ఇదీ హద్దు...దాటవద్దు!

26 Jan, 2016 03:01 IST|Sakshi
ఇదీ హద్దు...దాటవద్దు!

అభ్యర్థులూ... ఇవి మరువద్దు
నిఘా ముమ్మరం చేసిన సర్వైలెన్స్ టీమ్స్
ఏమాత్రం ‘కట్టు తప్పినా’ తిప్పలు తప్పవు

 
సిటీబ్యూరో:  ‘గ్రేటర్’లో వచ్చే నెల 2న జరుగనున్న ‘ఫైట్’కు ప్రచా రం ఊపందుకుంది. ఈ హడావుడి... ‘సీటు’ కోసం పడే పాట్లలో పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నిబంధనలను అతిక్రమించకూడదు. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే అధికారం ఎవరికీ ఉండ దు. ఎన్నికల ఘట్టాన్ని సజావుగా పూర్తి చేయడానికి ఎన్నికల సంఘం కొన్ని ఆదేశాలు, మార్గదర్శకాలు జారీ చేస్తుంది. వీటి అమలుకు పోలీసులు పక్కా చర్యలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, నాయకులు, కార్యక ర్తలు వీటిని కచ్చితంగా పాటించాల్సిందే. అలా చేయ ని వారిని గుర్తించ డానికే పోలీసు, రెవెన్యూ అధికారులతో కూడిన సర్వైలెన్స్ టీమ్స్, స్వ్కాడ్స్ డేగ కన్ను వేశాయి. ఏమాత్రం ఉల్లంఘన కనిపించినా...భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఈ ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో పోలీసులు సూచిస్తున్నారు.

నగరంలోని ఏ ప్రాంతంలోనైనా సభలు, సమావేశాలు, ధర్నాలు, ర్యాలీలు తదితర కార్యక్రమాలు నిర్వహించాలంటే నిర్ణీత సమయం ముందు స్థానిక డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌కు లిఖిత పూర్వకంగా దరఖాస్తు చేసుకుని అనుమతి తీసుకోవాలి. ప్రదర్శనలు, ఊరేగింపులు, బహిరంగ సభలు, రోడ్‌షోల కు అనుమతి పొందే సమయంలో అవి ప్రారంభమయ్యే ప్రాంతం, సమయం, ప్రయాణించే మార్గం, సమయం, సాగే దారి వివరాలు స్పష్టం గా తెలియజేయాలి. దీనికిఅనుగుణంగా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేస్తారు.

ప్రదర్శనసమయంలో ట్రాఫిక్‌కు ఏమాత్రం అంతరా యం కలగకుండా రోడ్డుకు ఓ పక్కగా మాత్రమే వెళ్లాలి. కార్యకర్తలు, అభిమానులు నిబంధనలు అతిక్రమించి ఇబ్బందులు కలిగిస్తే..  కార్యక్రమానికి అనుమతి తీసుకున్న వ్యక్తే బాధ్యత వహించాలి.ఎన్నికల నియమావళి ప్రకారం కాన్వాయ్‌లో అత్యధికంగా మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. అది ద్విచక్ర వాహనమైనా... భారీ వాహనమైనా ఒకేలా పరిగణిస్తారు. కార్యకర్తలు, అభిమానులు ద్విచక్ర వాహనాలకు జెండాలు కట్టుకుని వెళ్లినా దాన్నీ పరిగణనలోకి తీసుకుంటారు.

నామినేషన్లు, ప్రచార సమయంలో బల ప్రదర్శన కోసం జన సమీకరణ చేసినా... వారికి ధనం, మద్యం పంపిణీ చేసినా చర్యలు తప్పవు. ప్రచారానికి వినియోగించే లౌడ్ స్పీకర్లు, మైకులకు స్థానిక పోలీసు అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. ఏ వాహనాన్ని ప్రచారానికి వినియోగించదలిచారో ఆ నెంబరు కచ్చితంగా చెప్పాలి. వాహనాల్లో అక్రమంగా ఆయుధాలు, విస్ఫోటన        పదార్థాలు, కరెన్సీ, మద్యం సరఫరా చేస్తుంటే వాటిని స్వాధీనం చేసుకోవడంతో పాటు వాహన చోదకుడు, యజమానిని అరెస్టు చేస్తారు. ప్రార్థనా మందిరాలు, పాఠశాలల సమీపంలో లౌడ్ స్పీకర్లతో ప్రచారం చేయకూడదు. మిగిలిన ప్రదేశాల్లోనూ ఇతరులకు ఇబ్బంది కలిగించని స్థాయిలోనే మైకుల వినియోగానికిఅనుమతిస్తారు.

సెక్షన్లు... నేరాలు...
ఎన్నికల సంఘం నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951తో పాటు ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) కింద కేసులు నమోదు చేస్తారు.  

ఐపీసీ 171 ప్రకారం...
సెక్షన్ 171బి- ఓటర్లకు నగదుతో ప్రలోభ పెట్టడం.
సెక్షన్ 171సి-ఓటర్లను వివిధ రకాలుగా ప్రభావితం చేయడం.  సెక్షన్ 171డి-దొంగ ఓట్లు వేయడం.
సెక్షన్ 171ఐ-ఎన్నికల వ్యయ నివేదికలను సకాలంలో  అధికారులకు సమర్పించకపోవడం.    
 
 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం నేరాలివీ...
 
సెక్షన్ 123- ఓటర్లకు లంచం ఇవ్వజూపడం, ప్రలోభాలకు లోను చేయడం, కుల, మత, వర్గ, భాషాపరమైన, మతపరమైన జెండాలను చూపించి ఓట్లు అడగటం.
సెక్షన్ 125- ఎన్నికల్లో రెండు వర్గాల మధ్య విభేదాలు పెంచడం.
సెక్షన్ 126- నిషేధిత సమయాల్లో బహిరంగ సభలు నిర్వహించడం.
సెక్షన్ 127- ఎన్నికల సమావేశాలకు ఆటంకం కలిగించడం.
సెక్షన్ 127(ఎ)- పోస్టర్లు, కరపత్రాల ముద్రణ విషయంలో ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించకపోవడం.
సెక్షన్ 128- రహస్య ఓటింగ్ హక్కుకు భంగం కలిగించడం.
సెక్షన్ 130- పోలింగ్ కేంద్రాల వద్ద నిషేధిత ప్రాంతంలో ప్రచారం చేయడం.
సెక్షన్ 131- పోలింగ్ కేంద్రాల వద్ద నిబంధనలను ఉల్లంఘించడం.
సెక్షన్ 132- పోలింగ్ కేంద్రాల వద్ద అనైతికంగా ప్రవర్తించడం.
సెక్షన్ 133- ఎన్నికల ప్రక్రియలో అక్రమంగా వాహనాలను వినియోగించడం.
సెక్షన్ 134(బి)- పోలింగ్ కేంద్రం చుట్టూ అక్రమంగా సంచరించడం.
సెక్షన్ 135(ఎ)- పోలింగ్ బూత్‌ల ఆక్రమణ, రిగ్గింగ్.
సెక్షన్ 136- ఎన్నికల సిబ్బందికి సంబంధించిన అధికారిక, పోలింగ్ సాధనాలను ధ్వంసం చేయడం.
 

మరిన్ని వార్తలు