మారణహోమం

1 May, 2016 08:01 IST|Sakshi
మారణహోమం

రాష్ట్రంలో వడగాడ్పుల తీవ్రతకు 585 మంది బలి
 
రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ల నివేదిక
పలు జిల్లాల్లో పరిస్థితి భయానకం
ఇక ముందు మరింత ఆందోళనకరం: వాతావరణ నిపుణులు
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో 45 నుంచి 50 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం
మరింతగా పెరగనున్న వడగాడ్పుల తీవ్రత
వడదెబ్బ మరణాలను తక్కువగా చూపుతున్న త్రిసభ్య కమిటీలు
ఉపశమన చర్యల్లో సర్కారు విఫలమైందనే విమర్శలు

 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండల తీవ్రతకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ ఎండాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఏకంగా 585 మంది వడదెబ్బకు బలయ్యారు. అందులో ఒక్క నల్లగొండ జిల్లాలోనే 332 మంది మృతి చెందినట్లు కలెక్టర్లు సర్కారుకు పంపిన నివేదికలు వెల్లడిస్తున్నాయి. గతేడాది మొత్తం ఎండాకాలంలో వడదెబ్బ బారినపడి 541 మంది మరణించగా... ఈసారి ఏప్రిల్‌లోనే అంతకుమించి మృత్యువాతపడడం ఆందోళన కలిగిస్తోంది. మరో 45 రోజులపాటు ఎండలు, వడగాడ్పుల తీవ్రత ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరిక మరింతగా భయం గొలుపుతోంది.  

రాష్ట్రంలో ఎండలు, వడదెబ్బ మృతులపై జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందజేశారు. దాని ప్రకారం ఈ ఎండాకాలం ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో ఏకంగా 585 మంది వడదెబ్బకు బలయ్యారు. అందులో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 332 మంది, మహబూబ్‌నగర్ జిల్లాలో 97 మంది, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో 38 మంది చొప్పున మరణించారు. జూన్ 15వ తేదీ వరకు కూడా తీవ్రమైన ఎండలు, వడగాడ్పులు ఉంటాయని వాతావరణశాఖ చెబుతున్న నేపథ్యంలో... వడదెబ్బ మృతుల సంఖ్య రెండు వేలకు పైగానే నమోదయ్యే అవకాశముందని  రెవెన్యూశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
సాయం అందేనా..?
కలెక్టర్ల ప్రాథమిక లెక్కల ఆధారంగా జిల్లాల్లోని త్రిసభ్య కమిటీలు 366 మంది మృతుల వివరాలపై విచారణ చేపట్టాయి. ఇందులో 173 మరణాలు వడదెబ్బ కారణంగా సంభవించాయని... వీరిలోనూ 85 మందికి ఆపద్బంధు పథకం కింద ఆర్థిక సాయం అందుతుందని నిర్ధారించాయి. అయితే ఇప్పటివరకు ఏ బాధిత కుటుంబానికి కూడా ఆపద్బంధు పథకం కింద సాయం విడుదల చేయలేదు. మరోవైపు వడదెబ్బతో చనిపోయిన వారి సంఖ్యను త్రిసభ్య కమిటీలు తక్కువ చేసి చూపిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి.

కలెక్టర్లు నిర్ధారించాక అందుకు విరుద్ధంగా త్రిసభ్య కమిటీలు తక్కువగా చూపడంలో ఆంతర్యమేమిటో అర్థంకావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వడదెబ్బతో చనిపోయిన వారిని పోస్టుమార్టం చేయడం లేదు. మృతదేహాలను దహనం చేయడమో, పూడ్చేయడమో చేశాక... ఏ కొలమానం ప్రకారం త్రిసభ్య కమిటీలు అంచనాలు వేస్తున్నాయో అంతు పట్టడం లేదని రెవెన్యూ అధికారులే విస్తుపోతున్నారు.

మేలో భీతావహమే!
ఏప్రిల్‌లో అనేకచోట్ల 40 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే రాష్ట్రంలో కనీసం రెండు చోట్ల 45 డిగ్రీలు ఆపైన ఉష్ణోగ్రతలుంటే వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్‌ను, అనేకచోట్ల 45 డిగ్రీలు దాటితే రెడ్ అలర్ట్‌ను ప్రకటిస్తుంది. సాధారణ ఎండలైతే ఎల్లో అలర్ట్ ప్రకటిస్తారు. ఏప్రిల్‌లో ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించారు. ప్రస్తుతం ఎండ తీవ్రత ఉన్నా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు లోపే ఉండటంతో ఎల్లో అలర్ట్ ఉంది. అయితే మే నెల మొదటి వారంలో మరోసారి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించే అవకాశముందని... రెండో వారం తర్వాత రెడ్ అలర్ట్ జారీ చేయాల్సి రావచ్చని హైదరాబాద్ వాతావరణశాఖ చెబుతోంది. ప్రస్తుత ఎండలకే జనం పిట్టల్లా రాలుతుంటే... రెడ్ అలెర్ట్ ప్రకటించినప్పటి పరిస్థితి మరింత భయానకంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
మరింతగా వడగాడ్పులు
మే మొదటి వారం నుంచి జూన్ 15వ తేదీ వరకు వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దాంతో వడదెబ్బ మరణాలు మరింత పెరగొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని... ఇక ముందు రాష్ట్రవ్యాప్తంగా 45 నుంచి 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెబుతున్నారు. మరోవైపు ఎండల తీవ్రతపై సర్కారుకు ఎప్పటికప్పుడు నివేదికలు అందుతున్నా... తగిన చర్యలు తీసుకోవడంలో వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్న ఆరోపణలున్నాయి. ఎండతీవ్రత నుంచి ప్రజలను కాపాడేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది.

వడగాడ్పులుంటే ఆర్టీసీ బస్సులను మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య నడపకూడదు. ఆరు బయట శారీరక శ్రమ చేసే వారికి తగు నీడ కల్పించాలి. ఫ్యాక్టరీల్లో ఏసీ వసతి కల్పించాలి. అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసి తాగునీరు, వైద్య వసతి, నీడ కల్పించడం వంటి చర్యలు చేపట్టాలి. వడదెబ్బకు గురైన వారికోసం ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా వార్డులను ఏర్పాటు చేయాలి. చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ కార్యాలయాలు, గుడులు ఇతర అన్నిచోట్లా నీడ వసతి కల్పించాలి. కానీ ఇవేవీ పూర్తిస్థాయిలో అమలుకావడంలేదన్న విమర్శలున్నాయి.

వడదెబ్బతో 60 మంది మృతి
సాక్షి, నెట్‌వర్క్: రాష్ట్రంలో మండుతున్న ఎండలు, వడదెబ్బకు తాళలేక శనివారం 60 మృతి చెందారు. నల్లగొండ జిల్లాలో 13 మంది, ఖమ్మం జిల్లాలో 11 మంది, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో 10 మంది చొప్పున, వరంగల్ జిల్లాలో ఆరుగురు, మెదక్ జిల్లాలో ఐదుగురు, నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు, ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు వడదెబ్బతో మరణించారు.

మరిన్ని వార్తలు