ఏడాదిలో శిశు మరణాల రేటును 20కి తగ్గిస్తాం

22 Jan, 2016 01:41 IST|Sakshi
ఏడాదిలో శిశు మరణాల రేటును 20కి తగ్గిస్తాం

సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది నాటికి రాష్ట్రంలో శిశు మరణాల రేటును 20కి తగ్గిస్తామని నిజామాబాద్ ఎంపీ కవిత చెప్పారు. ఏడాది క్రితం వెయ్యి శిశువుల్లో 39 మంది మరణించేవారనీ ఈ ఏడాది ఆ సంఖ్యను 28కి తగ్గించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. పిల్లల వైద్య సంరక్షణే లక్ష్యంగా 15వ ఆసియా-పసిఫిక్ పీడియాట్రిక్ అసోసియేషన్, 53వ పెడికాన్-2016, 5వ ఆసియా పసిఫిక్ పీడియాట్రిక్ నర్సింగ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో సదస్సు గురువారమిక్కడ హైటెక్స్‌లో ప్రారంభమైంది. 8 వేల మంది దేశ విదేశీ పిల్లల వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు, యునిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు.

ప్రారంభ కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ, శిశు మరణాలను తగ్గించడంలో మన దేశం విఫలమైందన్నారు. పిల్లల ఆరోగ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని, పుట్టుకతోనే నవజాత శిశువుల్లో వచ్చే లోపాలను గుర్తించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు. దీనివల్ల మొదట్లోనే లోపాలను గుర్తించి పిల్లలకు తక్షణమే వైద్యం చేయించే వెసులుబాటు కలిగిందన్నారు. ‘ఇద్దరు పిల్లల తల్లిగా పిల్లల సంరక్షణ ఎంత కష్టమైందో నాకు తెలుసు. అలాంటిది పీడియాట్రిక్ వైద్యులు పిల్లల సంరక్షణ కోసం ఎంత కష్టపడతారో ఊహించవచ్చు’ అని పేర్కొన్నారు.

మహిళలు ముందుకొస్తే సమాజంలో పెద్దఎత్తున మార్పు వస్తుందన్నారు. ఒక ఎంపీగా తాను సాధికారత సాధించిన మహిళనని ప్రకటించారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ, మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో రెండు విడతలుగా నిర్వహించామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు 938 రోగాలకు ఉచిత చికిత్స అందిస్తున్నామన్నారు. హైదరాబాద్ మెడికల్ హబ్‌గా వెలుగొందుతుందన్నారు. గుండె, కాలేయ, మూత్రపిండాల మార్పిడి వంటివి చేస్తున్నారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాదిని నవజాత శిశు సంవత్సరంగా ప్రకటించిందని గుర్తుచేశారు. కాగా, ఇండియా అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఏపీ) అధ్యక్షుడిగా ప్రమోద్‌జోగ్ ఎన్నికయ్యారు. ఐఏపీ మహిళా విభాగాన్నీ ఏర్పాటు చేయగా, దీనికి కన్వీనర్‌గా ‘నిలోఫర్’ ప్రొఫెసర్ హిమబిందు ఎన్నికయ్యారు. మహిళావి భాగం లోగోను కవిత ఆవిష్కరించారు. ఆసియా పసిఫిక్ పీడియాట్రిక్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జుల్కిఫ్లీ ఇస్మాయిల్, సెక్రటరీ జనరల్ బకుల్ జయంత్ పరేఖ్, డాక్టర్ రమేష్ ధంఫురి, డాక్టర్ మంచుకొండ రంగయ్య, ఎస్‌ఎస్ కామత్, డాక్టర్ లాలూప్రసాద్, డాక్టర్ షబ్బీర్ హాజరయ్యారు.
 
ఘనంగా ప్రారంభమైన సదస్సు
పెడికాన్-2106 సదస్సు హైటెక్స్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఆదివారం వరకు జరిగే ఈ సదస్సులో పిల్లలకు సంబంధించి ఆరోగ్య సమస్యలపై సమగ్రంగా చర్చించనున్నారు. ప్రత్యేకంగా 22 దేశాల నుంచి 100 మంది పిల్లల వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు ప్రసంగించనున్నారు. శిశు మరణాల తగ్గింపు, భ్రూణ హత్య ల నిరోధానికి ముఖ్యమైన కార్యాచరణ ప్రణాళికను పెడికాన్ సదస్సు ప్రకటించనుంది.

మరిన్ని వార్తలు