ఇక ‘స్మార్ట్’గా ప్రయాణం

12 Dec, 2015 06:00 IST|Sakshi
ఇక ‘స్మార్ట్’గా ప్రయాణం

- సిటీ బస్సుల్లో స్మార్టకార్డులు
- ప్రయోగాత్మకంగా రెండు ప్రధాన రూట్‌లలో అమలు
- ప్రయోగం విజయవంతమైతే అన్ని రూట్‌లలో విస్తరణ

సాక్షి,సిటీబ్యూరో: జేబులో డబ్బులు లేవా. ఏటీఎం కార్డు కూడా వెంట తెచ్చుకోవడం మరిచిపోయి బస్సెక్కేశారా...మరేం ఫర్లేదు. స్మార్ట్‌కార్డు ఉంటే చాలు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా నిశ్చింతంగా పయనించవచ్చు. ఈ తరహా సదుపాయాన్ని  త్వరలో నగరంలో  ప్రయోగాత్మకంగా  అమల్లోకి తెచ్చేందుకు ఆర్టీసీ సన్నాహాలు  చేపట్టింది. ఒకటి, రెండు ప్రధాన  రూట్లలో ఈ  ప్రాజెక్టు అమలు తీరును పరిశీలించిన తరువాత  ఫలితాలను బట్టి మిగతా రూట్‌లకు  విస్తరిస్తారు.  సిటీ బస్సుల్లో  టిక్కెట్ లెస్, క్యాష్‌లెస్ ప్రయాణ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు నెల రోజుల క్రితం ఆర్టీసీ  స్మార్ట్‌కార్డుల  కోసం  ప్రణాళికలను రూపొందించిన సంగతి  పాఠకులకు తెలిసిందే.

 
ఈ  ప్రాజెక్టుపై తాజాగా మరో అడుగు ముందుకు పడింది. ఈ  ప్రాజెక్టును  అమలు చేసేందుకు ముందుకు వచ్చిన బాష్ కంపెనీ  స్మార్ట్‌కార్డుల పనితీరు, వాటిని ఉపయోగించే విధానంపై ఇటీవల బస్‌భవన్‌లో ఆర్టీసీ  అధికారులకు  నమూనా  ప్రదర్శన నిర్వహించింది. ఈ ప్రదర్శనలో పాల్గొన్న ఆర్టీసీ ఉన్నతాధికారులు  సంతృప్తిని వ్యక్తం చేశారు. త్వరలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేపట్టారు. మొదట  దిల్‌సుఖ్‌నగర్-పటాన్‌చెరు, సికింద్రాబాద్-కొండాపూర్, ఉప్పల్-హైటెక్‌సిటీ, సికింద్రాబాద్-శంషాబాద్  వంటి  ఎక్కువ దూరం ఉన్న రూట్‌లలో  రెండింటిని ఎంపిక చేసి  మెట్రో లగ్జరీ, పుష్పక్ బస్సుల్లో  ప్రవేశపెడతారు. ఆ తరువాత వాటి పనితీరు, ప్రయాణికులు  స్మార్ట్‌కార్డులు వినియోగించే తీరును గమనంలోకి తీసుకొని  ప్రాజెక్టు అమలుకు  చర్యలు  తీసుకుంటారు.

ప్రీపెయిడ్ తరహాలో....

  • ప్రస్తుతం ముంబయిలో కేవలం బస్‌పాస్‌లకే పరిమితమైన స్మార్ట్‌కార్డులను  హైదరాబాద్‌లో  బస్‌పాస్‌లతో పాటు, రోజువారి టిక్కెట్‌లకు కూడా వర్తింప చేస్తారు.
  • ఈ స్మార్ట్‌కార్డులు  ప్రీపెయిడ్ తరహాలో  ఉపయోగపడుతాయి. ప్రస్తుతం రైల్వేలో  ఏటీవీఎంల ద్వారా  ఇలాంటి ప్రీపెయిడ్ కార్డులను విక్రయిస్తున్నారు. ప్రయాణికులు తమ రోజువారి ప్రయాణాన్ని, అందుకయ్యే ఖర్చును  దృష్టిలో  ఉంచుకొని రూ.50,రూ.100 నుంచి రూ.500,  రూ.1000 వరకు  తమ అవసరాన్ని బట్టి స్మార్ట్‌కార్డులను కొనుగోలు చేయవచ్చు.
  • నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి హైటెక్‌సిటీ, మాధాపూర్, గచ్చిబౌలీ, తదితర ప్రాంతాల్లోని  ఐటీ కారిడార్‌లకు రాకపోకలు సాగించే  సాఫ్ట్‌వేర్ నిపుణులు, ఉద్యోగులకు స్మార్ట్‌కార్డులు  ఎంతో ప్రయోజనకరంగా  ఉంటాయి.
  • అలాగే నగరానికి వచ్చే పర్యాటకులు, సందర్శకులకు ఈ స్మార్ట్‌కార్డులు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఒక్కసారి కార్డు కొనుగోలు చేసి నగరమంతా పర్యటించేందుకు  అవకాశం ఉంటుంది.

 
టిమ్స్‌తో అనుసంధానం...

  • రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్‌ఎఫ్‌ఐడీ) సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే  స్మార్ట్‌కార్డులలో మైక్రో  చిప్‌లు ఏర్పాటు చేస్తారు. ఆ కార్డు విలువ అందులో నమోదై ఉంటుంది. కండక్టర్‌ల వద్ద ఉండే  టిక్కెట్ ఇష్యూయింగ్ (టిమ్స్) మిషన్‌లకు స్మార్ట్‌కార్డులను కూడా స్వీకరించే మరో ఆప్షన్‌ను ఇస్తారు.
  • ప్రయాణికులు తాము పయనించిన దూరానికి చెల్లించవలసిన చార్జీలు  స్మార్ట్‌కార్డు నుంచి నేరుగా ఆర్టీసీ ఖాతాలో జమ అయ్యే విధంగా ఈ టిమ్స్ యంత్రాలను అనుసంధానం చేస్తారు.
  • బస్‌పాస్ కౌంటర్‌లతో పాటు, కండక్టర్‌ల వద్ద కూడా స్మార్ట్‌కార్డులు లభిస్తాయి.స్మార్ట్‌కార్డులు వద్దనుకున్నవాళ్లు  సాధారణ టిక్కెట్‌లపైన ప్రయాణం చేయవచ్చు.స్మార్ట్‌కార్డులు అందుబాటులోకి వస్తే  క్షణాల్లో  డబ్బులు చెల్లించి కార్డులు కొనుగోలు చేయవచ్చు.
  • ఉదయం ఆఫీసులకు వెళ్లి సాయంత్రం ఇళ్లకు చేరుకొనే ఉద్యోగులకు, చిరువ్యాపారులకు, విద్యార్ధులకు  ఈ  స్మార్ట్‌కార్డుల  వల్ల  ప్రయోజనం కలుగుతుంది.

 
 
 

మరిన్ని వార్తలు