సీఎం చేతిలో రూ.5,500 కోట్లు!?

31 Jan, 2016 20:37 IST|Sakshi
సీఎం చేతిలో రూ.5,500 కోట్లు!?

- వచ్చే బడ్జెట్‌లో భారీగా స్పెషల్ డెవెలప్‌మెంట్ ఫండ్
- కలెక్టర్లకు, మంత్రులకు సైతం ప్రత్యేక నిధి
- ఇప్పటికే అధికారులకు సూచించిన ముఖ్యమంత్రి కేసీఆర్

సాక్షి, హైదరాబాద్:
వచ్చే ఏడాది తెలంగాణ బడ్జెట్‌లో రూ.5500 కోట్లు ప్రత్యేక అభివృద్ధి నిధికి(ఎస్‌డీఎఫ్) కేటాయించే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రి తన విచక్షణాధికారం మేరకు వీటిని ఖర్చు చేసే వీలుంటుంది. ఇంత భారీ మొత్తంలో ఎస్‌డీఎఫ్‌కు నిధులు కేటాయించనుండటం మొదటిసారి కావటం ప్రాధాన్యంగా కనిపిస్తోంది. ఇదే నిధి నుంచి జిల్లా కలెక్టర్లకు రూ.10 కోట్లు, మంత్రులకు రూ.25 కోట్ల చొప్పున విడుదల చేస్తారు. వీటిని ప్రత్యేక అవసరాలు, అభివృద్ధి పనులు, కార్యక్రమాలు, ఆపన్నులకు చేయాతను అందించేందుకు వినియోగిస్తారు.

గత ఏడాది అన్ని జిల్లాల కలెక్టర్లతో హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సులో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక నిధి విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. దళితులకు వ్యవసాయానికి అవసరమయ్యే పెట్టుబడి విడుదల చేయటంతో పాటు, వివిధ సందర్భాల్లో ఎస్సీ ఎస్టీ బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రతి కలెక్టర్ వద్ద రూ.కోటి నిధి అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు. వెంటనే ఒక్కో జిల్లాకు కోటి రూపాయల చొప్పున విడుదల చేశారు. ఈసారి బడ్జెట్‌లోనూ ఈ పంథాను కొనసాగించాలని సీఎం నిర్ణయించారు. కలెక్టర్లతో పాటు మంత్రులకు సైతం ప్రత్యేక నిధి కేటాయించే ప్రతిపాదనలున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్లినప్పుడు తమకు వచ్చే విజ్ఞప్తులు, చిన్న చిన్న పనులను అక్కడికక్కడే పరిష్కరించేందుకు వీలుగా ఈ నిధి ఉపయోగిపడుతుందని భావిస్తున్నారు. అందుకే ఈ పద్దును భారీ మొత్తంలో కేటాయించాలని సీఎం ఇప్పటికే అధికారులకు సూచించినట్లు తెలిసింది.

జిల్లా కలెక్టర్లు, మంత్రులకు కేటాయించేందుకు రూ.500 కోట్లు వెచ్చించటంతో పాటు మిగతా రూ.5000 కోట్లను ముఖ్యమంత్రి తన వద్ద ఉంచుకొని, వివిధ నియోజకవర్గాల్లో తను ఇచ్చిన హామీలు, విచక్షణ మేరకు తీసుకునే నిర్ణయాలతో చేపట్టే పనులకు ఖర్చు చేస్తారు. ఇప్పటికే వివిధ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, అదనపు ఇళ్ల మంజూరు తదితర అంశాలకు సీఎం ప్రత్యేక నిధి నుంచి నిధులు కేటాయించే అవకాశాలున్నాయి.

మరిన్ని వార్తలు