సాగర్‌లో.. తథాగత చరిత్ర..

22 Jan, 2016 01:42 IST|Sakshi
సాగర్‌లో.. తథాగత చరిత్ర..

► 1984లో విగ్రహ ఏర్పాటుకు  నాంది
► రెండేళ్ల తర్వాతజిబ్రాల్టర్ రాక్‌పైకి..
►1990లో హుస్సేన్ సాగర్‌లో  మునక

 
సిటీబ్యూరో:  హైదరాబాద్ అనగానే చార్మినార్ తర్వాత గుర్తొచ్చేది హుస్సేన్‌సాగర్.. అందులోని బుద్ధ విగ్రహం. ఈ గౌతముడు ఇక్కడ నిలవడానికి ముందు పెద్ద చరిత్రే జరిగింది. అమెరికాలో పుట్టిన ఆలోచనకు రాయ్‌గిరి కొండల్లో రూపునిచ్చారు. ‘రెండేళ్ల జలవాసం’ అనంతరం సాగర్‌లోని జిబ్రాల్టర్ రాక్ పైకి చేరింది. ఈ క్రమంలో 10 మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు.
     
‘లిబర్టీ’ ఇచ్చిన స్ఫూర్తి..

ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన నందమూరి తారక రామారావు 1984లో అమెరికా పర్యటనకు వెళ్లారు. న్యూయార్క్ నగరంలో ఉన్న ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ని చూసి స్ఫూర్తి పొందిన ఆయన అలాంటి ఓ విగ్రహం హైదరాబాద్‌లోనూ ఉండాలని భావించారు. సుదీర్ఘ ఆలోచనల తరవాత సిటీలో ఏర్పాటు చేసే విగ్రహం గౌతమ బుద్ధుడిదే కావాలని, దాన్ని హుస్సేన్‌సాగర్ మధ్యలో ఉన్న జిబ్రాల్టర్ రాక్‌పై నిలబెట్టాలని నిర్ణయించారు. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ సైతం న్యూయార్క్ హార్బర్‌లో ఉండడంతో సాగర్ మధ్యలో ఏర్పాటుకే మొగ్గు చూపారు.
   
గణపతి స్థపతి నేతృత్వంలో రూపు
హుస్సేన్‌సాగర్‌లో నిల్చునే మహా బుద్ధ విగ్రహం ఏకశిలతో మలచినదై ఉండాలన్న ఉద్దేశంలో అనేక ప్రాంతాల్లోని రాతి కొండలను సర్వే చేశారు. ఎట్టకేలకు హైదరాబాద్‌కు దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో నల్లగొండ జిల్లా రాయ్‌గిరిలో ఉన్న కొండల్లో ఆ రాయిని గుర్తించారు. విగ్రహాన్ని తీర్చిదిద్దే పనిని శిల్పి ఎస్‌ఎం గణపతి స్థపతికి అప్పగించారు. 1985 అక్టోబర్‌లో విగ్రహం చెక్కే పని ప్రారంభించారు. వందల మంది కార్మికులు చాలాకాలం శ్రమించి 58 అడుగులు భారీ బుద్ధుడికి తుది రూపాన్నిచ్చారు. ఇందుకోసం దాదాపు రూ.కోటికి పైగా ఖర్చయిందని అంచనా.
   
తరలింపు పెద్ద సవాలు..
భారీస్థాయిలో ఉన్న తధాగతుడి భారీ విగ్రహాన్ని రాయ్‌గిరి నుంచి హుస్సేన్‌సాగర్ వరకు చేర్చడం, జిబ్రాల్టర్ రాక్‌పై నిలబెట్టడం పెద్ద సవాలు. ఇందుకోసం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. ఊర్మిళ అండ్ కంపెనీ కంటే కేవలం రూ.20 వేల తక్కువకు టెండర్ వేసి అసోం బెంగాల్ కారియర్స్ లిమిటెడ్ (ఏబీసీఎల్) సంస్థ ఈ కాంట్రాక్టు దక్కించుకుంది. విగ్రహం రవాణా కోసం 192 చక్రాలతో కూడిన భారీ వాహనాన్ని రంగంలోకి దింపారు. బుద్ధుడి రాక నేపథ్యంలో వాహనానికి అవాంతరాలు లేకుండా ఉండేందుకు హైదరాబాద్‌లోని అనేక రోడ్లను విస్తరించారు. ఎట్టకేలకు విగ్రహం 1990 ఫిబ్రవరిలో హుస్సేన్‌సాగర్ తీరానికి చేరింది.
    
సాగర్‌లోకి దిగగానే ప్రమాదం
హుస్సేన్‌సాగర్ ఎన్టీఆర్ ఘాట్ వైపు నుంచి విగ్రహాన్ని జిబ్రాల్టర్ రాక్ వద్దకు తీసుకువెళ్లడానికి ఏబీసీఎల్ భారీ జెట్టీ వంటి రవాణా సాధనాన్ని ఏర్పాటు చేసింది.  1990 మార్చి 10న సాగర్ తీరం నుంచి బుద్ధుడితో బయలుదేరిన జెట్టీ నీటిలో 91 మీటర్లు ప్రయాణించి మునిగిపోయింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ మృతదేహం ఆచూకీ సైతం లభించలేదు. తీరం నుంచి సాగర్‌లోకి కిలోమీటరు పరిధిలో మార్గాన్ని నిర్మించి, విగ్రహాన్ని తీసుకెళ్లాల్సి ఉంటుందంటూ టెండర్ దాఖలు చేసిన ఊర్మిళ అండ్ కంపెనీ సంస్థ ఎందుకు చెప్పిందో అప్పుడు అర్థమైంది.
    
రెండేళ్ల అనంతరం..
సుమారు 40 అడుగుల లోతులో ఉండిపోయిన విగ్రహాన్ని 1992 ఏప్రిల్‌లో సాగర్ నుంచి బయటకు తీయగలిగారు. నిర్ణీత ప్రాంతంలో నిలబెట్టడం, ఇతర పనులు పూర్తయిన తరవాత అదే ఏడాది డిసెంబర్ 1న జిబ్రాల్టర్ రాక్‌పై 4.6 మీటర్ల ఎత్తులో నిర్మించిన ప్లాట్‌ఫామ్ మీద బుద్ధ విగ్రహం ఆవిష్కృతమైంది. నిత్యం ఎంతో మందిని ఆకర్షిస్తున్న ఈ బుద్ధుడిని 2006 దలైలామా సైతం సందర్శించారు. 58 అడుగుల ఎత్తు, 350 టన్నుల బరువున్న ఈ విగ్రహం చెక్కడం, రవాణా ఇతర అన్నీ కలిపి రూ. 5.58 కోట్లు ఖర్చయ్యాయి.
 

మరిన్ని వార్తలు