మండలిలో టీడీపీ ఖాళీ

31 Dec, 2015 16:53 IST|Sakshi

హైదరాబాద్: తెలంగాణ శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయింది. ప్రస్తుతం మండలిలో ఆ పార్టీకి ప్రాతినిథ్యం లేకుండాపోయింది. తెలంగాణ శాసనమండలిలో మొత్తం 40 స్థానాలున్నాయి. తాజాగా స్థానిక సంస్థల కోటాలో 12 స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాల అనంతరం మండలిలో ఆయా పార్టీల బలాబలాలు పరిశీలిస్తే.. టీడీపీ నుంచి ఎవరూ లేరు. మొత్తం 40 మంది ఉన్న సభలో అధికార టీఆర్ఎస్ పార్టీ పక్షాన 28 మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఏడుగురు సభ్యులున్నారు. ఆ తర్వాత స్థానాల్లో ఎంఐఎం రెండు, బీజేపీ ఒకటి, ఇద్దరు ఇండిపెండెంట్లు ఉన్నారు.

స్థానిక సంస్థల కోటా నుంచి పన్నెండు స్థానాలకు ఎన్నికలు జరగ్గా, వాటిలో ఆరింటిని టీఆర్ఎస్ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. మిగిలిన ఆరు స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా వాటిలో కూడా నాలుగు టీఆర్ఎస్ కైవసం చేసుకోగా, రెండింటిలో కాంగ్రెస్ గెలిచింది. ప్రస్తుతం మండలిలో ఇక ఖాళీలేవీ లేవు. దీంతో మండలిలో టీడీపీతోపాటు సీపీఐ, సీపీఎంలకు ప్రాతినిథ్యం లేకుండా పోయింది.

ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరఫున ఇద్దరు సభ్యులు ఎన్నికైనప్పటికీ ఆ తర్వాత పరిణామాల్లో వారిద్దరూ టీడీపీకి గుడ్ బై చెప్పి ఇదివరకే టీఆర్ఎస్ లో చేరారు. ఉల్లోల్ల గంగాధర్ గౌడ్, మహమ్మద్ సలీం టీడీపీ నుంచి గెలిచి ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి టీడీపీ ఒక్కో స్థానానికి పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయింది. ఆ పార్టీ ఈ రెండు స్థానాల్లోనూ మూడో స్థానంలో నిలిచింది.

కౌన్సిల్ లో మొత్తం సభ్యులు వీరే....
నామినేటెడ్ ఎమ్మెల్సీలు - నాయిని నర్సింహారెడ్డి, కర్నె ప్రభాకర్, సబావత్ రాములు నాయక్, ఫరూక్ హుస్సేన్, డి.రాజేశ్వరరావు, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి
ఎమ్మెల్యే కోటాలో - మహమ్మద్ మహమూద్ అలీ, కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, మహమ్మద్ సలీం, బోడకుంటి వెంకటేశ్వర్లు, నేతి విద్యాసాగర్, కె.యాదవరెడ్డి, వి. గంగాధర్ గౌడ్ టీఆర్ఎస్కు చెందిన వారు. కాగా మాగం రంగారెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, మహమ్మద్ షబ్బీర్ అలీ, ఆకుల లలిత, టీ.సంతోష్ కుమార్, సయ్యద్ అల్తాఫ్ హైదర్ రజ్వీ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారున్నారు.
హైదరాబాద్ లోకల్ అధారిటీ - ఎంఎస్ ప్రభాకర్ (కాంగ్రెస్ తరఫున గెలిచి టీఆర్ఎస్ లో చేరారు), సయ్యద్ అనిముల్ హసన్ జాఫ్రీ,
ఉపాధ్యాయ నియోజకవర్గం - పాటూరి సుధాకర్ రెడ్డి (టీఆర్ఎస్), పూల రవీందర్ (ఇండిపెండెంట్), కాటిపల్లి జనార్ధన్ రెడ్డి (ఇండిపెంటెండ్)
పట్టభద్రుల నియోజకవర్గం - కనకమామిడి స్వామి గౌడ్ (టీఆర్ఎస్ - మండలి చైర్మన్), పల్లా రాజేశ్వరరెడ్డి (టీఆర్ఎస్), ఎన్.రామచంద్రరావు (బీజేపీ)
స్థానిక సంస్థల కోటాలో -  నారదాసు లక్ష్మణరావు, టి.భాను ప్రసాదరావు, పురాణం సతీష్, భూపతిరెడ్డి, కొండా మురళీధర్ రావు, వి.భూపాల్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు, కసిరెడ్డి నారాయణ రెడ్డి, బాలసాని లక్ష్మినారాయణలు టీఆర్ఎస్ కు చెందిన వారు కాగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కె.దామోదర్ రెడ్డి కాంగ్రెస్ సభ్యులు

మరిన్ని వార్తలు