పునరుజ్జీవనానికి తొలి అడుగు

10 Aug, 2017 04:25 IST|Sakshi
పునరుజ్జీవనానికి తొలి అడుగు

కాళేశ్వరం నుంచి ఎస్సారెస్పీ ఎత్తిపోతలకు నేడే శ్రీకారం   
నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ వద్ద ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌


సాక్షి, హైదరాబాద్, నిజామాబాద్‌: ఎగువ నుంచి ప్రవాహాలు రాక.. ఆయకట్టుకు నీరం దించలేక ఆపసోపాలు పడుతున్న శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పునరుజ్జీవానికి గురువారం తొలి అడుగు పడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎస్సారెస్పీకి నీటిని ఎత్తిపోసే పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది.

కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రోజుకు ఒక టీఎంసీ చొప్పున 60 రోజుల పాటు 60 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా దీనికి రూపకల్పన చేసింది. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని ముప్కాల్‌ వద్ద ఉన్న వరద కాల్వ హెడ్‌రెగ్యులేటర్‌ ప్రాంతంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఈ పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. అనం తరం అక్కడే జరిగే బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తారు. ఈ మేరకు కేసీఆర్‌ బుధవారం సాయంత్రమే నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఎస్సారెస్పీ గెస్ట్‌హౌజ్‌కు చేరుకున్నారు.

భారీ ఆయకట్టు ఉన్నా..
ఎస్సారెస్పీ కింద స్టేజ్‌–1లో 9.68 లక్షల ఎకరాలు, స్టేజ్‌–2లో 5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నా... ఎన్నడూ పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరందిన దాఖలాలు లేవు. ఎగువ నుంచి ప్రవాహాలు రాకపోవడం, కాలువలు సరిగా లేకపోవడం, పూడిక కారణంగా నిల్వ సామర్థ్యం 112 టీఎంసీల నుంచి 80 టీఎంసీలకు పడిపోవడం వంటివి దీనికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో రోజూ కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి తరలించే 2 టీఎంసీల నీటిలో ఒక టీఎంసీ నీటిని వరద కాల్వ ద్వారా ఎస్సారెస్పీకి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూ.1,067 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. 15 నెలల్లో దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

కాల్వలకు రూ.873 కోట్లు
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పరిధిలోని ప్రధాన కాల్వలను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 284 కిలోమీటర్ల మేర కాల్వలను  పునరుద్ధరించి.. వాస్తవ ప్రవాహ సామర్థ్యానికి అనుగుణంగా నీరు పారేలా ఆధునీకరించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు రూ.873.61 కోట్లు కేటాయిస్తూ.. నీటి పారుదల శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌కే జోషి బుధవారం ఉత్తర్వులు కూడా జారీ చేశారు.

ఎస్సారెస్పీ పరిధిలోకి వచ్చే కాకతీయ ప్రధాన కాల్వ సహా, సరస్వతి, లక్ష్మి, సదర్‌మఠ్‌ కాల్వల్లో ఎస్సారెస్పీ నుంచి మానేరు (146 కిలోమీటర్‌) వరకు ఉన్న కాల్వ ప్రవాహ సామర్థ్యం 9,700 క్యూసెక్కులుకాగా... చాలాచోట్ల పూడిక చేరడం, పిచ్చిమొక్కలు, సిమెంట్‌ నిర్మాణాలు దెబ్బతినడంతో సామర్థ్యం 5వేల క్యూసెక్కులకు పడిపోయింది. ఇక మానేరు దిగువన 146 కిలోమీటర్‌ నుంచి 284 కిలోమీటర్‌ వరకు కాల్వ సామర్థ్యం 8,505 క్యూసెక్కులుకాగా.. 3 వేల క్యూసెక్కులకు పడిపోయింది. దీంతో ఈ 284 కిలోమీటర్ల పొడవునా కాల్వల పునరుద్ధరణకు రూ.873.61 కోట్లతో అనుమతులిచ్చారు.


ఇదీ షెడ్యూల్‌..
సీఎం కేసీఆర్‌ గురువారం ఉదయం 10.30 గంటలకు ఎస్సారెస్పీ అతిథిగృహం నుంచి బయలుదేరి ప్రాజెక్టు వరద కాల్వ వద్ద జీరో పాయింట్‌ వద్దకు చేరుకుంటారు. అక్కడ ‘శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పునరుజ్జీవన పథకం’ పైలాన్‌ను ఆవిష్కరించి.. పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం తిరిగి అతిథి గృహానికి చేరుకుంటారు. మధ్యాహ్నం భోజనం అనంతరం 1.10 గంటలకు ప్రాజెక్టు సమీపంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.

భారీగా సభ ఏర్పాట్లు
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు వద్ద బహిరంగ సభను విజయవంతం చేసేందుకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీగా జన సమీకరణ చేపట్టాయి. పునరుజ్జీవన పథకం ద్వారా లబ్ధి పొందే ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్‌ జిల్లాలతో పాటు, నిర్మల్‌ జిల్లా నుంచి 3 నుంచి 5 లక్షల మంది వరకు జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మంత్రి ఈటల రాజేందర్‌ ఈ సభ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు.

చివరి ఎకరాకూ నీరివ్వడమే మా ఆశయం
‘‘ఎస్సారెస్పీ కాల్వలు పునరుద్ధరణ జరగకపోవడంతో ఏనాడూ 6 లక్షల ఎకరాలకు మించి నీరు పారలేదు. మహారాష్ట్ర అడ్డగోలుగా ప్రాజెక్టులు కట్టాక ఎస్సారెస్పీకి నీటి ప్రవాహాలే కరువయ్యాయి. అందుకే ఎస్సారెస్పీలో ఎప్పుడూ సమృద్ధిగా నీరుంచే లక్ష్యంతో కాళేశ్వరం నుంచి జలాలను తరలించే పునరుజ్జీవన పథకాన్ని రూ.వెయ్యి కోట్లతో చేపట్టాం. భూసేకరణ లేకుండా ప్రాజెక్టును ప్రతిపాదించాం. ప్రాజెక్టు చివరి ఆయకట్టు వరకూ నీరందాలన్నదే మా లక్ష్యం’’     
– టి.హరీశ్‌రావు, నీటి పారుదల శాఖ మంత్రి

ఇక మేలోనే వరి నాట్లు వేసుకోవచ్చు
ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులు ఇక ముందు మే నెలలోనే వరి నాట్లు వేసుకోగలిగిన పరిస్థితి వస్తుందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. 10 నెలల్లో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పునరుజ్జీవన పథకం పనులను పూర్తి చేసి, ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరందిస్తామని చెప్పారు. ఈ మేరకు వేగంగా పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నిజామాబాద్‌ ప్రాజెక్టు గెస్ట్‌హౌజ్‌లో బస చేసిన సీఎం .. నీటి పారుదల శాఖ ఇంజనీర్లతో కొద్దిసేపు సమీక్షించారు. ఈ పథకం పనులు పూర్తయితే ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులు ఏటా ఖరీఫ్‌లో ఎండలు మండే మే నెల మొదటి వారంలోనే తుకాలు పోసుకుని.. మే చివరి వారం నాటికి నాట్లు వేసుకునేందుకు అవకాశముంటుందన్నారు.

మరిన్ని వార్తలు