-

మద్యం అమ్మకాల్లో రాష్ట్రం నంబర్ వన్

16 Oct, 2016 01:32 IST|Sakshi
మద్యం అమ్మకాల్లో రాష్ట్రం నంబర్ వన్

మహిళా ఉద్యమ పోస్టర్ ఆవిష్కరణలో ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ పాలనలో మద్యం అమ్మకాల్లో మాత్రమే రాష్ట్రం నంబర్‌వన్‌గా మారిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. మహిళా సమస్యలపై ఏడాదిపాటు జరిగే ఉద్యమానికి సంబంధించిన పోస్టర్‌ను గాంధీభవన్‌లో ఉత్తమ్, టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు నేరెళ్ల శారద శనివారం ఆవిష్కరించారు. ఉత్తమ్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ మహిళలను అవమానిస్తున్నారన్నారు. రాష్ట్రం ఏర్పాటై రెండున్నరేళ్లు పూర్తికావస్తున్నా రాష్ట్ర మంత్రివర్గంలో మహిళలకు అవకాశం దక్కలేదన్నారు.

మద్యం అమ్మకాల్లో మాత్రమే దేశంలోనే అగ్రగామిగా రాష్ట్రం నిలిచిపోయిందన్నారు. శారద మాట్లాడుతూ... మహిళలకు మంత్రివర్గంలో చోటు లేకపోవడం, నానాటికీ పెరుగుతున్న అత్యాచారాలు, డ్వాక్రా రుణాలు అందకపోవడం, బెల్టు షాపులతో మహిళా సాధికారతకు వ్యతిరేకంగా ప్రభుత్వం పాలన సాగిస్తోందని.. దీనికి నిరసనగా ఏడాదిపాటు పోరాటం చేస్తామని అన్నారు. ‘మహిళా మేలుకో-రాష్ట్రాన్ని ఏలుకో’ నినాదంతో ధర్నాలు, చర్చలు, నిరసనలు నిర్వహిస్తామన్నారు. టీపీసీసీ మహిళా విభాగం నేతలు పద్మాగౌడ్, స్వప్న పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు