బ్రాందీ తెలంగాణగా మారుస్తున్నారు

21 Aug, 2015 00:34 IST|Sakshi
బ్రాందీ తెలంగాణగా మారుస్తున్నారు

మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
 
హయత్‌నగర్: నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వం పేదలను మద్యం మత్తులో ముంచేందుకు చీఫ్ లిక్కర్‌ను ఏరులై పారించేందుకు ప్రయత్నిస్తోందని ఎల్‌బీనగర్ మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి బండారు లక్ష్మారెడ్డి అన్నారు. చీప్ లిక్కర్‌కు వ్యతిరేకంగా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం హయత్‌నగర్ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ వద్ద ధర్నా నిర్వాహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలను మద్యానికి బానిసలను చేసి, ఖజానా నింపుకునేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. నిత్యావసరాల ధరలు పెరుగుతున్నా పట్టించుకోని పాలకులు తక్కువ ధరకు మద్యాన్ని అమ్మాలని చూడటం దారుణమన్నారు. బంగారు తెలంగాణ పేరుతో ఓట్లు వేయించున్న కేసీఆర్ బ్రాంది తెలంగాణగా మారుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులు, విద్యార్థులను ఆదుకోవడంలో శ్రద్ధ చూపాలన్నారు. ఈ సందర్భంగా హయత్‌నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు.

 ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత...
  పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకునేందుకు ప్రయత్నించగా తోపులాట జరిగింది. ఈ సందర్భంగా వారు స్టేషన్ ఎదుట మద్యం సీసాలను పగులగొట్టారు. అనంతరం ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.  కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు సింగిరెడ్డి మల్లీశ్వరి, సుజాతరెడ్డి, మాజీ కార్పొరేటర్ సుభాషిణి, నేతలు లక్ష్మి, చెన్నగోని శ్రీధర్‌గౌడ్, ధన్‌రాజ్, ముత్యాల చంద్రశేఖర్‌రావు, గజ్జి భాస్కర్, శ్రీనివాస్‌యాదవ్, సుధాకర్‌యాదవ్, సుమంత్ తదితరులు పాల్గొన్నారు.
 
 

మరిన్ని వార్తలు