‘మిషన్’లకు సాయం అందించండి | Sakshi
Sakshi News home page

‘మిషన్’లకు సాయం అందించండి

Published Wed, Apr 13 2016 3:58 AM

‘మిషన్’లకు సాయం అందించండి - Sakshi

♦ నీతి ఆయోగ్‌కు విన్నవించిన రాష్ట్రం
♦ మిషన్ కాకతీయ, భగీరథ పథకాలపై సమీక్ష
 
 సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా తగినంత ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నీతి ఆయోగ్‌ను కోరింది. ఇందుకు సానుకూలంగా స్పందించిన నీతి ఆయోగ్ సలహాదారు పి.కె.ఝా ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. మంగళవారం సచివాలయంలో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఇందులో నీతి ఆయోగ్ సలహాదారు ఎ.కె.జైన్, డిప్యూటీ సలహాదారు పి.కె.ఝా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాల అమలు తీరుతెన్నులను అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను నీతి ఆయోగ్ సలహాదారులు అభినందించినట్లు ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య తెలిపారు. ఈ భేటీలో ప్రభుత్వ సలహాదారు ఏకే గోయల్, జీఆర్ రెడ్డి, మైనర్ ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ పి.నాగేందర్, ఇరిగేషన్ శాఖ మంత్రి ఓఎస్‌డీ శ్రీధర్ దేశ్‌పాండే, ప్లానింగ్ శాఖ డెరైక్టర్ సుదర్శన్‌రెడ్డి, మిషన్ భగీరథ అధికారులు పాల్గొన్నారు.

 రైతులను ఆదుకోండి
 మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో అయిదేళ్లలో రూ.20 వేల కోట్లతో 46,351 చెరువులను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషి తెలిపారు. తెలంగాణ రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా సహకారం అందించేలా చూడాలని నీతి ఆయోగ్ అధికారులను కోరారు. మిషన్ కాకతీయ కింద మొత్తం 667 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక తీయడం ద్వారా 2.3 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించినట్లు జోషి వివరించారు.

 రూ.19 వేల కోట్లు సాయం చేయండి
 మిషన్ భగీరథ పథకానికి కేంద్ర ప్రభుత్వం తగినంత ఆర్థిక సాయం అందించాలని పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్.పి.సింగ్ కోరారు. ఇప్పటికే ఇచ్చిన ప్రతిపాదనల మేరకు రూ.19 వేల కోట్ల ఆర్థిక సాయం అందించాలని కోరుతూ నీతి ఆయోగ్‌కు నివేదిక సమర్పించారు. 1.30 లక్షల కిలోమీటర్ల పైపులైన్లు వేస్తున్నామని వివరించారు. మొదటి దశలో 9 నియోజకవర్గాలకు మంచినీటిని అందించనున్నట్లు వివరించారు.

Advertisement
Advertisement