9 వరకు గడువు పొడిగింపు | Sakshi
Sakshi News home page

9 వరకు గడువు పొడిగింపు

Published Tue, Aug 8 2017 3:19 AM

Medical seats entry extension of up to 9

- వైద్య సీట్ల ప్రవేశాలపై వెసులుబాటు
ఆలోపు చేరకుంటే సీటు రద్దే..
కాళోజీ వర్సిటీ వీసీ వెల్లడి
 
సాక్షి, హైదరాబాద్‌: ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల మొదటి దశ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులు కాలేజీల్లో చేరే గడువు పొడిగిస్తూ కాళోజీ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులు ఆగస్టు 9న సాయంత్రం 5 గంటల్లోపు కాలేజీల్లో జాయినింగ్‌ రిపోర్టు ఇవ్వాలని వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి తెలిపారు.  విద్యార్థులు గడువులోపు కాలేజీల్లో చేరకపోతే సీట్లు రద్దవుతాయన్నారు. కాలేజీల్లో చేరని అభ్యర్థులను 2017–18 విద్యాసంత్సరం తదుపరి కౌన్సెలింగ్‌లకు అనుమతించబోమని స్పష్టం చేశారు. 
 
అన్ని కాలేజీలకు లేఖలు..
ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల మొదటి దశ కౌన్సెలింగ్‌లో పాల్గొన్న అభ్యర్థులు ఆగస్టు 9 వరకు చేరేందుకు అనుమతి ఇవ్వాలంటూ   అన్ని వైద్య కాలేజీల ప్రిన్సిపాళ్లకు కాళోజీ వర్సిటీ రిజిస్ట్రార్‌ లేఖలు రాశారు.  అభ్యర్థులు విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, వార్షిక బోధన ఫీజు, మిగిలిన సంవత్సరాలకు ఫీజు చెల్లింపు బాండ్‌ తీసుకోవాలని పేర్కొన్నారు. సీటు పొంది, గడువులోపు ప్రవేశం పొందని అభ్యర్థుల వివరాలను ఆగస్టు 10 మధ్యాహ్నం ఒంటి గంటలోపు అప్‌లోడ్‌ చేయాలని ప్రిన్సిపాళ్లకు సూచించారు.
 
125 ఎంబీబీఎస్‌ సీట్లు ఖాళీ
రాష్ట్రంలోని అన్ని కాలేజీలకు ఏ, బీ, సీ కేటగిరీ ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్ల భర్తీకి మొదటి దశ కౌన్సెలింగ్‌ ఈ నెల 5న ముగిసింది. తాజా వివరాల ప్రకారం ప్రైవేట్‌ కాలేజీల్లో 80, ప్రైవేట్‌ మైనారిటీ కాలేజీల్లో 45 కలిపి మొత్తంగా 125 సీ కేటగిరీ ఎంబీబీఎస్‌ సీట్లు ఖాళీగా ఉన్నాయి. బీడీసీ సీట్లు 155 ఖాళీగా ఉన్నాయి. రెండో దశ కౌన్సెలింగ్‌కు ఆగస్టు 10న కాళోజీ విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉంది. 

Advertisement
Advertisement