దర్శకుడు దాసరికి అస్వస్థత | Sakshi
Sakshi News home page

దర్శకుడు దాసరికి అస్వస్థత

Published Wed, Feb 1 2017 5:22 AM

దర్శకుడు దాసరికి అస్వస్థత

  • అనారోగ్యంతో కిమ్స్‌లో చేరిన దాసరి నారాయణరావు
  • అన్నవాహికతో పాటు కిడ్నీలు, ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్‌
  • వెంటిలేటర్‌పై ఉంచి వైద్య సేవలు
  • దాసరి ఆరోగ్యం నిలకడగానే ఉందని కిమ్స్‌ వైద్యుల వెల్లడి
  • మంత్రి తలసాని, మోహన్‌బాబు సహా పలువురి పరామర్శ
  • హైదరాబాద్‌
    ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు తీవ్ర అనారోగ్యంతో సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల క్రితం అన్నవాహికలో ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన ఆయనను వైద్యులు పరీక్షించి ఊపిరితిత్తులు, కిడ్నీలు కూడా ఇన్‌ఫెక్షన్‌కు గురైనట్లు గుర్తించి వైద్యసేవలు అందజేశారు. దాసరి ఆరోగ్య స్థితిని, ఆయనకు అందిస్తున్న వైద్యాన్ని కిమ్స్‌ ఎండీ డాక్టర్‌ భాస్కర్‌రావు, ఇతర వైద్యులు మీడియాకు వివరించారు.

    అన్నవాహికలో ఇన్‌ఫెక్షన్‌ను తొలగించేందుకు వైద్యం అందజేస్తూనే.. వెంటిలెటర్‌పై ఉంచి శ్వాస అందజేస్తున్నామని వారు తెలిపారు. అన్నవాహికకు స్టెంట్‌ వేసినట్లు చెప్పారు.  కిడ్నీలు కూడా దెబ్బతిన్నట్లు పరీక్షల్లో వెల్లడవడంతో డయాలసిస్‌ కూడా చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో ఆయన పూర్తిగా కోలుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. దాసరి కుమారులు అరుణ్, ప్రభు ఆస్పత్రిలోనే ఉన్నారు.

    తరలి వచ్చిన సినీ ప్రముఖులు..
    దాసరి కిమ్స్‌లో చికిత్స పొందుతున్నారనే సమాచారం తెలియడంతో పలువురు సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నాయి. ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు, ఆయన సతీమణి, కుమారుడు మంచు విష్ణు మంగళవారం ఉదయం ఆస్పత్రికి వచ్చి సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. సినీ నటి జయసుధ, ప్రముఖ నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, అల్లు అరవింద్, సినీ దర్శకులు రాఘవేంద్రరావు, ఎస్వీ కృష్ణారెడ్డి తదితరులు దాసరిని పరామర్శించేందుకు ఆస్పత్రికి వచ్చారు. తన గురువు దాసరి నారాయణరావు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, ఆయన అందరికీ కావలసిన వ్యక్తి అని మోహన్‌బాబు చెప్పారు.

Advertisement
Advertisement