'ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేయాల్సిందే'

21 Jun, 2016 15:07 IST|Sakshi

హైదరాబాద్  : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను అమలు చేయాల్సిందే అని  విశ్రాంత న్యాయమూర్తి, జన చైతన్య వేదిక కన్వీనర్ జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి.. కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యేక ప్యాకేజీతో ఎలాంటి ఉపయోగం ఉండదని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్లోని ప్రెస్ క్లబ్లో ఏపీకి ప్రత్యేక హోదా కోసం జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో రూపొందించిన వెబ్సైట్ (http://www.apspecialstatus.in)ను ఆయన ప్రారంభించారు. ప్రత్యేక హోదాతోనే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని, అందుకు ఉద్యమించడమే మార్గమన్నారు. ఉద్యమం ద్వారానే ప్రత్యేకహోదా సాధ్యమవుతుందని దీనికి యువత ముందు వరుసలో నిలవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ పాత్రికేయుడు తెలకపల్లి రవి మాట్లాడుతూ... పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వాలు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని రాజకీయ ప్రముఖ విశ్లేషకులు లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రత్యేక హోదా కేంద్రం భిక్ష కాదు.. ఏపీ ప్రజల హక్కు అని లక్ష్మీ నారాయణ స్పష్టం చేశారు.     
 

మరిన్ని వార్తలు