అవినీతి కన్నా మతతత్వంతోనే ముప్పు

8 Aug, 2017 03:22 IST|Sakshi
అవినీతి కన్నా మతతత్వంతోనే ముప్పు
‘ది హిందూ’ చైర్మన్‌ ఎన్‌. రామ్‌
- ఎన్నికల అవినీతిని ఈసీ కూడా నిరోధించలేకపోతోంది
నోట్ల రద్దు లబ్ధి కేంద్రానికే పరిమితమైంది.. లక్ష్యాలేవీ నెరవేరలేదు
పార్టీలకు కార్పొరేట్‌ ‘ఫండింగ్‌’ ఉన్నంతకాలం కుంభకోణాలుంటాయ్‌
‘వై స్కామ్స్‌ ఆర్‌ హియర్‌ టు స్టే’ పుస్తకావిష్కరణ 
పాలన పూర్తిగా అవినీతి రహితమని అనలేం: కేటీఆర్‌
 
సాక్షి, హైదరాబాద్‌: మారణహోమాలకు దారితీసే మతతత్వ వాదం, దేశాన్ని అమ్మేసే పెట్టుబడిదారీ విధానాలే అవినీతి కన్నా అత్యంత ప్రమాదకరమని ది హిందూ దినపత్రిక చైర్మన్‌ ఎన్‌.రామ్‌ అభిప్రాయపడ్డారు. ‘‘అవినీతి నిరోధానికి దేశంలో సమర్థ చట్టాలున్నా అవి అమలు కావడం లేదు. అవినీతి నిర్మూలనకు లోక్‌పాల్‌ చట్టం తెచ్చినా ఇప్పటికీ లోక్‌పాల్‌నే నియమించలేదు. ఎన్నికల్లో అవినీతిని కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిగా నిరోధించలేకపోతోంది’’ అన్నారు. ఆయన రాసిన ‘వై స్కామ్స్‌ ఆర్‌ హియర్‌ టు స్టే’ పుస్తకావిష్కరణ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్‌ మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దుతో కేంద్ర ప్రభుత్వానికే రాజకీయ లబ్ధి చేకూరింది తప్పితే అవినీతి, ఉగ్రవాదం, దొంగ నోట్ల నిర్మూలన వంటి అసలైన లక్ష్యాలు నెరవేరలేదన్నారు. ఆర్బీఐకి చేరిన రద్దైన నోట్ల లెక్కలను కూడా కేంద్రం ఇప్పటికీ బయట పెట్టలేదని చెప్పారు. పెద్ద నోట్లను రద్దు చేసినా ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా డబ్బు వెదజల్లి ఓటర్లను ప్రలోభ పెట్టారని, కొన్ని నియోజకవర్గాల్లో ఒక్కో ఓటరుకు రూ.6 వేల దాకా ఇచ్చారని విమర్శించారు.
 
గుప్త విరాళాలతో మరింత అవినీతి
పార్టీలకు బాండ్ల రూపంలో గుప్త విరాళాలిచ్చేందుకు వీలు కల్పిస్తూ కేంద్రం తెచ్చిన చట్ట సవరణతో రాజకీయ అవినీతి మరింత పెరుగుతుందని రామ్‌ జోస్యం చెప్పారు. పార్టీలకు కార్పొరేట్‌ ఫండింగ్‌ను నిషేధించనంత వరకూ కుంభకోణాలు జరుగుతూనే ఉంటాయన్నారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వోద్యోగులు, న్యాయ వ్యవస్థ, పత్రికా వ్యవస్థల వంటివేవీ అవినీతికి అతీతం కాదన్నారు. ‘‘రాజీపడే, పట్టుదల లేని పాత్రికేయంతో అవినీతిపై యుద్ధం చేయలేం. దశాబ్ద కాలంగా మీడియా ప్రమాణాలు పడిపోయాయి. పత్రికలకు ప్రత్యామ్నాయంగా సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చినా రాజకీయ ప్రత్యర్థులను ద్వేషించడం వంటి ధోరణులు పెరుగుతున్నాయి’’ అన్నారు. 2009 ఎన్నికల సమయంలో పెయిడ్‌ న్యూస్‌ కుంభకోణం బయటపడిందని గుర్తు చేశారు.
 
మీడియా బాధితులమని చెప్పుకోబోం
పూర్తిగా అవినీతి రహిత పాలన అందిస్తున్నామని తాము చెప్పుకోవడం సాధ్యం కాదని ఈ సందర్భంగా కేటీఆర్‌ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రమూ అలా చెప్పుకోలేదని ఆయనన్నారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో అవినీతి నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. స్వతంత్రం వచ్చి 70 ఏళ్లవుతున్నా గ్రామీణ ప్రజలకు తాగునీరు, రోడ్లు, విద్యుత్‌ వంటి కనీస సదుపాయాలు అందటం లేదంటే పాలకుల అవినీతి వల్లేనని విమర్శించారు. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పు వచ్చిందన్నారు. మీడియాలో తమపై ఎలాంటి విమర్శలొచ్చినా ఎదుర్కొని పట్టుదలతో పనిచేస్తామే తప్ప తమను మీడియా బాధితులుగా చెప్పుకోబోమన్నారు. 
 
జీఎస్టీ ఓ ప్రయోగమే: కేసీఆర్‌
సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం ఉండాలన్న లక్ష్యంతో అమల్లోకి తెచ్చిన వస్తుసేవల పన్ను (జీఎస్టీ) ఓ ప్రయోగమని.. దాని ఫలితాలు ఎలా ఉంటాయనేది వేచి చూడాల్సి ఉందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. హిందూ దినపత్రిక మాజీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ ఎన్‌.రామ్‌ సోమవారం ప్రగతిభవన్‌లో సీఎంను కలిశారు. ఆయన ఇటీవల రాసిన ‘వై స్కామ్స్‌ ఆర్‌ హియర్‌ టు స్టే’పుస్తకాన్ని సీఎంకు అందించారు. ఈ సందర్భంగా సీఎం ఆయనతో పలు అభిప్రాయాలను వెలిబుచ్చారు. ‘‘జీఎస్టీ ఓ ప్రయోగం. ప్రపంచంలో చాలా దేశాలు ఈ విధానం తెచ్చాయి. కానీ అమల్లో ఏర్పడిన ఇబ్బందులతో చాలా దేశాలు వెనక్కి తగ్గాయి. మన దేశంలో ఏమవుతుందో చూడాలి. పన్నుల శ్లాబుల విషయంలో కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. కేంద్రానికి వినతులు అందుతున్నాయి. కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి..’’అని చెప్పారు. గోదావరి, కృష్ణా నదుల్లో చాలినంత నీళ్లున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటే తెలంగాణ, ఏపీ బాగుపడతాయని వ్యాఖ్యానించారు.
>
మరిన్ని వార్తలు