగా ఉంచడానికి అంత్యాక్షరి లాంటివి నిర్వహిస్తున్నాం.
 - రామకృష్ణ, హైడొరైట్ ట్రస్టీ
 
తగ్గని ఉత్సాహం..
ఇక్కడికి రావడం ఇది రెండోసారి. నాకు 82 ఏళ్లు వచ్చాయన్న మాటే కానీ నేనెప్పుడూ టీనేజర్నే. చిన్నప్పటి నుంచి ఎప్పుడూ ఆట, పాటల్లో ఉత్సాహంగా ఉండేదాన్ని. సినిమాలు కూడా బాగా చూసేదాన్ని. అందుకే పాటలు పాడడం హాబీగా మారింది.
 - శకుంతలా సెహగల్, 82ఏళ్లు
 
మాకూ సత్తా ఉంది
నేను ఓ రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్. నాకు ఘంటసాల, పీబీ శ్రీనివాస్ పాటలంటే చాలా ఇష్టం. తెలుగు, హిందీ పాటలు పాడటం ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. వృద్ధులు శారీరకంగా బలహీనంగా ఉంటారేమో కానీ వారిలోనే ఎంతో ప్రతిభ ఉంటుంది. మాకు ఇలాంటి వేదిక దొరకడం చాలా సంతోషంగా ఉంది.       
  - గంటా రామకృష్ణ, 78ఏళ్లు
 
ఆనందం కోసమే...
గతేడాది అంత్యాక్షరీలో మొదటి బహుమతి అందుకున్నా. నేను బహదూర్‌పురా నుంచి వచ్చా. అలనాటి సినిమాలు, పాటలు అంటే ఎంతో ఆసక్తి. పద్మిని, వైజయంతి మాల, మనోజ్‌కుమార్ అంటే ఇష్టం. ఎంత వయసొచ్చినా ఆనందంగా ఉండాలని కోరుకుంటా.
  - సరోజ్ అగర్వాల్, 62ఏళ్లు

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా