భానుడి భుగభుగలు

15 Apr, 2016 02:45 IST|Sakshi
భానుడి భుగభుగలు

కొత్తగూడెంలో ఏకంగా 49 డిగ్రీలు
ఓపెన్ కాస్ట్ వద్ద 52 డిగ్రీలకు చేరిక!
ఇప్పుడే మే స్థాయిలో మంటెత్తుతున్న ఎండలు
మణుగూరు, నిజామాబాద్, రామగుండం, మెదక్‌ల్లోనూ అగ్ని వర్షం
మరో రెండు రోజులూ రాష్ట్రం నిప్పుల కొలిమే
ప్రజలు ఎండలో తిరగొద్దని కలెక్టర్ల హెచ్చరికలు

 
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఇప్పటికే చండప్రచండంగా చెలరేగుతూ చుక్కలు చూపుతున్న భానుడు గురువారం మరింత మండిపోయాడు. దాంతో ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో గురువారం రికార్డు స్థాయిలో 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది! అక్కడికి చేరువలోని ఓపెన్ కాస్ట్ గనుల వద్దయితే ఏకంగా 52 డిగ్రీలకు చేరుకుందని అనధికార లెక్కలు చెబుతున్నాయి!! దాంతో ఆ ప్రాంతమంతా అక్షరాలా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. కొత్తగూడెంలో బుధవారమే 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం తెలిసిందే. వచ్చే రెండు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగేలా ఉండటంతో కొత్తగూడెంలో 50 డిగ్రీలు నమోదవడం ఖాయమంటున్నారు.

గతేడాది ఓపెన్ కాస్టు గనుల వద్ద మే నెలలో ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈసారి ఏప్రిల్ రెండో వారంలోనే ఇంతటి ఎండలుంటే, ఇక మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం మణుగూరులో 45 డిగ్రీలు, నిజామాబాద్‌లో 43.6,  మెదక్ పట్టణంలో 43.4, రామగుండంలో 43.3 , జగిత్యాలలో 43, కరీంనగర్‌లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండకు తోడు వడగాడ్పులు కూడా తీవ్రంగా ఉండటంతో పగటివేళ వెలుపలికి రావాలంటేనే జనం జంకుతున్నారు.

చెట్ల నీడన కూర్చున్నా వడగాలులు బెంబేలెత్తిస్తున్నాయి. వచ్చే రెండు రోజుల్లో కూడా తెలంగాణలో పలుచోట్ల 42-45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వడగాలుల ప్రభావమూ తీవ్రంగా ఉంటుందని వాతావరణ పరిశోధన కేంద్రం హెచ్చరించింది. ప్రజలు అత్యవసర పనులుంటే తప్ప ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 మధ్య బయటకు రావద్దని పలు జిల్లాల కలెక్టర్లు హెచ్చరికలు జారీ చేశారు.


 హైదరాబాద్‌కు కాస్త ఊరట...
 సముద్ర గాలుల ప్రభావంతో ఏర్పడ్డ తేమతో కొన్ని చోట్ల వాతావరణం మేఘావృతం కావడంతో రాష్ట్రంలో కొన్నిచోట్ల ఎండ తీవ్రత గురువారం స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్‌లో బుధవారం 43 డిగ్రీలు నమోదవగా గురువారం 41.5కు తగ్గింది. గత మూడు రోజులతో పోలిస్తే వాతావరణం కొంత చల్లబడటంతో జనం ఊపిరిపీల్చుకున్నారు. మణుగూరు, మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి తదితర చోట్ల సాయంత్రం చినుకులు పడి చల్లబడింది. కానీ ఎండ తగ్గినా ఉక్కపోతతో జనం ఇబ్బంది పడ్డారు. వచ్చే రెండు రోజుల్లో చినుకులు కురిసే అవకాశం లేనందున మళ్లీ భానుడు నిప్పులు చెరిగే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు