బాలకృష్ణ కిడ్నాప్ కేసులో చంద్రబాబు సస్పెన్షన్

16 Mar, 2016 05:04 IST|Sakshi
బాలకృష్ణ కిడ్నాప్ కేసులో చంద్రబాబు సస్పెన్షన్

- రూ. 30 కోట్ల విలువైన స్థలం కోసం వృద్ధుడైన బాలకృష్ణ కిడ్నాప్
- భూకబ్జాదారులకు సహకరించిన నేరేడ్‌మెట్ ఇన్‌స్పెక్టర్ చంద్రబాబు సస్పెన్షన్
- కేసును ఛేదించిన సైబరాబాద్ ఎస్‌ఓటీ.. మరో 12 మంది  నిందితుల అరెస్ట్


హైదరాబాద్: ఈసీఐఎల్‌లోని రూ.30 కోట్ల విలువైన 2,400 గజాల స్థలం కోసమే వృద్ధుడైన బాలకృష్ణారావును కిడ్నాప్ చేసిన ముఠాను సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్‌ఓటీ) పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 25 మందిలో 12 మంది నిందితుల్ని అరెస్టు చేసినట్లు డీసీపీ రాంచందర్‌రెడ్డి మంగళవారం వెల్లడించారు. ఈ వ్యవహారంలో నిందితులకు పరోక్ష సహకారం అందించడం వంటి ఆరోపణలపై నేరేడ్‌మెట్ ఇన్‌స్పెక్టర్ చంద్రబాబును సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సస్పెండ్ చేశారు.

సైనిక్‌పురి వాసి బొడ్డపాటి బాలకృష్ణారావుకు(70)కు ఈసీఐఎల్ చౌరస్తా సమీపంలో ఉన్న  స్థలంపై రెండు వర్గాలు కన్నేయడంతో వివాదం కోర్టుకు చేరింది. ఓ వర్గానికి చెందిన మాధవ్ తదితరులు ఆస్తి చేజిక్కించుకోవడానికి బాలకృష్ణ కిడ్నాప్‌కు పథక రచన చేశారు. చంద్రశేఖర్ ఇంట్లో పనిచేసే యాదగిరితో పాటు సుబ్బారావు, అనంతపురం జిల్లాకు చెందిన పాత నేరస్తుడు రవీందర్, తిరుపతి సూత్రధారులుగా మరికొందరు దుండగులు రంగంలోకి దిగారు. గత నెల 25 తెల్లవారుజామున ఇంటి నుంచే బాలకృష్ణను కిడ్నాప్ చేసి, మాధవ్‌కు చెందిన గార్డెన్స్‌కు తీసుకువెళ్లి బెదిరించారు. మరుసటి రోజు వదిలేశారు.

కిడ్నాప్ జరిగిన రోజు బాలకృష్ణ ఇంటి వాచ్‌మెన్ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్ ఎన్‌సీహెచ్ రంగస్వామి నిందితుల్ని గుర్తించారు. జల్‌పల్లి యాదగిరి, మహ్మద్ అబ్దుల్ ఖదీర్, మహ్మద్ మహబూబ్‌ఖాన్, దాసిరెడ్డి సుబ్బారెడ్డి, రెడ్డివారి రవీందర్‌రెడ్డి, గోగుల తిరుపతయ్య, జిట్టా కాటమయ్య, జిట్టా గురుశేఖర్, దేవగుడి వెంకటశివ, పండుగ భీంరెడ్డి, జె.జగన్‌గౌడ్, ఆర్.మురళీమోహన్‌ను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. ఈ కిడ్నాప్ వ్యవహారం మొత్తం నేరేడ్‌మెట్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న చంద్రబాబుకు తెలిసే జరిగిందని దర్యాప్తులో తేలింది. నిందితులకు పరోక్షంగా సహకరించిన ఆరోపణలపై ఆయన్ను సస్పెండ్ చేశారు.

మరిన్ని వార్తలు