నదిలో నిమజ్జనాలకు బ్రేక్! | Sakshi
Sakshi News home page

నదిలో నిమజ్జనాలకు బ్రేక్!

Published Fri, Aug 21 2015 12:36 AM

నదిలో నిమజ్జనాలకు బ్రేక్! - Sakshi

కృష్ణా పుష్కరాల నేపథ్యంలో అధికారుల యోచన
నదిలో నీరు కలుషితమౌతుందని ఆందోళన
వచ్చే పుష్కరాలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు
 

విజయవాడ : కృష్ణానదిలో వినాయక విగ్రహాల నిమజ్జనానికి బ్రే క్ వేయాలని జలవనరుల శాఖ అధికారులు భావిస్తున్నారు. వినాయకచవితి పందిళ్లకు అనుమతులు, నిమజ్జనం ఏర్పాట్లు తదితర అంశాలపై త్వరలో జరగబోయే రెవెన్యూ, పోలీసు, దేవాదాయ, జలవనరుల శాఖల అధికారుల సమావేశంలో ఈ విషయాన్ని చర్చించనున్నారు. విగ్రహాలను కృష్ణానదిలో నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితమవుతోంది.

 ఈ ఏడాది వెయ్యికి పైగా విగ్రహాలు...
 నగరంలోని వివిధ డివిజన్లలో 2013లో 550, గత ఏడాది 800 వినాయకచవితి పందిళ్లు వేశారు. ఈ ఏడాది వెయ్యి కంటే ఎక్కువ వేసే అవకాశముంది. ఏటా పందిళ్ల సంఖ్య పెరగటంతో పాటు వాటిలో పెట్టే విగ్రహాల సైజు కూడా పెరుగుతోంది. 25 నుంచి 30 అడుగుల ఎత్తు విగ్రహాలను సైతం పందిళ్లలో పెట్టడానికి నిర్వాహకులు ఏమాత్రం వెనకడుగు వేయటం లేదు. గతేడాదికి దీటుగా ఈ ఏడాది లక్షల రూపాయలు ఖర్చు చేసి మరీ వివిధ మోడళ్లలో ఆకర్షణీయమైన రంగుల్లో విగ్రహాలను తయారు చేయించేందుకు ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చేశారు.

రంగులతో నీటి కాలుష్యం...
నగరం, పరిసర గ్రామాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి వినాయక విగ్రహాలను తీసుకువచ్చి నగరంలో కృష్ణానదిలో నిమజ్జనం చేస్తారు. గత ఏడాది 1500కు పైగా విగ్రహాలు నదిలో నిమజ్జనం చేసినట్లు సమాచారం. భవానీఘాట్, దుర్గాఘాట్‌లలో మాత్రమే విగ్రహాలను నిమజ్జనానికి అనుమతిస్తారు. ఐదు అడుగలలోపు విగ్రహాలను దుర్గాఘాట్‌లోనూ, అంతకంటే ఎక్కువ విగ్రహాలను భవానీఘాట్‌లోనూ నిమజ్జనం చేశారు. పెద్ద పెద్ద విగ్రహాలను తయారు చేసేందుకు విగ్రహాల్లో ఇనుము, చెక్క, ప్లాస్టర్ ఆఫ్ పారిస్, మట్టి తదితర పదార్థాలను వాడతారు. వీటికి వివిధ రకాలైన రసాయనాలతో తయారైన రంగులను ఉపయోగిస్తారు. ఇవన్ని నీటిలో పూర్తిగా కలిసిపోవడం లేదు. నదికి వరదలు వచ్చినప్పుడు మాత్రమే కొట్టుకుపోతున్నాయి.
 
పుష్కరాల నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు...

 నీరు కలుషితం అవుతున్నందున ఈ ఏడాది నదిలో విగ్రహాలు అనుమతించకూడదని జలవనరుల శాఖ అధికారులు నిర్ణయించారు. వచ్చే ఏడాది పుష్కరాలు కావడంతో నీరు కలుషితం కాకుండా ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారిస్తున్నారు. కాలువల్లో అనుమతించినా వాటి నీరూ కలుషితమవుతోందని, చెక్క, ఇనుప ముక్కలు నీటిలో నిల్వ ఉండటం వల్ల ఇబ్బందులు వస్తాయని అధికారులు భావిస్తున్నార
 
సిద్ధమవుతున్న 63 అడుగుల మహా విగ్రహం

నగరంలో తొలిసారిగా 63 అడుగుల తాండవగణపతి విగ్రహాన్ని ఘంటసాల వెంకటేశ్వరరావు కళాశాలలో ఏర్పాటు చేస్తున్న విషయం విదితమే. దీనికి కావాల్సిన షెడ్డు ఇప్పటికే పూర్తిచేసి వినాయకుడి విగ్రహ నమూనాను ఇప్పటికే ఇనుముతో తయారు చేశారు. త్వరలోనే మట్టి పని ప్రారంభిస్తామని నిర్వాహకులు, డూండీ గణేష్ సేవాసమితి ఉపాధ్యక్షుడు ఫణిరాజ్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ విగ్రహాన్ని ఇక్కడే నిమజ్జనం చేసే విధంగా ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు.
 
అలర్జీలు వచ్చే ప్రమాదముంది

కలుషితమైన నీటితో స్నానాలు చేయడం వల్ల శరీరానికి అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది. దురదలు, దద్దుర్లు వంటి సమస్యలు వస్తాయి. నదీ స్నానాల సందర్భంగా పొరపాటున నీరు కడుపులోకి చేరితే ఉదర సంబంధ వ్యాధులూ వచ్చే ప్రమాదముంది. కాలుష్యం లేని మట్టితో తయారుచేసిన ఎకో ఫ్రెండ్లీ వినాయక విగ్రహాలైతేనే మంచిది. ఆ మట్టిలో నదిలో కలిసిపోతుంది.
 - డాక్టర్ రవీంద్రరెడ్డి, స్కిన్ స్పెషలిస్టు
 

Advertisement

తప్పక చదవండి

Advertisement