తాగునీటి సమస్య పరిష్కారంలో విఫలం

13 Apr, 2016 04:02 IST|Sakshi
తాగునీటి సమస్య పరిష్కారంలో విఫలం

ప్రభుత్వానికి వ్యతిరేకంగా జలమండలి కార్యాలయం వద్ద టీ టీడీపీ ధర్నా
 
 హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తాగునీటి సమస్య పరిష్కారంలో... కరువు నివారణ చర్యలు చేపట్టడంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని టీడీపీ ఆరోపించింది. తాగునీటి సమస్యపై మంగళవారం టీడీపీ ఆధ్వర్యంలో జలమండలి కార్యాలయం వద్ద నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు పలువురిని అరెస్టు చేసి గాంధీనగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసు స్టేషన్ ఆవరణలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఎం.పి. మల్లారెడ్డి, మహిళా అధ్యక్షురాలు శోభ, వీరేందర్ గౌడ్ తదితరులు మాట్లాడారు.

ఓ వైపు తెలంగాణ ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతుంటే కరువుతో సతమతమవుతుంటే .. సీఎం కేసీఆర్, మంత్రులు రిసార్ట్స్, ఫామ్‌హౌస్‌లలో శిక్షణ తరగతుల పేరిట కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. నీటి సమస్య పరిష్కారం కోసం ప్రజల పక్షాన టీడీపీ ఆందోళన చేస్తుంటే సీఎం కేసీఆర్ పోలీసులతో అరెస్టులు చేయించి, ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే తెలంగాణ ప్రభుత్వం నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకొవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అరవింద్ గౌడ్, మేకల సారంగపాణి, ఎం.ఎన్. శ్రీనివాస్‌రావు, నర్సిరెడ్డి, కృపానందం, ఆర్. మహేందర్, ఎం. రవికుమార్‌లతో పాటు నగర నలుమూలల నుంచి అనేకమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు