కల్యాణానికి అందని లక్ష్మి

1 Feb, 2017 03:49 IST|Sakshi
కల్యాణానికి అందని లక్ష్మి

ఆర్నెల్లు దాటినా అందని సాయం

  • పెండింగ్‌లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ దరఖాస్తులు
  • 95,579 దరఖాస్తుల్లో 30,390 మందికే సాయం..
  • దరఖాస్తుల పరిశీలనలో రెవెన్యూ అధికారుల ఉదాసీనత
  • ఆడబిడ్డ తల్లిదండ్రుల ఎదురుచూపులు

ఆసిఫ్‌నగర్‌కు చెందిన సంద పూజ వివాహం యాచారం గ్రామానికి చెందిన శ్రీనివాస్‌తో గతేడాది ఏప్రిల్‌29న జరిగింది. ఆర్థికంగా వెనుకబడిన పూజ కుటుంబం ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకుంది. పెళ్లై 9 నెలలు గడిచినా దరఖాస్తు మాత్రం తహశీల్దారు వద్దే పెండింగ్‌లో ఉంది. పెళ్లిరోజు అందాల్సిన ఆర్థిక సాయం ఇప్పటికీ అందకపోవడంతో ఆ కుటుంబం సాయం కోసం ఎదురు చూస్తోంది.

సాక్షి, హైదరాబాద్‌: పేదింటి ఆడబిడ్డ పెళ్లి.. భారం కాకుండా ప్రభుత్వమే ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో తలపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. వాస్తవానికి పెళ్లిరోజు నాటికి లబ్ధిదారులకు రూ.51వేల ఆర్థిక సాయం అందాలి. అయితే సర్కారు లక్ష్యం ప్రస్తుతం గాడితప్పుతోంది. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియలోనే జాప్యం వల్ల పెళ్లై ఆర్నెళ్లు గడిచినా అర్హులకు ఆర్థిక సాయం అందట్లేదు. దీంతో నెలల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది.

పెండింగ్‌లో దరఖాస్తులు..
ప్రస్తుత వార్షికంలో అన్ని కేటగిరీలకు సంబంధించి ఇప్పటివరకు 95,579 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఇప్పటివరకు 59,593 దరఖాస్తులను అర్హులుగా నిర్ధారించారు. వీటిలో 30,390 మందికే ఖాతాల్లో ఆర్థికసాయాన్ని జమచేశారు. మిగతా లబ్ధిదారులకు చెల్లింపులు ట్రెజరీల్లో పెండింగ్‌లో ఉన్నాయి. వేలాది దరఖాస్తుల పరిశీలన ఇప్పటికీ ప్రారంభం కాలేదు. కొత్త జిల్లాల ఏర్పాటుతో వెబ్‌సైట్‌ దాదాపు నెలరోజుల పాటు నిలిచిపోవడంతో ఆ సమయంలో దరఖాస్తుల పరిశీలన అటకెక్కింది. తర్వాత వెబ్‌సైట్‌ పునరుద్ధరించినప్పటికీ దరఖాస్తుల పరిశీలన ఊపందుకోలేదు. మరోవైపు గత నెలరోజులుగా మంచి ముహూర్తాలు లేకపోవడంతో పెళ్లిళ్లు పెద్దగా జరగలేదు. ఈ నేపథ్యంలో కొత్త దరఖాస్తులు రాకున్నా, పాతవాటి పరిశీలన నత్తనడకన సాగడంతో దరఖాస్తుదారులకు ఎదురుచూపులు తప్పడంలేదు.

బాధ్యతల బదిలీతో..
కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల పర్యవేక్షణ సంక్షేమ శాఖలు నిర్వహించేవి. కానీ ఈ పథకాల్లో అవకతవకలు జరుగుతున్నట్లు గుర్తించిన ప్రభుత్వం ఆ బాధ్యతల్ని రెవెన్యూ శాఖకు బదిలీ చేసింది. ప్రస్తుతం ఆర్డీవో, తహశీల్దార్‌ గ్రామ రెవెన్యూ అధికారుల స్థాయిలో ఈ పథకం పర్యవేక్షణ జరుగుతోంది. క్షేత్రస్థాయిలో లబ్ధిదారుడి స్థితిగతులు పరిశీలించిన తర్వాత తహశీల్దార్‌ నివేదిక ఆధారంగా ఆర్డీవోలు అర్హులను ఎంపిక చేసి లబ్ధిదారులకు ఆర్థికసాయం అందిస్తారు. అయితే రెవెన్యూ అధికారులకు శాఖపరమైన పనులతో బిజీగా ఉండడంతో వీటి పరిశీలనపై దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలున్నాయి. గతవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో దరఖాస్తుల పరిశీలన విషయంలో ఉన్నతాధికారులు ఆర్డీవోలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

>
మరిన్ని వార్తలు