10 రోజుల్లో నివేదిక ఇవ్వండి 

14 Dec, 2023 04:37 IST|Sakshi

భూ సంబంధిత సమస్యలు, ధరణిపై సమగ్ర వివరాలివ్వాలి 

ధరణిపై సమీక్షలో అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం 

పోర్టల్‌ను ఎలా డిజైన్‌ చేశారు?.. పోర్టల్‌ నిర్వహించే కంపెనీలకు ఉన్న చట్టబద్ధత ఏమిటి? అంటూ ప్రశ్నలు  

ధరణికి, రైతుబంధుకుసంబంధమేంటని అడిగిన రేవంత్‌ 

ఏమీ లేదన్న అధికారులు.. నివేదికలో అదే రాయాలని ఆదేశం 

‘కోనేరు’ కమిటీ తరహాలో అధ్యయన కమిటీకి యోచన 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని భూసంబంధిత సమస్యలు, ధరణి పోర్టల్‌ అంశాలపై పది రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ‘ధరణి పోర్టల్‌ను ఎలా డిజైన్‌ చేశారు? భూ రికార్డులు అందులో ఎలా భద్రపరిచారు? సదరు డేటా ఎక్కడ ఉంది? పోర్టల్‌ నిర్వహిస్తున్న కంపెనీ కాంట్రాక్టు ఎప్పటివరకు ఉంది? ఆ కంపెనీ మళ్లీ ఎందుకు వేరే కంపెనీలకు లీజుకిచ్చింది? ఈ పోర్టల్‌ నిర్వహిస్తున్న, నిర్వహించిన కంపెనీలకు ఉన్న చట్టబద్ధత ఏంటి? ఒకవేళ పోర్టల్‌లోని రికార్డులు కరప్ట్‌ అయి వివరాలన్నీ పోతే రాష్ట్రంలోని భూములకు మాన్యువల్‌ రికార్డులు అందుబాటులో ఉన్నాయా? ఈ పోర్టల్‌ ద్వారా వస్తున్న దరఖాస్తులు ఏడాదిన్నరగా ఎందుకు పెండింగ్‌లో ఉంటున్నాయి?’ అని ప్రశ్నించారు.

అన్ని అంశాల తో నివేదిక రూపొందించిన తర్వాత మళ్లీ సమావేశమవుదామని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కోనేరు రంగారావు కమిటీ తరహాలో రాష్ట్రంలోని భూసమస్యల అధ్యయనానికి క మిటీ కూర్పుపై అధ్యయనం చేయాలని చెప్పారు. భూదాన్, అసైన్డ్‌ భూముల అంశాలపై ఇంకోసారి సమావేశమై సమగ్రంగా చర్చిద్దామని అన్నారు. బు ధవారం మధ్యాహ్నం సచివాలయంలో ధరణి పోర్ట ల్‌ నిర్వహణపై సీఎం సమీక్ష నిర్వహించారు.

డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, సీఎస్‌ శాంతికుమారి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్‌ఏ నవీన్‌ మిత్తల్, అధికారులు, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది, కాంగ్రెస్‌ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, భూచట్టాల నిపుణుడు సునీల్‌కుమార్, రెవెన్యూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

అధికారులపై ప్రశ్నల వర్షం 
సమీక్ష సందర్భంగా సీఎంతో పాటు పలువురు మంత్రులు రెవెన్యూ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘నారాయణపేట జెడ్పీ చైర్మన్‌ ధరణి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. తన దరఖాస్తు పరిష్కారం కాకపోగా ఆ డబ్బులు మీరు తిరిగి ఇవ్వలేదు. ఆయన కోర్టుకు వెళ్లి తన డబ్బులు తనకివ్వాలని ఆర్డర్‌ తెచ్చుకున్నా మీరు స్పందించలేదు.

