దేశానికే ఆదర్శంగా నైపుణ్య శిక్షణ

16 Jul, 2017 04:26 IST|Sakshi
దేశానికే ఆదర్శంగా నైపుణ్య శిక్షణ
- తెలంగాణలో ఉపాధికి కొదవ లేదు
ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవంలో జూపల్లి
 
సాక్షి, హైదరాబాద్‌: ఉపాధి కల్పనలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దేలా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. 2022 నాటికి దేశవ్యాప్తంగా 10 కోట్ల ఉద్యోగావకాశాలు ఏర్పడనున్నాయని, వాటిని దక్కించుకునేందుకు నైపుణ్యం అవసరమన్నారు. శనివారం ఇక్కడి హైటెక్స్‌లోని నేషనల్‌ అకాడమీ ఫర్‌ కన్‌స్ట్రక్షన్‌లో ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవానికి జూపల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాధ్యం కాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న నేర్పు తెలంగాణ ప్రజల సొంతమని... అవకాశాలను అందిపుచ్చుకునే నైపుణ్యం అలవర్చుకుంటే ఉపాధికి కొదవ లేదన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప సంస్థలన్నీ తెలంగాణలో కార్యకలాపాలు సాగించేందుకు ఆసక్తి చూపుతున్నాయని జూపల్లి చెప్పారు. తెలంగాణలో ఉపాధి అవకాశాలకు ఏ మాత్రం కొదవ లేదని... కష్టపడితే ఏదైనా సాధించవచ్చన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక దీన్‌ దయాళ్‌ గ్రామీణ కౌశల్య పథకం కింద దాదాపు 18 వేల మంది యువతీ యువకులకు ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించామన్నారు. గతేడాది నైపుణ్య శిక్షణలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్రాన్ని ఈసారి మొదటి స్థానంలో నిలిపేలా శిక్షణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేశామన్నారు.

మంజూరు చేసిన దానికి అదనంగా మరో 50 వేల మందికి ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. అలాగే ప్రతి జిల్లాలోనూ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఉపాధి అవకాశాలు దక్కించుకున్న వెయ్యి మంది యువతీ యువకుల విజయగాథలతో రూపొందించిన పుస్తకాన్ని జూపల్లి ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. అనంతరం శిక్షణ కేంద్రాల నిర్వాహకులు, ఉపాధి కల్పించిన సంస్థల ప్రతినిధులకు మెమెంటోలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎంప్లాయ్‌మెంట్‌ జనరేషన్‌ అండ్‌ మార్కెటింగ్‌ మిషన్‌ సీఈవో నీతూ ప్రసాద్‌ పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు