ఆ పాఠశాలలపై చర్యలు తీసుకోండి

5 Apr, 2016 03:35 IST|Sakshi

♦ అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లపై హైకోర్టు సూచన
 
 సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్టు తేలిన ప్రైవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల వివరాలుంటే వాటిని ప్రభుత్వానికి అందచేయాలని పిటిషనర్‌కు సూచించింది. ఆ పాఠశాలలు కూడా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ట్లు తేలితే వాటిపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది.

ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రంలో పలు ప్రైవే టు అన్ ఎయిడెడ్ పాఠశాలలు వన్‌టైం స్పెష ల్ ఫీజు అంటూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయని, ఇది ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధమంటూ హెచ్‌ఎస్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎన్.రవికుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యాన్ని మరోసారి విచారించిన ధర్మాసనం సోమవారం దానిని మరోసారి విచారించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్ స్పందిస్తూ అధిక ఫీజుల వసూలుపై పిటిషనర్ ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారని, దాని ఆధారంగా ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. విచారణ జరిపిన కమిటీ నివేదిక సమర్పించిందని, 12 పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు తేలిందన్నారు. దీంతో ఆ 12 పాఠశాలలకు నోటీసులు జారీ చేశామని, వారు వివరణలు కూడా ఇచ్చారని, ఈ వివరణ ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని కోర్టుకు నివేదించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

మరిన్ని వార్తలు