ధరణి పోర్టల్‌ కింద చేసుకునే ప్రతి దరఖాస్తుకు రైతుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు? ఎందుకు వసూలు చేస్తున్నారు? ఆ డబ్బులు నేరుగా ప్రభుత్వ ఖాతాకే వస్తున్నాయా? ప్రైవేటు కంపెనీకి వెళ్లి మళ్లీ ప్రభుత్వానికి వస్తున్నాయా? భూముల రికార్డులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండడం వల్ల భూ యజమానుల హక్కులకు భంగం కలుగుతుంది కదా? డేటాను దుర్వినియోగం చేయకుండా నియంత్రించే మెకానిజం ఏంటి? స్లాట్‌ బుక్‌ చేసుకున్న తర్వాత రద్దు చేసుకుంటే ఆ డబ్బులు రైతులకు ఎందుకు ఇవ్వడం లేదు? నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూములపై విచారణ సుమోటోగా ఎందుకు చేయొద్దు? నోషనల్‌ ఖాతా అంటే ఏంటి? ఆ ఖాతాలో భూములెందుకున్నాయి? 31 కాలమ్స్‌ ఉన్న పహాణీలో 16వది అయిన అనుభవదారు కాలమ్‌ ఎందుకు తీసేశారు?..’ అని రేవంత్‌  ప్రశ్నించారు.   

నివేదికపై సంతకం పెట్టి ఇవ్వండి 
ధరణి పోర్టల్‌కు, రైతుబంధుకు సంబంధమేంటని సీసీఎల్‌ఏ మిత్తల్‌ను సీఎం ప్రశ్నించారు. సంబంధమేమీ లేదని మిత్తల్‌ చెప్పగా, ఇదే విషయాన్ని ప్రభుత్వానికి ఇచ్చే నివేదికలో పొందుపర్చాలని రే వంత్‌ సూచించినట్టు తెలిసింది. నివేదికను పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ రూపంలో కాకుండా అధికారికంగా సంతకం పెట్టి ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

వైఎస్‌ జగన్‌ వేగం మీకెందుకు లేదు? 
కాంగ్రెస్‌ హయాంలో రెవెన్యూ సదస్సులు పెట్టిన తీరు, అనుసరించాల్సిన విధివిధానాలపై కాంగ్రెస్‌ నేత కోదండరెడ్డి నివేదికను సమర్పించారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి ఉన్న వేగం మీకెందుకు లేకుండా పోయిందని ప్రశ్నించారు. భూముల సర్వే, టైటిల్‌ గ్యారంటీ, అసైన్డ్‌ భూముల చట్టం, కౌలు రైతుల చట్టం అమలు లాంటి విషయాల్లో జగన్‌ వేగంగా దూసుకుపోతుంటే మీరేం చేశారని ప్రశ్నించారు.  

కమిటీ ఏర్పాటు చేయండి: భూమి సునీల్‌ 
రాష్ట్రంలోని భూసమస్యలపై సమగ్రంగా ఆలోచించాల్సిన సమయం వచ్చిందని, ఈ సమస్యలపై అధ్యయనం చేయడానికి ఓ కమిటీని ఏర్పాటు చేయాలని భూమి సునీల్‌ కోరారు. భూ సంబంధిత అంశాలపై ఆయన ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. సాదా బైనామాల చట్ట సవరణ చేయాలని, రెవెన్యూ సదస్సులు పెట్టి సుమోటోగా రైతుల సమస్యలు పరిష్కరించాలని సూచించారు.  

పెండింగ్‌లో 2.30 లక్షల దరఖాస్తులు
సమీక్షలో భాగంగా రెవెన్యూ శాఖ, సీసీఎల్‌ఏ అధికారులు ధరణిపై పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. ఈ పోర్టల్‌ ద్వారా భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం రూపొందించిన మాడ్యూల్స్‌లో ఎన్ని దరఖాస్తులు వస్తే ఎన్ని పరిష్కారమయ్యాయో వివరించారు. టెక్నికల్‌ మాడ్యూల్‌ 1 నుంచి టీఎం 33 వరకు మొత్తం 2.30 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, 1.80 లక్షల ఎకరాలకు పాస్‌ పుస్తకాలు ఇవ్వాల్సి ఉందని తెలిపారు.

సమీక్షలో కాంగ్రెస్‌ నేతలు అన్వేష్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, మన్నె నర్సింహారెడ్డి, మల్‌రెడ్డి రాంరెడ్డి, ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, రాజ్‌ ఠాకూర్‌లతో పాటు ట్రెసా ప్రతినిధులు వంగ రవీందర్‌రెడ్డి, కె.గౌతమ్‌కుమార్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం తరఫున వి.లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

>
మరిన్ని వార్తలు