Sakshi News home page

ఎన్నికలకు పర్యవేక్షణ

Published Sun, Jul 16 2017 4:16 AM

ఎన్నికలకు పర్యవేక్షణ

రేపు రాష్ట్రపతి ఎన్నికలు 
రంగంలోకి  అధికారులు
అసెంబ్లీ, సచివాలయంలో నిఘా కట్టుదిట్టం

సాక్షి, చెన్నై : రాష్ట్రపతి ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనకు ఢిల్లీ నుంచి అధికారులు చెన్నైలో అడుగుపెట్టారు. ఆదివారం తుది పర్యవేక్షణానంతరం సోమవారం ఎన్నికలు సాగనున్నాయి. బ్యాలెట్‌ బాక్స్, ఓటింగ్‌ స్లిప్స్, బ్యాలెట్‌ పేపర్‌ తదితర సామగ్రి చెన్నైకి చేరాయి.

సచివాలయం, అసెంబ్లీ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పదవీ కాలం ముగియనుండంతో ఆ స్థానం భర్తీ నిమిత్తం  ఈనెల 17వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అధికారపక్షం అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్,  ప్రతిపక్షాల అభ్యర్థిగా మీరా కుమార్‌ ఆ పదవి కోసం పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, జయలలిత మరణంతో ఓ స్థానం ఖాళీగా ఉంది. మిగిలిన వాటిలో 98 మంది ఎమ్మెల్యేల(డీఎంకే –89, కాంగ్రెస్‌–8, ఐయూఎంఎల్‌–1) ఓట్లు మీరాకుమార్‌ ఖాతాలోకి చేరనున్నాయి.

అన్నాడీఎంకే ముక్కలైనా, అమ్మ, పురట్చి తలైవి శిబిరాల మెజారిటీ శాతం ఎమ్మెల్యేల మద్దతు ఓట్లు కోవింద్‌కు దక్కనున్నాయి. ప్రస్తుతం అన్నాడీఎంకే ఖాతాలో ఉన్న 135 (అమ్మశిబిరం–123, పురట్చి తలైవి 12)లో ముగ్గురు ఇతర పార్టీలకు చెందిన వారు కావడం గమనార్హం. అమ్మ శిబిరంలో ఉన్న ఈ ముగ్గురిలో ఇద్దరి ఓటు ఎటో అన్నది తేలాల్సి ఉంది. అలాగే, అమ్మ శిబిరంలో ఉన్న ఇతర ఎమ్మెల్యేలు ఎవరైనా హ్యాండిచ్చేనా అన్న ఉత్కంఠ తప్పడం లేదు.  ఇక,  డీఎంకే, సీపీఎం, సీపీఐ ఎంపీల ఓట్లు సైతం మీరాకుమార్‌ ఖాతాలో పడడం ఖాయం. అయితే, పీఎంకే ఒక ఎంపీ సీటు ఉన్న దృష్ట్యా, ఆ ఓటు ఎవరికో అనేది తేలాల్సి ఉంది. అన్నాడీఎంకే వద్ద ఉన్న 50 మంది ఎంపీల ఓట్లు  కోవింద్‌కు పడడం ఖాయం.

భద్రత కట్టుదిట్టం
బలా బలాలు ఎలా ఉన్నా, ఎన్నికల నిర్వహణ తప్పని దృష్ట్యా, సోమవారం ఎన్నికల నిమిత్తం సచివాలయం, అసెంబ్లీ ఆవరణలో ప్రత్యేక ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఆవరణలోని సమావేశ మందిరంలో  ఏర్పాట్లు చేసి ఉన్నారు.  కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యదర్శి(ఇన్‌) భూపతి ఎన్నికల అధికారిగా, సంయుక్త కార్యదర్శి సుబ్రమణియన్‌ సహాయ అధికారిగా ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు.

ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎన్నికలు సాగనుండడంతో,  అసెంబ్లీ పరిసరాల్లో గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ నుంచి బ్యాలెట్‌ బాక్స్‌లు, పేపర్లు చెన్నైకి చేరడంతో వాటిని స్ట్రాంగ్‌ రూముల్లో భద్రపరిచారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్‌ లఖాని ఏర్పాట్లను శనివారం పర్యవేక్షించారు. భూపతి, సుబ్రమణియన్‌లతో భేటీ అయ్యారు. ఈసందర్భంగా మీడియాతో లఖాని మాట్లాడుతూ, బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా, కట్టుదిట్టమైన ఆంక్షలు విధించి ఉన్నామన్నారు.

ఓటింగ్‌ హాల్‌లో  ఫొటోలు, వీడియో చిత్రీకరణకు అనుమతి లేదని స్పష్టంచేశారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు తగ్గ పెన్‌ను కూడా ఎన్నికల అధికారులే సభ్యులకు అందిస్తారని పేర్కొన్నారు.  బ్యాలెట్‌ పేపర్‌లో చిన్న తప్పు దొర్లినా అది చెల్లని ఓటుగా మారుతుందనే విషయాన్ని సభ్యులు గుర్తుంచుకోవాలని సూచించారు. ఇక, ఎన్నికల పర్యవేక్షణ నిమిత్తం ఢిల్లీ నుంచి ప్రత్యేక ఐఏఎస్‌ అ«ధికారిగా అన్సు ప్రకాష్‌ నేతృత్వంలోని బృందం రాత్రి చెన్నైకి చేరుకుంది. ఎన్నికల తుది ఏర్పాట్లపై ఆదివారం ఈ బృందం సమావేశం కానుంది.

Advertisement
Advertisement