సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

15 Jun, 2016 16:47 IST|Sakshi
సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

మా సర్కారును కూలదోసేందుకు కుట్ర
టీడీపీ, తెలంగాణ కాంగ్రెస్ కలిసి కుట్రపన్నాయి
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తేవాలనుకున్నాయి
మజ్లిస్ అధినేత ఒవైసీ మాకు అండగా నిలిచారు
రెండు జర్మనీలు ఏకమైనట్లు తెలుగు రాష్ట్రాలు ఏకమవుతాయని బాబు అన్నారు
రాష్ట్రం ఏర్పాటు కోసం నిలబడి పోరాడింది, రాజీనామాలు చేసింది మావాళ్లే
ముఖ్య నాయకుల చేరిక సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి
టీఆర్ఎస్‌లో చేరిన గుత్తా సుఖేందర్ రెడ్డి, వివేక్, వినోద్, ఎమ్మెల్యేలు
మావాళ్లు కాంగ్రెస్‌లో చేరినప్పుడు జానా ఎందుకు మాట్లాడలేదు
మీరు చేస్తే సంసారం.. మేం చేస్తే వ్యభిచారమా


హైదరాబాద్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన విషయాలు వెల్లడించారు. తమ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు టీడీపీ, తెలంగాణ కాంగ్రెస్ కలిసి కుట్ర పన్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్, ఎమ్మెల్యేలు భాస్కరరావు, రవీంద్ర నాయక్ తదితరులు కేసీఆర్ సమక్షంలో బుధవారం టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో తమ ప్రభుత్వాన్ని కూలదోసి.. రాష్ట్రపతి పాలన పెట్టించాలని ఆ రెండు పార్టీలు కుట్రపన్నాయని ఆయన అన్నారు. ఈ విషయాన్ని తనకు ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చెప్పారన్నారు. చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఆయన తనకు ఫోన్ చేయగా ఇంటికి ఆహ్వానించానని, అక్కడే ఆయన తనకు ఈ విషయం చెప్పారని కేసీఆర్ అన్నారు. ఇదేం అన్యాయమని, రాష్ట్రం ఏర్పడకుండా మొదట్లో అడ్డుపడటమే కాక.. వచ్చిన రాష్ట్రంలో కూడా ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్లీ అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకోడానికి వాళ్లు కుట్ర పన్నుతున్నారని ఒవైసీ ఆవేదన వ్యక్తం చేశారని, టీఆర్ఎస్‌కు తమ వైపు నుంచి పూర్తి మద్దతు ఉంటుందని చెప్పడమే కాక, వాళ్ల పార్టీ ప్రధాన కార్యాలయం దారుస్సలాంలో సమావేశం కూడా ఏర్పాటుచేసి చెప్పారని అన్నారు. బెర్లిన్ గోడ పగలగొట్టి జర్మనీ ఏకమైనట్లుగా తెలుగు రాష్ట్రాలు మళ్లీ ఏకమవుతాయని చంద్రబాబు అన్నారని.. దానికి ఈ కుట్రే నిదర్శనమని ఆయన మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క కూడా ప్రభుత్వం మధ్యలో పారిపోతుందన్నారని చెప్పారు.

అంతకుముందు రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్, బీజేపీ.. అన్ని పార్టీలు ఏకమై జేఏసీగా ఏర్పడి పోరాటం చేశామని, అప్పట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు తప్ప ఒక్క టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయలేదని గుర్తు చేశారు. రాజీనామాలు చేయకుండా వాళ్లు పారిపోయారని అన్నారు. బీజేపీకి ఇద్దరు ఉంటే ఒకరు రాజీనామా చేశారు, మరొకరు చేయలేదన్నారు. తీరా రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ తెచ్చింది తామేనంటూ ఎన్నికల్లో తమపై పోటీ చేశారని.. కానీ ప్రజల ఆశీర్వాదంతో గెలిచామని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన నేతలకు గులాబి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తమ పార్టీ నేతలను కాంగ్రెస్‌లోకి చేర్చుకున్నప్పుడు జానారెడ్డి ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. మీకో నీతి మాకో నీతా అంటూ... మీరు చేస్తే సంసారం, మేం చేస్తే వ్యభిచారమా అని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు